Advertisement

Advertisement


Home > Movies - Reviews

Vimanam Review: విమానం రివ్యూ

Vimanam Review: విమానం రివ్యూ

చిత్రం: విమానం
రేటింగ్: 2.25/5
తారాగణం: స‌ముద్రఖ‌ని, అన‌సూయ, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌ తదితరులు..
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)
సినిమాటోగ్ర‌ఫీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
విడుదల తేదీ: జూన్ 9, 2023

చాలామందికి విమానం అనేది కామన్ విషయం. చిన్న పిల్లలకు మాత్రం అదో ఎమోషన్. ఆ చిన్న పిల్లల్లో పేద పిల్లలకైతే అదో కల. అలాంటి ఓ నిరుపేద పిల్లాడికి విమానం అంటే విపరీతమైన పిచ్చి ఉండి, అతడు మరికొన్ని రోజుల్లో చనిపోతాడని తెలిస్తే.. గుండెలు పిండేంత బాధ. ఈరోజు రిలీజైన విమానం సినిమా కథ ఇదే. కాకపోతే 'గుండెలు పిండేసేంత' లేదు బాధ.

హైదరాబాద్ లోని బేగంపేట్ కు దగ్గర్లో ఓ మురికివాడ. అందులో సులభ్ కాంప్లెక్స్ నడుపుతుంటాడు వీరయ్య (సముద్రఖని). అదే సులభ్ కాంప్లెక్స్ ఎదురుగా ఆటో డ్రైవర్ డానీ (ధనరాజ్), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), అల్లంత దూరంలో వ్యభిచారం చేసుకునే సుమతి (అనసూయ) ఉంటారు. తల్లి లేని రాజు (మాస్ట‌ర్ ధ్రువ‌న్‌) అంటే వీరయ్యకు పంచప్రాణాలు. కానీ రాజుకు మాత్రం విమానం అంటే పంచప్రాణాలు. ఎలాగైనా విమానం ఎక్కాలనేది ఆ బుడ్డోడి కల. ఎప్పుడూ విమానం గురించే మాట్లాడుతుంటాడు. అలాంటి రాజు కొన్ని రోజుల్లో చనిపోతాడనే చేదు నిజం వీరయ్యకు తెలుస్తుంది. నిరుపేదైన వీరయ్య, రాజును విమానం ఎక్కించాడా లేడా? చివరికి రాజు-వీరయ్యల కథ ఏమైంది అనేది ఈ 'విమానం'.

టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఉంది. స్టోరీ మొత్తం విమానం చుట్టూనే తిరుగుతుంది. కానీ దాని చుట్టూ బలమైన భావోద్వేగాలు అల్లి, ప్రేక్షకుడ్ని కూడా విమానంలో ఎమోషనల్ జర్నీ చేయిస్తే బాగుండేది. పాయింట్ బాగానే ఉన్నా... సన్నివేశాల్లో బలం లేక ఈ విమానం ఎగరలేకపోయింది. ఎగిరిన కొద్దిసేపు కూడా ప్రయాణం భారంగా తోచేలా చేసింది.  

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న కొన్ని చిన్న సినిమాల్ని చూస్తున్నాం. "విమానం"లో కూడా ఉన్నది చిన్న పాయింట్. కాకపోతే బలమైన భావోద్వేగాల్ని పండించడంలో ఈ సినిమా ఫెయిలైంది. రీసెంట్ గా వచ్చిన బలగం సినిమాతో దీన్ని పోల్చలేం కానీ అది కూడా చిన్న సినిమానే కాబట్టి, చిన్న కంపారిజన్ చేసుకోవచ్చు. బలగంలో చాలా సన్నివేశాలు కదిలిస్తాయి, తెలియకుండానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి ఎమోషన్స్ ఇక్కడ లేవు. అంతా బలవంతపు సెంటిమెంట్ సన్నివేశాలే.

