విశాఖ గంటా ఒంగోలులో మోగనుందా…?

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది పెద్ద చర్చ. అటు టీడీపీలోనే కాదు ఇటు అధికార వైసీపీలోనూ అదే చర్చ. గంటా ప్రతీ…

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు. ఇది పెద్ద చర్చ. అటు టీడీపీలోనే కాదు ఇటు అధికార వైసీపీలోనూ అదే చర్చ. గంటా ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గం మారుస్తారు అని పేరుంది.

అలా ఆయన విశాఖలోని ప్రధాన నియోజకవర్గాలు అన్నీ చుట్టేశారు. ఇక మరికొన్ని నియోజకవర్గాలలో ఆయన పోటీ చేయాలనుకున్నా అక్కడ కుదిరే వ్యవహారం కాదు, టీడీపీకి బలమైన నాయకులు ఉన్నారు, వారి సొంత ఇలాకాలు అవి. అందువల్ల గంటా పోటీ చేస్తాను అంటే వారు నో అనేస్తారు.

అనకాపల్లి ఎంపీగా చేసిన గంటా ఇక విశాఖ ఎంపీగా వెళ్తారా అంటే అక్కడ కూడా పోటీ ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో గంటా ఏకంగా జిల్లానే మార్చేస్తారు అని అంటున్నారు. ఆయన అలా అనుకోకపోయినా టీడీపీ అధినాయకత్వం ఆయనను పుట్టిన చోటకే వెళ్లమంటోంది అని ప్రచారం సాగుతోంది.

గంటా సొంత జిల్లా ఒంగోలు నియోజకవర్గం. అక్కడ కొండెపి నియోజకవర్గం టంగుటూరు ఆయన సొంత ప్రాంతం. గంటా అక్కడే పుట్టి పెరిగి తన చదువు అంతా పూర్తి చేశారు. ఆయన ఉద్యోగ వ్యాపార నిమిత్తం విశాఖలో ఉంటూ అక్కడే రాజకీయం కూడా చేస్తూ బలమైన నేతగా ఉన్నారు. అలాంటి గంటాను ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.

కాపు సామాజికవర్గానికి చెందిన గంటా పోటీ చేస్తే ఒంగోలు కచ్చితంగా తమ ఖాతాలో పడుతుంది అని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. గంటా వంటి అంగబలం అర్ధబలం ఉన్న నేత అయితేనే ఒంగోలు ఎంపీ సీటులో వైసీపీని ఎదుర్కోగలమని ఆ పార్టీ ఆలోచిస్తోందని అంటున్నారు.

గంటా ఏమంటారో తెలియదు కానీ వన్ షాట్ టూ బర్డ్స్ అన్న నీతి కూడా ఉంది అంటున్నారు. విశాఖలో గంటా అయ్యన్నల మధ్య రాజకీయ వైరం ఉంది. దాంతో పార్టీ ఇబ్బందులో పడుతోంది. అలాగే గంటా అయిదేళ్ళ టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చెస్తే మంత్రి అడుగుతారు.

అందువల్ల ఆయనకు ఢిల్లీ రాజకీయాల వైపుగా పంపించాలన్న ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. అదే విధంగా గంటాను విశాఖకు దూరం పెడితే టీడీపీకి కూడా వర్గ పోరు తగ్గుతుంది అన్న ప్లాన్ ఉందిట. ఒంగోలులో గంటా ఎంపీగా పోటీ చేస్తే వైసీపీకి బలం ఉన్న జిల్లాలో గంటాను ముందు పెట్టి రాజకీయ లాభం పొందవచ్చు అన్న మరో ఎత్తుగడ ఉందిట. ఇంతకీ గంటా ఒప్పుకుంటారా. విశాఖ గంటా ఒంగోలులో మోగుతుందా అంటే గంటా శిబిరం ఏమి చెబుతుందో.