ఆ మధ్య భీమ్లా నాయక్ ఫంక్షన్ కి బండ్ల గణేష్ కి ఇన్విటేషన్ రాలేదనే విషయం పెద్ద రచ్చ అయింది. తన అభిమానులతో బండ్ల.. బండ బూతులు మాట్లాడిన ఫోన్ కాల్ వైరల్ అయింది. ఆ తర్వాత బండ్ల సైలెంట్ గా ఉంటారని అనుకున్నారంతా. కానీ ఆయన బాగా రెచ్చిపోయారు.
జనసేనని, జనసేనానిని మరో రేంజ్ లో పొగిడేస్తూ హైలెట్ చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభకోసం బండ్ల వేసిన ట్వీట్లు, చేసిన ఎలివేషన్.. మరీ ఓవర్ అనిపించేలా ఉన్నా.. జనసైనికులకు అదే కావాలి కాబట్టి అక్కడితో సరిపోయింది. దేవర జెండాకి కర్రనౌతా.. దేవర రథ చక్రానికి కీలునౌతా అంటూ.. త్రివిక్రమ్ పంచ్ డైలాగుల్లాగే బండ్ల పంచ్ డైలాగులు కూడా జనసైనికులకు బాగా వెర్రెక్కించాయి.
ఇదంతా దేని కోసం..
బండ్ల ట్వీట్లు, ఎలివేషన్లు చూస్తుంటే కచ్చితంగా ఆయన జనసేనపై కన్ను, కర్చీఫ్ రెండూ వేసినట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ అభిమానుల్ని, జనసైనికుల్ని బాగానే ఆకట్టుకుంటున్నారు బండ్ల. జనసేనతో ఏపీలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఏపీలో జనసేన తరపున ఇచ్చే టికెట్లలో ఒకటి కచ్చితంగా బండ్లకు రిజర్వ్ చేసి ఉంచుతారని అంటున్నారు.
ఆమాత్రం డబ్బులు ఖర్చు పెట్టగలిగే నేతలు జనసేనలో ఎలాగూ లేరు కాబట్టి.. పవన్ కల్యాణ్ కోటాలో బండ్ల టికెట్ కన్ఫామ్ అనే ప్రచారం కూడా ఉంది. ఆమధ్య అలీ విషయంలో కూడా బండ్ల జలసీ బయటపడింది కూడా. అందుకే బండ్ల కూడా రాజకీయాల్లో చేరి, ఏదో ఒక పదవి పొందేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాలనుకుంటున్నారు.
బ్లేడ్ బాబుకి.. అది సరిపోలేదా..?
అయితే బండ్ల పొలిటికల్ ఎంట్రీ తెలంగాణలో అట్టర్ ఫ్లాప్ అయింది. కాంగ్రెస్ ని నమ్ముకుని నిండా మునిగారు. మెడపైకి “బ్లేడ్” తెచ్చుకున్నారు. కానీ అక్కడితో ఆయన సరదా తీరలేదు. సినిమాల్లో ఎలాగూ సరైన క్యారెక్టర్స్ పడటంలేదు కాబట్టి.. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారట బండ్ల. మరి ఇక్కడ కూడా ఆయన సెలక్షన్ సరైనది కాదు అని తేలిపోతోంది.
జనసేనని నమ్ముకుని ఎన్నికల్లో దిగడం అనేది తెలివి తక్కువపనే అయినా బండ్లకు అంతకు మించిన ఆల్టర్నేట్ లేదు. వైసీపీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చినా టికెట్ దొరకని పరిస్థితి. అందుకే తన దేవరని నమ్ముకున్నాడు. ఈసారి పవన్ గెలవకపోతే సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ బదులు.. కత్తి-కత్తెర తెచ్చుకుంటానంటారేమో.