సముద్రఖని తన పాత్రకు న్యాయం చేశాడు. వీరయ్యగా అతడి నటన బాగుంది. కొడుకును విమానం ఎక్కించడం కోసం తాపత్రయ పడే కటిక పేదతండ్రిగా సముద్రఖని యాక్టింగ్ ను మెచ్చుకోవాల్సిందే. 'దరిద్రుడా' అంటూ దేవుడ్ని తిట్టే సన్నివేశంలో, క్లయిమాక్స్ సీన్స్ లో సముద్రఖనిలోని నటుడు మనకు కనిపిస్తాడు. ఈ సినిమాను ఎందుకు చూడాలనే ప్రాధమిక ప్రశ్నకు, ప్రధానమైన సమాధానం సముద్రఖని. ఇతడు లేకపోతే విమానం లేదు. ఈ పాత్రకు అతడు సొంతంగా డబ్బింగ్ చెప్పడం మెచ్చుకోదగ్గ ప్రయత్నమే అయినప్పటికీ, ఓ తెలుగు ప్రేక్షకుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంత డైలాగ్ డెలివరీ అందులో కనిపించలేదు.

ఈ సినిమాలో ప్రధానమైన సమస్య ఏంటంటే.. దర్శకుడు అన్ని రసాల్ని అందించే ప్రయత్నం చేయడం. డానీ, కోటి పాత్రలతో కామెడీ పండించాలనుకోవడం, అనసూయ పాత్రతో రసానుభూతి కలిగించాలని చూడడం, మీరా జాస్మిన్ పాత్రతో చివర్లో మరింత సెంటిమెంట్ పెట్టాలని చూడడం లాంటి ప్రయత్నాలు చేశాడు. ఇది చాలా పాత ఫార్ములా. ఎలాంటి డైవర్షన్లు లేకుండా, హంగు-ఆర్భాటాలు పెట్టుకోకుండా, కేవలం కథను నమ్మి, దాని చుట్టూ స్క్రీన్ ప్లే అల్లుకొని మెస్మరైజ్ చేసే సినిమాలొస్తున్న కాలం ఇది. ఇలాంటి టైమ్ లో కూడా దర్శకుడు ఇతర ఎలిమెంట్స్ కోసం పాకులాడినట్టు కనిపించింది.

దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కమెడియన్ రాజేంద్రన్ పాత్ర. ఈ సినిమాకు, అతడి పాత్రకు అస్సలు సంబంధం లేదు. అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్ పెట్టడం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇక రాహుల్ రామకృష్ణ, అనసూయ మధ్య సన్నివేశాలు ఈ జానర్ సినిమాలో అసందర్భంగా... ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. రాహుల్ రామకృష్ణ అనసూయ ఫోటోలను తన గోడపై పెట్టుకొని, తలుపులు మూసి ఏం చేస్తాడో మన ఊహకి దర్శకుడు వదిలేశాడు కానీ అతను చేసే పని ఏంటో అర్థమయ్యేలా మరో సీన్ లో చెప్పాడు. రాహుల్ రామకృష్ణ చేతికున్న 'జిగురు' మరో పాత్రధారి గుండుకు అంటింది అని చెప్పడం ఇలాంటి సినిమాలో అవసరమా?

ఆటోడ్రైవర్ గా ధనరాజ్ సెట్ అయ్యాడు కానీ, రాహుల్ రామకృష్ణ మాత్రం చెప్పులు కుట్టే వ్యక్తిగా అనిపించలేదు. వేశ్యపాత్రలో అనసూయ నటన ఓకె.  ఆమె కొంచెం లావెక్కిందేమో అనిపిస్తుంది. మాస్టర్ ధ్రువన్ బాగా చేశాడు.

దర్శకుడు శివప్రసాద్ యానాల మంచి పాయింట్ రాసుకున్నాడు కానీ, ఇంతకుముందే చెప్పుకున్నట్టు చాలా సన్నివేశాల్ని కృతకంగా తీశారు. చాలా సన్నివేశాలు 90ల నాటి తమిళ సెంటిమెంట్ సినిమాలు గుర్తు తెచ్చాయి.  

వివేక్ సినిమాటోగ్రఫీ బాగుంది. 2 గంటల 2 నిమిషాల ఈ సినిమాను ఇంకా కట్ చేస్తే బాగుండదేమో అని అక్కడక్కడ వదిలేసినట్టున్నాడు ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. జీ స్టుడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.

ఓవరాల్ గా ఓ మంచి పాయింట్ కు, పూర్తి స్థాయిలో ఎమోషన్స్ అద్దలేక, విమానాన్ని సగమే గాల్లోకి ఎగిరించి మధ్యలో ఆపేశాడు దర్శకుడు. ఓటిటిలో చూస్తే ఎలా ఉండేదో చెప్పలేం కానీ థియేటర్ అనుభూతికి మాత్రం ఇది కొంచెం భారంగానే తోస్తుంది.

బాటమ్ లైన్: సగమే ఎగిరింది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?