కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి నేతృత్వంలో హైకోర్టులో లంచ్‌మోషన్‌లో ఇంప్లీడ్ పిటిషన్ వేయనున్నారు.
ఎన్నికల వాయిదాకు బలమైన కారణాలు చూపుతూ ఆంధరప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిటిషన్ రూపొందించింది. ప్రధానంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కక్షపూరిత ధోరణిని ఎత్తి చూపేందుకు సాక్ష్యాధారాలతో సహా ఆధారాలు సమర్పించేందుకు ఉద్యోగుల సంఘం సిద్ధం కావడం గమనార్హం.
గ్రామ పంచాయతీ పాలక మండలి కాలపరిమితి 2018, ఆగస్టులో ముగిసిందని, గతంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పటికీ , ఎన్నికలు పెట్టడానికి ఎస్ఈసీ సిద్ధపడలేదని పేర్కొన్నారు.
అంతేకాదు, కాలపరిమితి లోపు ఎన్నికలు నిర్వహించడానికి, రాజ్యాంగ విధులు నిర్వహణలో ప్రస్తుత ఎస్ఈసీ ఎప్పుడూ చిత్తశుద్ధి చూపలేదని ప్రస్తావించారు. ఈ పిటిషన్లో మరో కీలకమైన అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అదేంటంటే…2018, అక్టోబర్ 23న మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని గౌరవ హైకోర్టు WP no 32346/2018 లో ఉత్తర్వులు ఇచ్చిందని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తన పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది.
హైకోర్టు ఆదేశాల ప్రకారం అప్పట్లో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాటు కనీసం స్టే కూడా తెచ్చుకోని వైనాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉద్యోగులు గత తొమ్మిది నెలలుగా కరోనా నియంత్రణ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని, ఈ పోరాటంలో వందలాది మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, వేలాది మంది కరోనా బారిన పడ్డారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు పిటిషన్ తీర్చిదిద్దారు.
ఈ పరిస్థితులలో కరోనాను అరికట్టడానికి కేంద్రం ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్‌ను ఉద్యోగులకు ఇస్తామనే శుభవార్త చెప్పిందని, ఈ ప్రక్రియ ఈ నెల 16 నుంచి మొదలవుతుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లేందుకు బలమైన వాదనను తయారు చేసుకున్నారు.
ఉద్యోగులకు వ్యాక్సి నేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండు నెలల సమయం పడుతుందని, అంత వరకూ ఎన్నికలు వాయిదా వేయాలనే వాదనతో ఉద్యోగుల సంఘం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది.