బుల్లి తెరపై కామెడీ షోలకు జడ్జిగా మెగా బ్రదర్ నాగబాబు వ్యవహరించేవారు. తాను నవ్వుతూ, ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ఆయన తాపత్రయ పడేవారు. ఇదంతా భుక్తి కోసమే అని అనుకునేవాళ్లం. కానీ రాజకీయ తెరపై నాగబాబు పండిస్తున్న కామెడీ అంతాఇంతా కాదు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇటీవల దక్కించుకున్న నాగబాబు, పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు తిప్పలేవో పడుతున్నారు.
ఈ నెల 14న వారాహి యాత్ర అన్నవరం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖను విడుదల చేశారు. ఇందులోని ప్రతి అక్షరం నాగబాబులోని హాస్య చతురతను బయట పెట్టింది. బ్రహ్మానందం అదృష్టం కొద్దీ నాగబాబు సీరియస్‌గా కమెడియన్ పాత్రలు వేయలేదు. వెండితెరపై నాగబాబు కమెడియన్ పాత్రల్లో నటించి వుంటే, బ్రహ్మానందాన్ని మించిపోయి వుండేవారనడంలో అతిశయోక్తి లేదని రాజకీయ విశ్లేషకుల మాట.
తాజాగా నాగబాబు విడుదల చేసిన ప్రకటనలో కామెడీ ఏంటో తెలుసుకుందాం.
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పు కోసం శంఖారావం మోగించడానికి వారాహి బయల్దేరుతోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతోంది”
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలనివ్వనని పవన్‌కల్యాణ్ గత రెండేళ్లుగా చెబుతున్నారు. ఇక పవన్ శంఖారావం ఎవరిని సీఎం చేయడానికో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వారాహి యాత్రతో నాగబాబు చెబుతున్నట్టు రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సంగతేమో గానీ, కనీసం జనసేనలో మార్పు తీసుకొస్తే అదే పదివేలు. జనసేనను రాజకీయంగా బలపరిచేలా వారాహి యాత్ర సాగితే పవన్‌కల్యాణ్ సక్సెస్ అయ్యినట్టే.
“ప్రజలంతా కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని సృష్టించడమే వారాహి యాత్ర ప్రధాన ధ్యేయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే జనసేన పాలన రావాల్సిందే అనే ఆశాభావంతో రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇంకా అనేక వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. పవన్‌కు ముఖ్యమంత్రి పదవి అనే శక్తిని అందిస్తే ఎంతో మందికి ఉపయోగకరమైన సేవలు అందిస్తారనే భావన ప్రజల్లో నాటుకుంది” అని నాగబాబు పేర్కొన్నారు.
ప్రజలంతా ఇప్పటికీ, ఎప్పటికీ కలిసే జీవిస్తారని నాగబాబు గుర్తిస్తే మంచిది. దాని కోసం వారాహి యాత్ర చేయాల్సిన అవసరం లేదు. పవన్‌కల్యాణ్ సీఎం కావాలని చాలా వర్గాలు కోరుకుంటున్నట్టు నాగబాబు పేర్కొన్నారు. కానీ పవన్‌కల్యాణ్‌కు తాను సీఎం కావాలనే పట్టుదల, ఆకాంక్షలేదని తనకు తానే బహిరంగంగా ప్రకటించారు. పవన్‌కే లేనప్పుడు, ఎవరెవరికో వుంటే ఏం లాభం? తనకు సీఎం పదవి వద్దు కుయ్యో, మొర్రో అని పవన్ నెత్తీనోరూ కొట్టుకుని చెబుతుంటే, నాగబాబు మాత్రం పదేపదే సీఎం సీఎం అని నినదించడం కామెడీ కాకుండా మరేం అవుతుందనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. పవన్ సీఎం అంటూ నాగబాబు కామెడీ ఆపేస్తే మంచిదనే సెటైర్స్ పేలుతున్నాయి.