బీజేపీలో వన్ అండ్ ఓన్లీగా ఉంటున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖకు వస్తున్నారు. ఈ నెల 11న సాయంత్రం ఢిల్లీ నుంచి డైరెక్ట్ గా ఆయన ప్రత్యేక విమానంలో విశాఖలో ల్యాండ్ అవుతారు. ఏడు గంటలకు విశాఖలో జరిగే మీటింగులో ఆయన ప్రసంగిస్తారు. రాత్రికి విశాఖలోనే బస చేస్తారు.
మరుసటి రోజు విశాఖలోని పలు దేవాలయాలు సందర్శిస్తారు అని పార్టీ వర్గాలు తెలిపాయి. 12న మధ్యాహ్నం అమిత్ షా తిరిగి ఢిల్లీకి వెళ్తారని తెలుస్తోంది. అమిత్ షా విశాఖ పర్యటనను జయప్రదం చేయాలని బీజేపీ ఒక వైపు కష్టపడుతోంది.
అమిత్ షాకు తాము కూడా స్వాగతం పలుకుతామని విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యమకారులు ఉబలాటపడుతున్నారు. తమది నిరసన స్వాగతం అని వారు చెప్పడమే కమలం పార్టీకి కలవరం రేపుతోంది. అమిత్ షా విశాఖ రాక కంటే ఒక రోజు ముందే ఉక్కు కార్మికులు నిరసనలు చేపట్టనున్నారు.
ఈ నెల 10, 11 తేదీలలో వారు విశాఖ ఉక్కు కర్మాగారం వద్ద విశాఖ నగరంలో ఆందోళనలు పెద్ద ఎత్తున నిర్వహించడం ద్వారా అమిత్ షా కు ఉక్కు సెగ ఏంటో చూపించనున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ కాకుండా చూడాలంటూ కార్మికులు చేస్తున్న ఆందోళన ఈ నెల 11 నాటికి 850 రోజులు పూర్తి అవుతోంది.
ఈ హిస్టారికల్ డే వేళ అమిత్ షా రావడంతో మరింత దూకుడుగా ఉక్కు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు బీజేపీకి వ్యతిరేకంగా గొంతు విప్పనున్నారు. అమిత్ షా విశాఖ సభలో ఒక హామీ ఇవ్వాలని విశాఖ ఉక్కు ని ప్రైవేట్ కానీయబోమని మాట ఇవ్వాలని ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షాకు బీజేపీ స్వాగతం తో పాటు ఉక్కు స్వాగతం కూడా దక్కడంతో ఏది హైలెట్ అవుతుందన్నది చూడాలి.