Takkar Review: మూవీ రివ్యూ: టక్కర్

చిత్రం: టక్కర్ రేటింగ్: 1/5 తారాగణం: సిద్దార్థ్, దివ్యాన్ష, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్ తదితరులు సంభాషణలు: హను రావూరి సంగీతం: నివాస్ ప్రసన్న కెమెరా: వంచినాథన్ ఎడిటర్: గౌతం నిర్మాతలు: టిజి…

చిత్రం: టక్కర్
రేటింగ్: 1/5
తారాగణం: సిద్దార్థ్, దివ్యాన్ష, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునిష్కాంత్ తదితరులు
సంభాషణలు: హను రావూరి
సంగీతం: నివాస్ ప్రసన్న
కెమెరా: వంచినాథన్
ఎడిటర్: గౌతం
నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్
దర్శకత్వం: కార్తిక్ క్రిష్
విడుదల: జూన్ 9, 2023

లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడి కొత్తగా సదరు మాస్ హీరో మాదిరిగా ఏదో చెయ్యాలనే తపన సిద్దార్థ్ లో బయలుదేరింది. ఆ మధ్యన “మహాసముద్రం” లో మునిగి ఇప్పుడు ఈ “టక్కర్” తో ఎదురుపడ్డాడు. పైగా ఇది హిట్ సినిమాల బ్యానర్ గా పేరున్న పీపుల్స్ మీడియా వారి చిత్రం. విషయమేంటో చూద్దాం.

కథలోకి వెళితే గుణశేఖర్ (సిద్దార్థ్) బాగా డబ్బు సంపాదించాలనే ఆశతో వైజాగ్ లో ల్యాండ్ అవుతాడు. చిన్నా చితకా ఉద్యోగాలతో అవమానాలు ఎదుర్కుని విసిగిపోతాడు. మొత్తానికి కాస్త మంచి జీతం వచ్చే క్యాబ్ డ్రైవర్ గా సెటిల్ అవుతాడు. 

ఈలోగా బాగా డబ్బున్న లక్కీ (దివ్యాన్ష) ఆకర్షణలో పడతాడు. ఇంతలో ఆమె కిడ్నాప్ కి గురౌతుంది. కిడ్నాప్ చేసింది ఒక మాఫియా గ్యాంగ్. అనుకోకుండా గుణశేఖర్ అదే మాఫియా గ్యాంగుతో చిన్న గొడవపడి ఒక కారుని ఎత్తుకెళ్తాడు. ఆ కారు డిక్కీలోనే లక్కీని కిడ్నాప్ చేసి ఉంచారు ఈ గ్యాంగ్. మొత్తానికి అక్కడినుంచి మాఫియా గ్యాంగ్ నుంచి ఈ జంట ఎలా తప్పించుకుంటారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? ఇది తక్కిన కథ.

ఇంత సాదాసీదా కథని పట్టుకుని కథనాన్ని అల్లాలంటే చాలా కసరత్తు చెయ్యాలి. చేయి తిరిగిన స్క్రీన్ ప్లే, అదిరిపోయే డైలాగ్స్ ఉంటే తప్ప ఆడియన్స్ కి కూర్చోపెట్టడం కష్టం. బహుశా ఆ రెండూ పుష్కలంగా ఉన్నాయనుకునే తీసిన వాళ్లు తీయడానికి దిగి ఉండొచ్చు. కానీ అవి ఎంత పేలవంగా ఉన్నాయో ప్రేక్షకుల దయనీయ స్థితిని చూస్తే అర్ధమవుతుంది.  

ఏ సినిమాలోనైనా ఫష్టాఫ్, సెకండాఫుల్లో ఒకటి ఒకదానికంటే పర్వాలేదు అని చెప్పడానికుంటుంది. కానీ ఈ దర్శకుడు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. ఏ హాఫుకి అన్యాయం చేయకుండా రెండింటినీ పూర్తిగా పొడుకోబెట్టేసాడు. ఆద్యంతం విసుగు తెప్పించే అత్యంత ఘోరమైన చిత్రంగా నిలిచిపోయేవిధంగా మలిచాడు దర్శకుడు. విషయపరిజ్ఞానం లేకనో, ప్రేక్షకులని బాగా తక్కువ అంచనా వేస్తేనో తప్ప ఇలాంటి సినిమా తీయడం అసాధ్యం. 

టెక్నికల్ గా తీసుకుంటే కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక ఫైటింగులైతే చిరాకు పెట్టిస్తాయి. ఒకే ఒక్క పాట మినహా మిగిలిన సంగీతమంతా ట్రాషే. తక్కిన టెక్నికాల్ అంశాలగురుంచి చెప్పుకోవడం దండగ.  ఇంత కాలం చెల్లిన కామెడీ ట్రాక్, దయనీయమైన దర్శకత్వం, జీడిపాకంలా సాగే కథనం వెరసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి.

కథకి, కథనానికి, సంభాషణలకి ఎక్కడా పొంతన లేకుండా, పాత్రలకి, క్యారెక్టరైజేషన్స్ కి లింకు లేకుండా సాగిన చిత్రమిది. 

ఉదాహరణకి సిద్ధార్థ్ ఓనర్ చూడ్డానికి చైనా వాడిలా ఉంటాడు. ఎప్పుడు మాట్లాడినా శీర్షాసనం వేసుకుని మాట్లాదుతుంటాడు. అదెందుకో అర్థం కాదు. అలాగే అంతర్జాతీయ మాఫియాకి చెందిన ఒక మెయిన్ విలన్ సడెన్ గా యోగిబాబుతో వెర్రికామెడీ చేస్తాడు. ఇదెందుకో అస్సలు అర్థమవ్వదు. క్యారెక్టర్స్ కి, క్యారెక్టరైజేషన్స్ కి లింకు లేకపోవడమంటే ఇదే. 

సిద్దార్థ్ ఎప్పటిలాగానే చేసినా గెడ్డంతో కనిపించి కాస్త కొత్తగా ఉన్నాడు. అయినప్పటికీ మాస్ హీరో లుక్కు వెతికినా ఇతనిలో కనపడలేదు. ఈ పాత్రకి ఇతను ఫిట్ కాదు.

దివ్యాన్ష పాత్ర చాలా వీక్ గా ఉంది. యోగిబాబు కామెడీ తేలిపోయింది. అభిమన్యు సింగ్ రొటీన్ గా ఉన్నాడు. 

ఈ చిత్రరాజాన్ని చివరిదాకా విసుగు చెందకుండా చూసిన ప్రేక్షకులకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వొచ్చు. మంచి చిత్రాలే కాదు, ఇలాంటి దారుణమైన సినిమాల్ని కూడా అందించగలమని నిరూపించుకున్న పీపుల్స్ మీడియాకి, అభిషేక్ అగరవాల్ ని ప్రత్యేకంగా సత్కరించొచ్చు. 

సాధారణంగా సినిమా బాగోగపోతే తలనొప్పో, తలబొప్పో అంటాం. కానీ “టక్కర్” అంటేని గుద్దుకోవడం. ఈ సినిమాకెళ్తే సీటు బెల్టు లేకుండ 90 స్పీడులో డ్రైవ్ చేసి దేనినో గుద్దుకున్న అనుభూతి కలుగుతుంది. ఇక మీ ఇష్టం.

బాటం లైన్: తల పగులుతుంది