హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీపై జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. మళ్లీమళ్లీ ఇలాంటి అవకాశం వస్తుందో, రాదో అనుకుని, ఇదే అదునుగా మోదీ గొప్పతనం గురించి తెగ పొగడ్తలు కురిపించారు. తెలంగాణ ఎన్నికల కోసం జరుగుతున్న సభ అనే గ్రహింపు పవన్‌లో కొరవడింది. ఇదేదో ప్రధాని అభినందన సభ అనుకుని, పవన్‌కల్యాణ్ చెలరేగిపోయారు.
2047 నాటికి దేశాన్ని ఉన్నతంగా నిలపాలని శ్రమిస్తున్న ప్రధాని మోదీకి అందరూ అండగా నిలవాలని పవన్ కోరారు. 30 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని మోదీ కేవలం పదేళ్లలో సాధించారని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, రామ మందిర నిర్మాణాన్ని ధైర్యంగా చేశారని మోదీని ప్రశంసించారు.
కరోనా సమయంలో దేశ ప్రజానీకాన్ని మోదీ ఆదుకున్నారని, విదేశాంగ విధానం, చంద్రయాన్-3 విజయవంతం, ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఎదగడంతో సహా అన్ని విజయాలను సాధించారని పవన్ ప్రశంసించారు.
అయితే మోదీకి అందరూ అండగా నిలవాలని కోరుతున్న పవన్‌కల్యాణ్, తాను మాత్రం ఆ పని ఎందుకు చేయడం లేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మోదీకి అండగా నిలవని విషయాన్ని నెటిజన్లు తెరపైకి తెచ్చారు. బీజేపీతో పొత్తులో వుంటూ, టీడీపీతో రాజకీయ కార్యకలాపాలు సాగించడాన్ని… మోదీకి అండగా నిలబడడం అంటారా? అని నెటిజన్లు నిలదీస్తున్నారు.
ఎన్నెన్నో ఘన కార్యాలు మోదీ సాధించడం దేవుడెరుగు… ఏపీలో బీజేపీతో కలిసి పవన్‌ను పని చేయించలేకపోవడం మోదీ ఫెయిల్యూర్ కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మోదీపై ప్రశంసిస్తే చాలు, రాజకీయంగా ఎంత అరాచకంగా ప్రవర్తించినా బీజేపీ క్షమిస్తుందని పవన్ అనుకుంటున్నారనే చర్చకు తెరలేచింది.