జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఎప్పుడూ నీడలా వెంట వుంటూ, పార్టీ కార్యకలాపాలను చక్కదిద్దే నాదెండ్ల మనోహర్‌కు టీడీపీ గట్టి షాక్ ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి నుంచి తాను పోటీలో వుంటానని రెండు రోజుల క్రితం నాదెండ్ల ప్రకటించారు. ఆ నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దడం తన ఆశయంగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా నాదెండ్లకు టికెట్ కేటాయిస్తారని అంతా అనుకున్నారు.
అయితే నాదెండ్ల ఆశలకు గండికొడుతూ తెనాలి టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ షాకింగ్ విషయాలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను తెనాలి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెనాలిలో జనసేనకు టికెట్ కేటాయిస్తారనే విషయాన్ని ఆయన పరోక్షంగా ఖండించారు. తెనాలిలో తాను పోటీ చేయనని సాగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.
అంతేకాదు, అవినీతికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరి గుండెల్లో నిద్రపోతా, ఖబడ్దార్ అని కూడా ఆయన హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆలపాటి ప్రకటనతో నాదెండ్ల మనోహర్ భవిష్యత్ ఏంటనే చర్చకు తెరలేచింది. నాదెండ్ల కోసం తన రాజకీయ భవిష్యత్‌ను పణంగా పెట్టడానికి సిద్ధంగా లేనని ఆలపాటి టీడీపీ అధిష్టానానికి తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన తెనాలిలో పోటీ చేస్తానని ధీమాగా ప్రకటించారని చెబుతున్నారు.
జనసేనలో నాదెండ్ల నంబర్ టూ లీడర్. అలాంటి నాదెండ్ల సీటుకే గ్యారెంటీ లేకపోతే, ఇక జనసేనను టీడీపీ ఏ విధంగా చూస్తుందో అర్థం చేసుకోవచ్చు. పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబు తదితర ముఖ్యమైన పది మంది నాయకుల సీట్లకు ఇబ్బంది ఉండదని జనసేన నేతలు అనుకున్నారు. కానీ వాస్తవానికి వస్తే, పరిస్థితులు అంత సులువుగా లేవని జనసేన నాయకులకు తత్వం బోధపడేలా ఆలపాటి రాజా చెప్పకనే చెప్పారు. తాను నమ్ముకున్న తెనాలి కాదని, ఇక సీటు కోసం కొత్తగా ఎక్కడ వెతుక్కోవాలో నాదెండ్లే తేల్చుకోవాలి.