నిన్న జూన్ 8, 2023 తో నేను రచయితగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అలా పూర్తి చేసుకున్న రచయితలు చాలామంది ఉండవచ్చు కానీ నా మటుకు నాకు విశేషమే. అది రాసేనాటికి నాకు 21 ఏళ్లు. 50 ఏళ్లయినా నేనింకా జీవించి ఉన్నాను. రచయితగా చురుగ్గా ఉన్నాను. కితం మార్చి నుంచి ఒక ఏడాది కాలంలో దాదాపు 50 కథలు (అనువాదాలతో సహా) రాశాను. ఒక పాఠకుడిగా చెప్తున్నాను. కొందరు రచయితలు 20, 25 ఏళ్ల పాటు ఉధృతంగా రాసి, తర్వాత చప్పబడి పోతారు. కొందరు క్రమేపీ స్టేల్ అయిపోతారు. మరి కొందరికి రాయాలన్న ఆసక్తి చచ్చిపోతుంది. నన్ను నేను ఎనలైజ్ చేసుకున్నపుడు ఫిక్షన్, నాన్-ఫిక్షన్ రెండూ రాయడమే నా కెరియర్ దీర్ఘంగా ఉండడానికి కారణమనుకుంటాను. నాన్ ఫిక్షన్ కోసం బాగా చదవుతాం కాబట్టి ఫిక్షన్కై కొత్త సబ్జక్టులు దొరుకుతాయి. ఫిక్షన్ రాసే ఒడుపును నాన్-ఫిక్షన్ రాయడానికి ఉపయోగిస్తే రీడబిలిటీ పెరుగుతుంది. ఈ కెరియర్లోకి వద్దామనుకునే వారి కోసం యీ వాక్యాలు రాశాను.
ఇక యీ తొలి రచన గురించి చెప్పాలంటే, నేను చిన్నప్పణ్నుంచీ పాఠకుణ్నే కానీ రచయితను కాను. మా స్కూలు, కాలేజీలలో మ్యాగజైన్లు వెలువడలేదు కాబట్టి, నేను వాటికి కథలు రాసే సందర్భమూ రాలేదు. అప్పట్లో హాస్య మాసపత్రికలు వస్తూంటే జోక్స్ పంపేవాణ్ని. కొన్ని పడ్డాయి. ఒక చిన్న కథ కూడా పడింది. కాలేజీ చదువైపోయాక, ఉద్యోగాన్వేషణలో ఉండగా రాసిన కథ యిది. అప్పట్లో స్కెచ్ అనే ప్రక్రియ పాప్యులర్‌గా ఉండేది. ఇది ఆ విభాగం లోదే! గత యిరవై ఏళ్లలో నేను కథాసంకలనాలు వేసినా దేనిలోనూ దీన్ని చేర్చలేదు. కథలా అనిపించదు కాబట్టి! రచన గొప్పగా అనిపించకపోవడం మరో కారణం. కానీ అప్పట్లో మేటి వీక్లీ ‘‘ఆంధ్రపత్రిక’’ వేసింది కాబట్టి దానిలో ఎంతో కొంత మెరిట్ ఉంటుందన్న నమ్మకంతో మీ ముందుకు తెస్తున్నాను. ఒక రచయిత తొలి రచన ఎలా ఉందో గమనించడానికి కూడా యిది పనికి వస్తుంది.
