ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించింది లగాయతు ఫ్యాన్స్ కుర్రాళ్ల గొడవ మామూలుగా లేదు. ఏ హీరో సినిమా వస్తే ఆ హీరో ఫ్యాన్స్ మరీ ఇంత తక్కువ రేట్లా? టీ రేటు కన్నా సినిమా రేటు తక్కువా అంటూ గడబిడ. సోషల్ మీడియాలో అదే పనిగా పోస్ట్ లు. ఇక ప్రతిపక్షాలు ఇదే అదనుగా నానా హడవుడి. సినిమా ఇండస్ట్రీని చంపేస్తున్నారంటూ. కానీ ఇదంతా ఇలా వుండగానే భారీ సినిమాలు వస్తే తెరవెనుక అడ్డగోలుగా పెంచి అమ్మేసారు. ఒకటి రెండు సినిమాలకు మినహా మిగిలిన వాటికి ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వదిలేసింది.
ఇదిలా వుంటే తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచేసారు. దాంతో ఫుట్ పాల్ పడిపోయింది అంటూ ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ఆంధ్రలో కూడా టికెట్ రేట్లు ఇండస్ట్రీ అడిగిన మేరకు కాకపోయినా, కాస్త అటు ఇటుగా పెంచారు. అది చాలదన్నట్లు ఆర్ఆర్ఆర్ సినిమాకు అదనంగా 75 రూపాయలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేసారు.
ఆర్ఆర్ఆర్ తొలివారం రేట్లు చూస్తుంటే అమ్మో అనిపించేలా వున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల ఫ్యాన్స్ బోలెడు మంది వున్నారు కనుక, తొలివారం ఏ రేటు అయినా నడిచిపోతుంది. కానీ వన్స్ ఫ్యాన్స్ చూడడం అయిపోతే మిగిలిన జనాలు ఏ మేరకు వస్తారు అన్నది చూడాలి. ప్రభుత్వం ఇచ్చిన రేట్లు చాలవన్నట్లు తొలి రోజు అయిదు వందలు, వెయ్యి రేట్లు వినిపిస్తున్నాయి.
మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే పెరిగిన రేట్ల మీద ఇప్పుడు కనీసం వెయ్యి నుంచి రెండు వేలు ఖర్చు కనిపిస్తోంది. వైకాపా యాంటీ మీడియా అప్పుడు సినిమా ఇండస్ట్రీ కుదేలు అయిపోతోందని వార్తలు వండి వారిస్తే, ఇప్పుడు జనాలు డబ్బున్నవాళ్లు అయిపోయారా అని నిలదీస్తోంది. టికెట్ రేట్ల పెంపు వ్వవహారం ఏటా వచ్చే డజను భారీ సినిమాలకు బాగానే వుంటుందేమో కానీ, మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలకు మాత్రం చాలా ఇబ్బంది పెట్టేలాగే కనిపిస్తోంది.
అసలే మిడ్ రేంజ్, చిన్న సినిమాలకు సరైన ఓపెనింగ్ వుండడం లేదు. మౌత్ టాక్ వుంటే తప్ప జనం థియేటర్ కు రావడం లేదు. సినిమా విడుదలయిన నెల రోజుల్లో ఓటిటి లోకి వస్తుందన్న విషయం జనాల్లోకి గట్టిగా వెళ్లిపోయింది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలను ఓటిటిలోనే చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. నాన్ థియేటర్ ఆదాయం పెరిగిందని సినిమా మొదలుపెడితే, ఆ ఆదాయం చూపించి హీరోలు గట్టిగా లాగేస్తున్నారు. దాంతో మళ్లీ థియేటర్ మీద రావాల్సిన అమౌంట్ అలాగే వుంటోంది. అది డెఫిసిట్ అయిపోతోంది.
గతంలో పది కోట్లలో కావాల్సిన సినిమా ఇప్పుడు 15 కోట్లకు చేరుకుంటోంది. దాంతో థియేటర్ మీద భారం అయిదుకోట్లు అలాగే వుంటోంది. అది కాస్తా రావడం అన్నది గ్యారంటీ లేదు. ముఖ్యంగా మిడ్ రేంజ్ సినిమాలకు మరీ కష్టంగా మారేలా కనిపిస్తున్నాయి పరిస్థితులు.
భీమ్లా నాయక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు కూడా చాలా ఏరియాలకు జిఎస్టీ వెనక్కు ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాదాపు నేరుగా డిస్ట్రిబ్యూట్ చేసిన రాధేశ్యామ్ నిర్మాతలు చాలా మొత్తం పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆడవాళ్లు మీకు జోహార్లు బయ్యర్లు 80 శాతం నష్టపోయారు. ఊపేస్తుంది అనుకున్న డిజె టిల్లు కనీసపు లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖిలాడీ సినిమా బయ్యర్లు కుదేలయిపోయారు. సామాన్యుడు, గుడ్ లక్ సఖి, హీరో చాలా సినిమాలు నష్టాలే చవిచూసాయి.
ఇప్పుడు కొత్త రేట్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ తరువాత వరుసగా అన్ని రకాల సినిమాలు వున్నాయి. టికెట్ రేట్లు, ఓటిటి ప్రభావం అప్పుడు పక్కాగా తెలుస్తుంది. క్లారిటీ వస్తుంది.