స్టార్ హీరోలకు ప్రభాస్ నేర్పిస్తున్న పాఠం

“ఇకపై ఏడాదికి 2 సినిమాలు చేస్తాను.” మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చాలామంది నోటి నుంచి వినిపించిన డైలాగ్ ఇది. కానీ ఏ ఒక్కరు ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను…

“ఇకపై ఏడాదికి 2 సినిమాలు చేస్తాను.” మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా చాలామంది నోటి నుంచి వినిపించిన డైలాగ్ ఇది. కానీ ఏ ఒక్కరు ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారు. మహేష్ లాంటి హీరో అయితే ఏడాది పొడుగునా సినిమా చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ సంగతి సరేసరి.

ఇలాంటి హీరోలంతా ప్రభాస్ ను చూసి నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. క్రేజ్ ను కాపాడుకోవడం అంటే ఏడాదికో సినిమా చేయడం కాదని, ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ పరిశ్రమను కూడా కాపాడాలంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. ఈ విషయంలో ప్రభాస్ మాటలతో సరిపెట్టకుండా, చేతలతో చూపిస్తున్నాడని అంటున్నారు.

పైన చెప్పుకున్న హీరోల్లానే ప్రభాస్ కూడా ఏడాదికి 2 సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. ఇచ్చిన మాట మీద నిలబడ్డాడు. ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ సినిమాల్ని విడుదల చేస్తున్నాడు. 2024కి ప్రాజెక్ట్-కె తో పాటు, మారుతి దర్శకత్వంలో చేస్తున్న సినిమాను రెడీ చేస్తున్నాడు. ఇక 2025 కోసం కూడా ఆల్రెడీ స్పిరిట్ మూవీని ప్రకటించి ఉంచాడు. త్వరలోనే మరో 2 సినిమాలు ఎనౌన్స్ చేయబోతున్నాడు.

ఇలా ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటకు కట్టుబడి, గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇదే పని ఇతర స్టార్స్ ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అనవసరపు లెక్కలు, కంటికి కనిపించని ఈక్వేషన్లు వేసుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటే.. మహేష్, చరణ్ కూడా అదే బాటలో నడవొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఈ విషయంలో ఒక హీరోతో మరో హీరోను పోల్చి చూడలేం. ఎవరి లైనప్ వారిది, ఎవరి ప్లానింగ్స్ వాళ్లవి. మరీ ముఖ్యంగా వర్కింగ్ స్టయిల్ లో కూడా హీరోల మధ్య చాలా తేడాలున్నాయి. ఈ వయసులో కూడా చిరంజీవి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారంటే, అది ఆయన స్టయిల్. మహేష్ స్టయిల్ వేరు.

సో.. హీరోలంతా సినిమాలు చేస్తారు. కొందరు ఫాస్ట్ గా చేస్తారు, మరికొందరు స్లోగా చేస్తారు. ఏ హీరో సినిమా ఎప్పుడొస్తే, ఆ హీరో అభిమానులు అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. కాకపోతే ప్రభాస్ అభిమానులకు ఇలాంటి సెలబ్రేషన్లు ఏడాదికి రెండొస్తాయి.