మొదటిసారి షేవింగ్ గురించి రాసిన కథ కాబట్టి ‘అదే మొదటిసారి’ అని పేరు పెట్టాను. ఉర్దూ నేర్చుకుంటున్న నా మిత్రుడు యశ్వంతరావు శేషగిరి రావు ‘పహ్లీ హజామత్’ అనే పేరు సూచించాడు. అప్పట్లో ఉపశీర్షిక పెట్టడం ఫ్యాషన్. అందువలన ‘పహ్లీ హజామత్’ అను రక్తపాతపు కథ’ అని పేరు పెట్టి పంపించాను. ఆ పేరుతోనే ఆమోదించినట్లు 1973 మార్చి 2 న ఉత్తరం వచ్చింది. అప్పట్లో యింటిమేషన్ ఎలా ఉండేదో కూడా తెలుస్తుందని ఆ ఫోటో కూడా పెట్టాను. 08061973 సంచికలో కథను ప్రచురించారు. కథ వేసేటప్పుడు ‘రక్తపాతపు కథ’ అనేది తీసేశారు. రచయితగా నా పేరు ఎం.బి.ఎస్. ప్రసాద్ అని చాలాకాలమే రాసుకునేవాణ్ని. కానీ ఆ పేరు ఎవరికీ గుర్తుండేది కాదు. ఎంవీఎస్సా అనేవారు. తెలుగు రచయితల్లో యింటిపేర్లు రాయనిదే గుర్తింపు ఉండదని చాలామంది చెప్పారు. కానీ నాకు యింటిపేరు వాడడం యిష్టం లేదు. అందువలన పేరును డిఫరెంట్‌గా (ఉడ్‌హౌస్ పాత్ర స్మిత్ ‘పి’ చేర్చుకున్నట్లు) ఒక పాతికేళ్లగా రాయడం మొదలుపెట్టాను. యస్ అనకూడదని ఎస్ అనాలని నాకు తెలుసు. కానీ మధ్యలో అచ్చు రావడం తెలుగు సంప్రదాయం కాదు కాబట్టి ఎమ్బీయస్ అనే రాయసాగాను.
ఈ కథ ఆంధ్రపత్రికలో రావడం గర్వకారణమే అయినా, ఆ ఉత్సాహంతో దీని తర్వాత నేను ధారాళంగా ఏమీ రాయలేదు. 1976 మధ్యలో ‘‘జ్యోతి’’ మాసపత్రికలో మూడు హ్యూమరస్ స్కెచ్‌లు రాశాను. 1974 నుంచి కొన్ని రేడియో నాటకాలు రాశాను. 1987లో నా తొలి ఇంగ్లీషు కథ ప్రచురించబడింది. 1990లో రెండు, 1991 ఒకటి రాశాను. ‘కాగితాలబొత్తి’ తెలుగు కథ 1994లో ఆంధ్రప్రభ వీక్లీలో వచ్చింది. 1995 నవంబరు నుంచి ‘‘రచన’’లో నా ‘అచలపతి కథలు’ సీరీస్ రావడంతోనే నాకు రచయితగా గుర్తింపు ప్రారంభమైంది. తొలి కథ పడిన 22 ఏళ్లలో నేను రాసినవి 10 కథలు మాత్రమే. దీనికి కారణం నాలోని విమర్శకుడు నాలోని కథకుణ్ని రాయనిచ్చేవాడు కాదు. రాయకపోతే నష్టమేముంది అని అడిగేవాడు. రాసినది నచ్చక పదేపదే దిద్దేవాణ్ని. మ్యానుస్క్రిప్టులో అది చాలా కష్టం. కంప్యూటరులో తెలుగు లిపి వచ్చి, ఎడిటింగు సౌలభ్యం అందుబాటులోకి రావడంతో నా రచనావ్యాసంగం పెరిగింది.
ఇప్పటికి కనీసం 350 కథలు, దానికి పదిరెట్లు వ్యాసాలు రాసి ఉంటాను. చాలా కథలకు ప్రథమ బహుమతులు వచ్చాయి. 2009లో హాస్యరచయితగా తెలుగు యూనివర్శిటీ వారి కీర్తి పురస్కారం వచ్చింది. 2011లో మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితి, 2014లో దిల్లీ తెలుగు ఎకాడమీ అవార్డులు వచ్చాయి. ఇటీవలే ‘‘జర్నలిస్టు డైరీ’’ వారి అఛీవర్స్ ఎవార్డు వచ్చింది. సాధన వలన పనులు సమకూరు ధరలోన అనేది నా బోటి వాళ్లలో నిజమౌతుంది. అయితే నా పరిమితులు నాకున్నాయి. నా పేరు చెప్పగానే ఏ కథా చప్పున గుర్తుకు రాదు. నన్ను ఎవరైనా పరిచయం చేస్తే పేరెక్కడో విన్నామండీ అంటారంతే. తెలుగులో ప్రసిద్ధ రచయితల కథా సంకలనాలు, ప్రతీ ఏడాది తానా వాళ్లు వెలువరించే కథాసంకలనాలు, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా వెలువడే కథా సంకలనాలు.. వీటిల్లో వేటిలోనూ నా కథలను చేర్చరు. రెండు హాస్య కథాసంకలనాల్లో మాత్రం నా కథలున్నాయి. వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కథారచయితగా కంటె ముళ్లపూడి సాహితీసర్వస్వం సంపాదకుడిగా మాత్రమే నాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. రచయితగా ‘ఆల్సో రేన్..’ స్థాయి మాత్రమే! ఇక 50 ఏళ్ల క్రితం అప్పటి పోలికలతో, వర్ణనలతో వెలువడిన కథ (స్కెచ్) చదవండి.
