తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోరు తీవ్రస్థాయిలో సాగుతోంది. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గాంధీభవన్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టో 42 పేజీల్లో వుంది. ప్రధానంగా 62 హామీలు ఉన్నాయి. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.
గతంలో ఆరు గ్యారెంటీలకు అదనంగా ఈ మ్యానిఫెస్టో వుంది. అయితే మ్యానిఫెస్టోలో భారీ హామీలను పరిశీలిస్తే బడ్జెట్ ఎంతవుతుంది? అంత మొత్తంలో తీసుకురావడం సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్తో కాంగ్రెస్ నేతలు పోల్చారు. ఇంత వరకూ బాగానే వుంది. అయితే అలివికాని హామీలిస్తే, ఆచరణకు నోచుకోవనే భావన ప్రజానీకంలో తలెత్తితే పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
మ్యానిఫెస్టో తమను గట్టెక్కిస్తుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. ప్రతి హామీని నెరవేరుస్తామని వారు నమ్మబలుకుతున్నారు. మ్యానిఫెస్టోలని ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, 3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం, ఫిబ్రవరి 1 నుంచి జూన్ వరకూ గ్రూప్ ఉద్యోగాల నోటిఫికేషన్, ప్రతిరోజూ సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్, కొత్తగా ట్రిపుల్ ఐటీలు, 18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ. 10లక్షల వడ్డీ లేని రుణం.
నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సాయం, రైతు కూలీలకు రూ. 12 వేలు ఆర్థిక సాయం, ధరణి పోర్టల్ రద్దు, అమరవీరుల కుటుంబంలో ఒకరికి నెలకు రూ.25 వేలు గౌరవ వేతనం, ఆరోగ్య శ్రీ పథకం రూ. 10 లక్షలకు పెంపు, ప్రతి విద్యార్థికి రూ. 5లక్షల విద్యా భరోసా కార్డు తదితర హామీలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదలైంది. ఈ మ్యానిఫెస్టోను ప్రజలు ఎంత మేరకు విశ్వసిస్తారో డిసెంబర్ 3న ఫలితాలు వెలువడడాన్ని బట్టి తెలుస్తుంది.