ఎస్వీటీ ట్రావెల్స్.. మీ భద్రతే మా ప్రాధాన్యం అనేది ఈ ట్రావెల్స్ పెట్టుకున్న ట్యాగ్ లైన్. ఇప్పుడు అదే భద్రతను గాలికి వదిలేశారు. బస్సు టాప్ పై కూడా ప్రయాణికుల్ని ఎక్కించారు. అదే వాళ్ల పాలిట శాపమైంది. బస్సు అదుపు తప్పింది. ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 10మంది వరకు మృతి చెందారు. ప్రమాద తీవ్రత బట్టి చూస్తుంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా ఉంది.
కర్నాటకలోని హోసకోట నుంచి పావగడకు బయల్దేరింది ఎస్వీటీ ట్రావెల్స్ బస్సు. అప్పటికే చాలా సేపట్నుంచి ఆ రూట్ లో బస్సు లేకపోవడంతో.. అంతా ఒక్కసారిగా ఈ ట్రావెల్స్ బస్సు ఎక్కారు. అప్పటికే ఓవర్ లోడ్ తో ఉన్న ఆ బస్సు టాప్ పైకి డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఎక్కారు.
ఇలా ఓవర్ లోడ్ తో వెళ్తున్న బస్సు, ఓ మలుపు వద్ద బోల్తాపడింది. అదే సమయంలో ఆందోళనకు గురైన విద్యార్థులు, బస్సు టాప్ పై నుంచి కిందకు దూకారు. అలా దూకిన విద్యార్థులే ఎక్కువమంది మృతుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.
ఈ ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న ప్రయాణికుల్ని బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు తరలించారు. మిగతా వాళ్లకు పావగడ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో బస్సులో 45 నుంచి 50 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. టాప్ పై ప్రయాణిస్తున్న విద్యార్థులు వీళ్లకు అదనం.