పహ్లీ హజామత్__ ఎం.బి.ఎస్. ప్రసాద్
ఇది నేను మొదటిసారి గడ్డం గీసుకోవడం గూర్చి వ్రాసిన కథ. ‘గడ్డం గీసుకోవడం గురించి కథ వ్రాయడం కూడానా!’ అని మీరు అనుకోవచ్చు, చిరాకు పడవచ్చు. అగ్గిపుల్ల కవితా వస్తువు అయినప్పుడు, గడ్డం గీసుకోవడం కథా వస్తువు కావడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. నిజానికి అగ్గిపుల్ల వెనకాతల ఎంత పరిశ్రమ అయితే ఉందో గడ్డం గీసుకోవడం వెనుక కూడ అంతకంటె ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. రేజర్లు, బ్లేడ్లు, షేవింగ్ క్రీములు, డెట్టాల్స్ యివన్నీ తయారు చేసే పరిశ్రమలు ఎంత పెద్దవంటారు! అందుచేత గడ్డం గీసుకోవడానికి కూడా చాలా ప్రాధాన్యం ఉందంటాను నేను. ఆదీగాక జాతి, కుల, మత, దేశ వివక్షత లేకుండా గొప్ప, బీద అనే తారతమ్యం లేకుండా ప్రతీ మొగవానికీ ఇది తప్పనిసరి వ్యవహారం. గడ్డం గీసుకోవడానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి మీకు ఈ కథ గూర్చి ఆక్షేపణేమీ ఉండదనుకుంటాను.
‘నీకున్న సంపద ఏమిటి?’ అని అడిగితే ‘కేశసంపద మాత్రమే’ అని చెప్పగలిగే వాళ్లలో నేనొకణ్ణి. నాకు గడ్డం వస్తోందని మొదటిసారిగా పసిగట్టినవాడు, మా ఆస్థాన క్షౌరికుడు. ఆ రోజు క్రాపు చెయ్యడం అయిపోయిన తరువాత ‘అబ్బాయి గారూ, గెడ్డం కూడ చేసెయ్యమంటారా?’ అని అతననడంతో పీకల దాకా ముసుగు కప్పబడ్డ నేను తెల్లబోయాను. ‘ఆఁ అబ్బే అబ్బే అప్పుడే ఎందుకు’ అన్నాను తడబడుతూ. ఇంటికి రాగానే అద్దంలో మొహం చూసుకొని ఎంతో గర్వించేను. ‘ఆడదానికి రజస్వల అయిన తర్వాత పెద్ద తరహా వచ్చినట్లే మగాడికి గెడ్డం గీసుకున్న తర్వాత వస్తుందని’ మా మాస్టారు ఒకసారి అన్నారు. నేను కూడ ఒక పెద్ద మనిషిని అవుతున్నందుకు ఎంతో సంతోషించాను. ఆ భావం నాలో రాగానే కుర్రకుంకతనం పోయి, ఒక విధమైన హుందాతనం వచ్చినట్లు కూడా ఫీలయ్యాను.
