సిడ్నీ టెస్ట్.. టీమిండియా విజ‌యంత‌మైన డ్రా!

టెస్ట్ క్రికెట్ లో చ‌రిత్ర‌ను సృష్టించే అవ‌కాశం భార‌త జ‌ట్టుకు త్రుటిలో మిస్ అయ్యింది. సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని గ‌నుక టీమిండియా బ్యాట్స్ మెన్ ఛేదించి ఉంటే.. అదొక అరుదైన…

టెస్ట్ క్రికెట్ లో చ‌రిత్ర‌ను సృష్టించే అవ‌కాశం భార‌త జ‌ట్టుకు త్రుటిలో మిస్ అయ్యింది. సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని గ‌నుక టీమిండియా బ్యాట్స్ మెన్ ఛేదించి ఉంటే.. అదొక అరుదైన ఘ‌ట్టం అయ్యేది. టెస్టు మ్యాచ్ ల‌లో 400ల‌కు పైగా ల‌క్ష్యాన్ని ఛేదించి విజయాలు సాధించిన సంద‌ర్భాలు అత్యంత అరుదైన‌వి.

ఎప్పుడో ద‌శాబ్దాల క్రితం వెస్టిండీస్ పై భార‌త జ‌ట్టు 406 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చేధించింది. అత్య‌ధిక ప‌రుగుల‌ను ఛేదించి విజ‌యం సాధించిన ఆ అరుదైన రికార్డు భార‌త జ‌ట్టు పేరు మీదే చాలా పాటు ఉండేది. ఆ త‌ర్వాత కొన్ని ద‌శాబ్దాల‌కు వెస్టిండీస్ జ‌ట్టు ఆస్ట్రేలియా మీద ల‌క్ష్యాన్ని చేధించి నెగ్గి రికార్డును స‌వ‌రించింది.

అయిన‌ప్ప‌టికీ టెస్ట్ క్రికెట్ లో  300 ప‌రుగుల‌కు మించి ల‌క్ష్యం ఉన్న సంద‌ర్భాల్లో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన జ‌ట్టు ఏదైనా నెగ్గ‌డం.. అరుదైన ఘ‌న‌త‌గానే కొన‌సాగుతూ ఉంది. 300ల‌కు మించి టార్గెట్ ఎంత ఉన్నా.. ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేకే చాలా జ‌ట్లు చేతులెత్తేస్తూ ఉన్నాయి. ఆ స్థాయి టార్గెట్ ల‌ను చేధించిన సంద‌ర్భాలు పెద్ద‌గా క‌న‌ప‌డ‌వు. 

అలాంటి అరుదైన ఘ‌న‌త‌ను భార‌త జ‌ట్టు అందుకునేదే. అయితే.. ఏ ఒక్క బ్యాట్స్ మన్ భారీ ఇన్నింగ్స్ ను నిర్మించ‌లేక‌పోవ‌డంతో.. సిడ్నీ టెస్టును డ్రాతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది టీమిండియా. అస‌లు ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతుంద‌ని ఫిక్స్ అయిన వారు, డ్రా చేసినా చాల‌నుకున్న వాళ్లూ ఫుల్ హ్యాపీ. 

అయితే అద్భుతంగా ఆడిన పంత్, పుజారాల్లో ఎవ్వ‌రో ఒక్క‌రు మ‌రో ప‌ది ఓవ‌ర్ల పాటు బ్యాటింగ్ చేసి ఉంటే.. టెస్టు క్రికెట్ లో మ‌రో అరుదైన ఘ‌న‌త టీమిండియా సొంతం అయ్యేది. అది కూడా ఆస్ట్రేలియాలోని బౌన్సీ పిచ్ మీద అంత‌టి విజ‌యాన్ని సాధించి ఉంటే.. చిర‌కాలం గుర్తుండిపోయే ఘ‌న‌త‌గా అది మిగిలి ఉండేది. 

అయితే అభినందించ ద‌గిన అంశం.. డ్రా చేయ‌డం. ఇదొక అరుదైన డ్రా అవుతుండం. తొలి ఇన్నింగ్స్ లో అంత ఆక‌ట్టుకోలేక‌పోయిన టీమిండియా బ్యాట్స్ మెన్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం బాధ్య‌త‌గా ఆడారు. ఓపెనింగ్ పెయిర్ ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తి ఒక్క‌రూ త‌మ వంతుగా బాధ్య‌త‌ను పంచుకున్నారు. గెలుపు ఖాయ‌మ‌ని లెక్కేసుకున్న ఆస్ట్రేలియాకు ధీటైన బ‌దులిచ్చారు.

ప్ర‌స్తావించాల్సిన ముఖ్య‌మైన అంశం.. ఆస్ట్రేలియ‌న్ బౌలింగ్ లైన‌ప్. వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్ ర్యాంక్ టెస్ట్ బౌల‌ర్ తో స‌హా ముగ్గురు టాప్ ర్యాంక్  పేస్ బౌల‌ర్లు.. వికెట్ల కోసం అవిశ్రాంతంగా ప్ర‌య‌త్నించారు. షార్ట్ పిచ్ బంతుల‌తో టీమిండియా బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్ప‌లు పెట్టారు. గాయాలైనా త‌గిలించుకున్నారు కానీ.. వికెట్ల‌ను మాత్రం తేలిక‌గా ఇవ్వ‌లేదు. రొటీన్ గా చేసే త‌ప్పులు చేయ‌లేదు. రోహిత్ శ‌ర్మ‌, పంత్ లు త‌మ బ‌ల‌హీన‌త‌లు అయిన షాట్ల‌ను ఆడి వికెట్ ను కోల్పోయారు.  

టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ ల విలువ ఏమిటో ఈ మ్యాచ్ ను ప‌రిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ మ్యాచ్ లో భార‌త బ్యాట్స్ మెన్ అంతా శుభారంభాల‌ను పొందారు. ప్ర‌తి ఒక్క‌రూ ఇర‌వై ముప్పై ప‌రుగుల వ‌ర‌కూ బాగానే ఆడారు. అయితే వాటిని భారీ స్కోర్ల‌గా మ‌ల‌చ‌లేక‌పోయారు. దీంతోనే విజ‌యానికి భార‌త జ‌ట్టు   దాదాపు 70 ప‌రుగుల దూరంలో నిలిచిపోయింది. పూజారా, పంత్ ఆడుతున్న ఓవ‌ర్ల‌లో విజ‌యాల‌పై ఆశ‌లు మొద‌ల‌య్యాయి. 

ఇక విహారి, అశ్విన్ లు డ్రా కోసం ఫిక్సై ఆడారు. జ‌డేజా బ్యాటింగ్ చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. త‌మ వికెట్ లు డ్రా కోస‌మే అన్న‌ట్టుగా బ్యాటింగ్ చేశారు. దానికి తోడు విహారీ గాయంతో బాధ‌ప‌డుతూ బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్ కూడా తీసే ప‌రిస్థితి లేక‌పోయింది.

వీరిద్ద‌రూ దాదాపు 45 ఓవ‌ర్లు బ్యాటింగ్ చేశారు. చేసింది  దాదాపు 62 ప‌రుగులు! వీళ్ల‌కు ఎన్నో సార్లు సింగిల్స్ తీసే అవ‌కాశం ల‌భించింది. అయినా.. విహారీ ప‌రిగెత్తే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో.. స్కోర్ బోర్డ్ స్ట్ర‌క్ అయిపోయింది! విహారీ ప‌రుగులు తీసే ప‌రిస్థితి ఉంటే.. ఇంకో 50 ప‌రుగుల వ‌ర‌కూ ద‌క్కేవి! అప్పుడు టీమిండియా విజ‌యానికి మ‌రింత చేరువ‌య్యేది. 

ఒక‌వైపు వికెట్లు కాపాడుకోవాల్సి ఉండ‌టం, మ‌రోవైపు సింగిల్స్ తీసే ఛాన్స్ లేక‌పోవ‌డంతో.. టీమిండియా విజ‌యానికి పూర్తిగా దూరం అయ్యింది. ఏదైనా గొప్ప చ‌రిత్ర‌ను సృష్టించే అవ‌కాశం, బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ సీరిస్ లో 2-1తో లీడ్ లో నిలిచే అవ‌కాశం దూర‌మైంది. డ్రా ఆనందం మిగిలింది.

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

విక్ర‌మార్కుడు కంటే ప‌వ‌ర్ పుల్