వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే ట్యాగ్ లైన్ తో ఒక వ్యక్తి.. ఒక మహిళను లైంగికంగా వేధించాడు. ఆమె ఆ గ్రామానికి వివోఏగా విధులు నిర్వర్తిస్తున్న మహిళ. వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదు. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. తదనంతర పరిణామాల్లో.. బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు? అసలు వ్యవహారాన్ని గమనిస్తున్నదా? పట్టించుకుంటున్నదా? లేదా? తమ పార్టీ నాయకుడుగా చెలామణీ అవుతున్న వ్యక్తి తప్పు చేశాడని నమ్ముతున్నదా లేదా? నమ్మితే అతడి మీద ఏం చర్య తీసుకున్నది? నమ్మకపోతే, అతడిని వెనకేసుకు వస్తున్నదా? అతడు పాల్పడిన లైంగిక వేధింపులను సమర్థిస్తున్నదా? లేదా సైలెంట్‌గా ఉంటే రెండ్రోజులకు అంతా సద్దుమణిగిపోతుంది లెమ్మని వేచిచూస్తున్నదా? ఇవన్నీ కృష్ణాజిల్లా భోగిరెడ్డి పల్లె లో నాగలక్ష్మి ఆత్మహత్య వార్తలను చదివే వారికి కలిగే సందేహాలు.
ఆ గ్రామంలో వీవోఏగా పనిచేస్తున్న గరికపాటి నాగలక్ష్మి అనే సదరు మహిళను, అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు గరికపాటి నరసింహారావు లైంగికంగా వేధించారు. ఆమె ఫిబ్రవరి 24వ తేదీనే బందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. వారు పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని అంటున్నారు. మార్చి 14న నాగలక్ష్మి నేరుగా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడ కూడా స్పందన రాలేదని ఆమె అంటున్నారు. మొత్తానికి 16వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 17న ఆస్పత్రిలో మరణించారు.
అయితే ఇదే వ్యవహారంపై పోలీసుల కథనం ఇంకోలా ఉంది. గత నెలలో ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత.. ఆ నాయకుడిని పిలిచి కౌన్సెలింగ్ చేశామని, ఈనెల 16న కేసునమోదు చేశామని, తర్వాత అరెస్టు కూడా చేశామని ఫోటోల సహా వేర్వేరు ప్రకటనల్లో తెలియజెప్పారు. చూడబోతే.. ఎస్పీకి ఫిర్యాదు చేసిన తర్వాత.. కాస్త పోలీసు వ్యవహారం కదిలినట్టు కనిపిస్తోంది. కానీ ఇక్కడ పోలీసులు ఎలా స్పందించారు? ఎంత నిర్లక్ష్యం చూపారు? ఎంత నాయకుల ఒత్తిడికి తలొగ్గారు? అనేది చర్చ కాదు. వైసీపీ పార్టీ ఏం చేస్తున్నది? అనేదే చర్చ!
తమ పార్టీ నాయకుడు.. ఒక మహిళను లైంగికంగా వేధించి, ఆమె మరణానికి కారణమయ్యాడు. మరి పార్టీ అతని మీద చర్య తీసుకోదా? ఇలాంటి లైంగిక వేధింపుల సంగతి మాత్రమే కాదు. పార్టీ నాయకుల మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణం (కనీసం) వారిని పార్టీనుంచి సస్పెండ్ చేసి.. ఆ ఆరోపణలన్నీ నిరాధారాలని, కల్పితాలని తేలిన తర్వాత తిరిగి పార్టీలో చేర్చుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా పాటిస్తే.. పార్టీకి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. కానీ.. ఒక మహిళ ప్రాణాలను తన వేధింపులతో బలిగొన్న తర్వాత కూడా పార్టీ గ్రామనాయకుడిని ఏమీ చేయలేని దుర్బల స్థితిలో అధికార పార్టీ ఉంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయి.
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం తపిస్తూ ఉంటారు. సీఎంలో మహిళల విషయంలో గౌరవం, చిత్తశుద్ధి ఉన్న మాట నిజం. ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం కూడా జగన్ చిత్తశుద్ధితో సాకారమైనదే. కానీ, దిశ చట్టం ప్రకారం కోర్టు విధించే శిక్షల సంగతి తర్వాత.. కనీసం జగన్ పార్టీలోని నాయకుడే ఇలాంటి నేరాలకు పాల్పడినప్పుడు.. కనీసం పార్టీపరమైన చర్య కూడా లేకపోతే ప్రజలు ఏం అనుకుంటారు.
దిశ చట్టం కావొచ్చు, మహిళలను కాపాడే మరో చట్టం కావచ్చు.. వైసీపీ తప్ప ఇతర పార్టీల వారు, సామాన్యులు చేసే తప్పులను శిక్షించడానికి మాత్రమే అనుకోరా? జగన్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలకు, ఆయన సొంత పార్టీ వారు అతీతులు అనే అభిప్రాయం ఏర్పడదా? ప్రజల దృస్టిలో ప్రభుత్వం, పార్టీ పరువు పోదా? అనే దిశగా వారు ఆలోచించాల్సి ఉంది.