ఈ నెల ఆరో తేదీ నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి యాక్టీవ్ అయ్యారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా, పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమవుతూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విజయసాయిరెడ్డి మూడు రోజులుగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, బలాలు, బలహీనతలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే పార్టీకి సంబంధించి నాయకుల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి విజయసాయిరెడ్డి చొరవ చూపుతున్నారు.
ఈ దఫా మరోసారి వైసీపీని అధికారంలోకి తెచ్చుకునేందుకు కష్టపడాలని ఆయన సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడ్డం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో ఆయన వద్ద పార్టీ నాయకులు ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సమావేశానికి వస్తున్న జిల్లాస్థాయి మొదలుకుని రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన కలివిడిగా వుంటున్నారు. వారితో కలిసి లంచ్ చేస్తున్నారు.
విజయసాయిరెడ్డి ప్రతి ఒక్కర్నీ కలుపుకుని పోయేలా వ్యవహరిస్తుండడంతో నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. వ్యక్తిగతంగా కూడా ఆయనతో మాట్లాడుతూ తమ ప్రాంతాల్లో వైసీపీ పరిస్థితిపై నివేదిస్తున్నారని సమాచారం.