కానీ నా ఈ ఉత్సాహం ఎక్కువకాలం నిలవలేదు. నా మిత్రులు కొంతమంది, నా కన్నా వయస్సులో పెద్దవారు, నన్ను హెచ్చరించారు. ‘నాయనా! గెడ్డం తీసుకోవడం ఏదో గొప్ప అనుకొంటున్నావు గామోసు. గీసుకోడం మొదలు పెట్టగానే సరికాదు. రేపుంది, రేజర్ల పండుగ! ఒకసారి గీసుకోవడం మొదలెడితే అప్పట్నించి ప్రతీసారి చచ్చినట్లు గీసుకోవాలి. గెడ్డం మాసిపోయాక గీసుకోకపోతే అహ్యంగా ఉంటుంది. ప్రొద్దున్నప్పుడు మనకు ఖాళీ ఉండదు, సాయంకాలం గీసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోరు. మనకు ఏ నాడో తీరిక అయి గీసుకోడానికి చూస్తే బ్లేడు వుండదు. గడ్డం చేసుకుందామని అనుకొని మానేస్తే వీధి లోకి వెళ్ళడానికి సిగ్గు వేస్తుంది. వెళ్ళినా ‘మ్రొక్కా. జబ్బు పడ్డావా, భగ్న ప్రేమికుడవా?’ అని ప్రతీవాళ్ళూ వేళాకోళం చేస్తారు. ఈ బాధలన్నీ మేం పడుతున్నాము కాబట్టి నీకు ఇచ్చే సలహా యేమిటంటే యిప్పుడిప్పుడే ఈ కార్యక్రమం మొదలు పెట్టొద్దు. కనీసం ఒక యేడాదైనా ఆగు. యీ సందర్భంగా మేం ఇచ్చే మరో సలహా యేమిటంటే మంగలి చేత చెంపలు గీయించేటప్పుడు వాడు క్రిందదాకా గీసేస్తుంటే నువ్వు వద్దని వారించు. లేకపోతే నీకు చెంపల మీద వెంట్రుకలు బాగా పెరిగి చింపాజీ లాగ తయారవుతావు.’ అని హెచ్చరించారు.
ఈ మాటలు నామీద బాగా పని చేశాయి. వాళ్ళు చెప్పిన ప్రతి అక్షరం నిజమని నమ్మేను. నిజానికి ప్రతీరోజూ గెడ్డం గీసుకుంటూ విసుక్కునే వాళ్లని చాలామందిని చూసేను. ఈ బాధలు పడేకంటే చక్కగా గడ్డం పెంచడమే నయమనే వుద్దేశ్యానికి వచ్చాను. ఈ నా నిర్ణయం మూలంగా గడ్డం ధారాళంగా, యితోధికంగా పెరిగినా గీసే ఆలోచన తలపెట్టలేడు. చక్కగా జోడియాక్ మాన్లా పెంచాలనే భావంతోనే నేను ఉండేవాణ్ని. నా క్లాసులో తోటి విద్యార్థులు నెమ్మదిగా గడ్డాలు గీయడం మొదలు పెట్టారు కానీ నేను మాత్రం సున్నితంగా, నూనూగులో ఉన్న నా గడ్డాన్ని నిమురుకుంటూ వాళ్లని చూసి జాలి పడేవాణ్ని. నా మిత్రుడొకడు ఈర్ష్యతో ఒళ్ళు మండి, ఒకసారి గీస్తేనే గానీ గడ్డం బాగా రాదనీ, జోడియాక్ మ్యాన్‌లా పెరగదని దడిపించేదు.
నేను మళ్ళీ ఇరుకున పడ్డాను. గడ్డం చేసుకోమని అంతరాత్మ ఘోషించ సాగింది. కానీ ముందు వారిచ్చిన ప్రవచనాల బలం దీనిని తోసిరాజంది. పోనీ మీనం ఒమార్ షరీఫ్లా రావాలన్నా కొద్దిగా పెరగాలి కదా. కత్తెరతో కత్తిరిస్తే గుబురుగా పెరుగుతుంది కదా అని ఓ రోజు సాయంత్రం ఎవరూ లేకుండా చూసి నెమ్మదిగా కత్తెర తీసి కత్తిరించడం మొదలు పెట్టారు. ముందు కొద్దిగా ఎడమ చేతి వైపు కత్తిరించేను. తరువాత కుడి వైపుకు వచ్చేను. కుడివైపు కొద్దిగా ఎక్కువగా తెగి పల్చగా అయిపోయింది. ‘కోతి – రొట్టె ముక్క’ కథ గుర్తుకొచ్చింది. తక్షణం అది అమలు లోకి వచ్చింది. చివరికి ఎడను చేతి వైపు చివర బాగా పల్చగా (యించుమించు పూర్తిగా తీసేసినట్లుగా) అయిపోయింది. నేను హడిలిపోయాను. ‘ఛ, ఏమిటి ఇంత అసహ్యంగా ఉంది’ అనుకుని కొద్దిగా కాటుక పట్టుకొచ్చి అక్కడ పులిమాను. బాగా నల్లగా కనబడి కాలిన మచ్చలా తయారయింది. శుభ్రంగా కడిగేసి కొద్దిగా బొగ్గుమసి పూసి షికారుకి బయల్దేరాను. ఒక ఫ్రెండ్ ఆది దగ్గర్నుంచి చూసి ‘ఏమిటండోయ్, మీకు మసి అంటుకుందే’ అంటూ, గమ్మున నేను వారించేలోగా తుడిచేశాడు. తక్షణం ఫెళ్లున నవ్వి, ‘ఇదేమిటండోయ్ రుక్మిలాగ’ అన్నాడు. నా బాధ వర్ణనాతీతం. తక్షణం ఇంటికొచ్చేశాను.
మళ్ళీ మూడు రోజుల దాకా బయటికి వెళ్ళలేదు. నాకు గడ్డం కొద్దికొద్దిగా పెరిగి మొహం అంతా ఏదో లతలాగ అల్లుకొంది. మా బంధువులంతా నేను కనపడ్డప్పుడల్లా, ‘ఏమండోయ్ గడ్డం సాయిబు గారూ’ అనడం మొదలు పెట్టారు. మంచినీళ్ళు కనుక నిర్లక్ష్యంగా తాగితే నీళ్ళు చెంపల మీదుగా కారి వెంట్రుకలు గడ్డం మధ్యకి అయస్కాంత క్షేత్రానికి ఆకర్షించబడినట్టు ఆకర్షించబడేవి! మేకగడ్డంలా తయారయేది. ‘పోన్లే, ఇది దక్షప్రజాపతి మోడల్ ఫేషన్’ అని నేను తృప్తిపడి ఊరుకున్నా మా వాళ్ళంతా చిరాకుపడడం మొదలుపెట్టారు. మంగలి కూడా నన్ను పీడించడం మొదలు పెట్టాడు. ఒక్కోసారి క్రాపు అయిపోగానే నన్నడక్కుండానే బ్రష్ పట్టుకొచ్చి సబ్బు గడ్డానికి పులిమేవాడు. నేను కడుక్కోలేక చచ్చేవాణ్ని.
చివరకు ఈ బాధలు పడలేక నేను గడ్డం గీసుకోడానికి విశ్చయం చేసుకున్నాను!!! ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగానే యిక దాని గురించి వివరాలు సేకరించ సాగాను. మంగలి చేత గీయిస్తే పొక్కులు వస్తాయని, సెలూన్లో గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుందనీ, ఒక మిత్రుడు హెచ్చరించడం వలన నేను స్వయంగానే గడ్డం గీసుకోదలచాను. ఎలక్ట్రిక్ షేవర్ కొందామనుకున్నాను. కానీ మధ్యలో కరెంటు పోయిందంటే ‘‘ఇద్దరు మిత్రులు’’లో పద్మనాభంలా పన్ను నొప్పంటూ చెయ్యి చాటెట్టుకొని సెలూనికి వెళ్ళాల్సిందే. అదీగాక ఆఫ్ట్రాల్ గెడ్డం గీసుకోడానికి అంత ఖర్చు పెట్టడానికి మా నాన్నగారు ఒప్పుకోలేదు. షేవింగ్ సెట్టు కొందామని నిశ్చయించుకొన్న తర్వాత ఏ రేజర్ కొనమంటావని మరో మిత్రుణ్ణి అడిగేను. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా గుహ ద్వారాల్లా తెరుచుకొనే రేజర్ కొనకున్నాడు. సరే కదాని గిల్లెట్ రేజర్ కొన్నాను.
తరువాత ఏ బ్లేడ్ కొందామాని కొంతమందిని సంప్రదించేను. స్టెయిన్లెస్ స్టీల్‌ది కొంటే మంచిదే గానీ మొదటిసారి కనుక దానితో గీస్తే రాబందులు మీ ఇంటికి షికారు వస్తాయనీ, కొంతకాలం ఆర్డనరీది వాడి తర్వాత స్టీల్ వాడమని ఒక మిత్రుడు ఉద్బోధించేడు. బ్లేడు బ్రాండ్ మారిస్తే గడ్డం పాడైపోయి ముళ్ళగడ్డం తయారవుతుందని మరొకడు హెచ్చరించాడు. సరే కొంచెం జాగ్రత్తగా గీసుకుంటే ఫర్వాలేదు కదా’ అని స్టెయిన్ స్టీల్ బ్లేడు కొనబోయాను. స్విష్తో గడ్డం చేసుకొన్న మనిషి సాటిలేని మనిషై ఆయేషా లాటి వాళ్లని ఆకర్షిస్తాడని తెలుసుకొని స్విష్ కొన్నాను. ఇకపోతే షేవింగ్ క్రీమ్ కొట్లోకి వెళ్ళిచూస్తే దానిమీద సబ్బుతో కడుక్కొని తర్వాత యీ క్రీమ్ అప్లయి చేయమని ఉంది. దీనితోపాటు ఆ ఖర్చు కూడానా అని షేవింగ్ స్టిక్ (ఏళ్ల తరబడి ఉంటుందనే దేశవాళీ పొదుపు బుద్ధితో) కొన్నాను.
ఇక అద్దం మాట. మా యింట్లో నిలువుటద్దం బీరువాకి ఉంది. ఆదే మా కోశాగారం కూడాను. దానిముందు నుంచొని గెడ్డం గీస్తే లక్ష్మీదేవి కోపిస్తుందని మా నాన్నగారు ఒప్పుకోలేదు. అందువలన నేనొక చిన్న అద్దం, తక్కువ ఖరీదులో వస్తే కొన్నాను. పరికరాలు సమకూరేయి కనుక గడ్డం గీసే ముహూర్తం ఎపుడనే ప్రశ్న వచ్చింది. ఉగాది నాడు మొదలెడితే సంవత్సరమంతా ఫ్రెష్‌గా వుండొచ్చు కదా అనుకున్నాను. పండగ పూట యింట్లో క్షౌరశాల తెరిస్తే తోలు ఒలిచేస్తానని, ఉగాది పూటా ఇంట్లో హత్యచేయడం యిష్టం లేదనీ మా నాన్నగారు హెచ్చరించారు. ఇక చేసేది లేక ఆ ముందురోజే గడ్డం గీయడానికి పరికరాలన్నీ ముందు పెట్టుకొని ఓ గదిలో కూర్చున్నాను. మా నాన్నగారు సెలూన్లో తప్ప యింట్లో గడ్డం చేసుకోకపోవడం చేత, పిల్లల్లో నేనే పెద్దవాణ్సి కావడం నేను గడ్డం గీసుకుంటాననగానే మా తమ్ముడూ, చెల్లెలూ వేడుక చూడడానికి నా చుట్టూ మూగారు. వాళ్ళ ముందు గీసుకోవడానికి సిగ్గేసి వాళ్లని తరిమేసి తలుపు మూసేశాను.
ఒక కిటికీ దగ్గర నుంచొని అద్దం పెట్టబోయాను. ఏ యాంగిల్లో పెట్టినా అది కింద పడిపోయేటట్లో, లేకపోతే నా మొహం కనపడకుండానో, అదీకాకపోతే నుదురు మాత్రం కనబడటమో జరిగింది. ఓ పావుగంట తంటాలు పడి అది సూటిగా నా గడ్డాన్నే చూపించేట్లు పెట్టాను. తీరా చూస్తే వెలుగు అద్దం మీద పదుతోంది గానీ నా మొహం మీద పడటం లేదు. ఛ, ఛ సరిగ్గా లేదు అని మళ్లీ తంటాలు పడి యింకో పొజిషన్లో పెట్టాను. గడ్డానికి సబ్బు రాద్దామని చూస్తే ఆ స్టిక్ అస్సలు కరగటం లేదు, నురగ రావటం లేదు. ఒళ్లు మండి కొంత భాగాన్ని ముక్కలు చేసి, నీళ్లలో వేసి బాగా చిలక్కొడితే నురగ వచ్చింది. అది గడ్డానికి పులుముకుంటే మొహమంతా పాకిపోయింది. జాగ్రత్తగా కళ్లభాగం తుడుచుకుని ముందుకు సాగేను.
బ్లేడు రేజర్‌లో పెట్టి మెడ దగ్గర్నుంచి మొదలుపెట్టాను. చాలా స్మూత్‌గా వెళ్లిపోయింది. వెంట్రుకలు తెగుతున్నట్లే లేదు. ‘ఇదేమిటి, ఈకెతో చేసుకున్నట్లు ఉండేది పనామా బ్లేడు కానీ యిది కాదు కదా’ అని చూస్తే రేజర్ బ్లేడ్ ఉన్న ఎడ్జ్‌కి కిందున్న ఎడ్జ్‌తో గీస్తున్నానని అర్థమైంది. అయ్యో అనుకుని యాంగిల్ మార్చి మళ్లీ మొదలెట్టాను. ఒక చెంప సరిగ్గానే వచ్చింది. అవతలి చెంప కూడా బాగానే వచ్చిందనుకోవచ్చు. (ఒక చిన్నగాటు తప్పిస్తే) ఇక పర్వాలేదు అనుకుంటూ రేజరు క్రిందకు పోనిచ్చాను. నా దౌడ ఎముక అబ్రహాం లింకన్ బాపతు. ఆ మెట్టు దిగడం రేజరుకి కష్టమై పోయింది. కొంచెం హుషారుగా దింపబోయే సరికి చిన్న గాటు చేసింది. తెల్లటి నురుగు అటూయిటూ వుండగా మధ్యలో ఎఱ్ఱటి రక్తం చారలు కడుతూంటే మంచి కలర్ఫుల్గా ఉందని యింకొకరి విషయంలో అయితే మెచ్చుకునేవాణ్ని కానీ తెగింది నా గడ్డమే కాబట్టి తిట్టుకుని ప్రక్కనే ఉన్న పౌడరు అద్దాను. ఇకపోతే పెదవి క్రిందకు వచ్చేటప్పటికి అద్దం వైపు చూస్తే గుండె గుభేలుమంది. అది రెండు ముక్కలు అతికిన అద్దం కాబోలు, నా పెదవి సుమారు నా అంత లావుగా కనపడుతోంది.
ఎక్కణ్నుంచి గీయాలో తెలియక నేను కంగారు పడుతూండగానే రేజరు బలంగా దాని పని అది చేసుకుని పోయింది. రక్తం బొటబొటా కారసాగింది. నేను బాధ భరించలేక ‘బాబోయ్’ అని అరిచాను. మా యింట్లో జనమంతా పరిగెట్టుకొచ్చి తలుపు తెరిపించి నన్ను చూసి తెల్లబోయారు. మా అమ్మ నన్ను చూసి ఓదార్చవచ్చా! అబ్బే, అదేం లేదు. ‘అమావాస్య నాడు గడ్డాలు గీయడం మొదలెడితే ఏమవుతుందీ, చెబితే వింటేనా..’ అని మొదలెట్టింది. ఇదీ వరస! ఏం చెప్పమంటారు!
ఈ కథకు చిత్రం గీసినవారి పేరు ‘గంగా’
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)