ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వైనాన్ని నారా లోకేశ్ ప్రకటించిన ‘మిషన్ రాయలసీమ’ గుర్తుకు తెస్తోంది. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురి, చివరికి అదే ఆయన మరణానికి దారి తీసే పరిస్థితుల్ని సృష్టించిన నేతలే, ఇటీవల కాలంలో శత జయంతి వేడుకల పేరుతో హంగామా చేస్తున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న లోకేశ్, కడపలో ‘మిషన్ రాయలసీమ’ అంటూ డిక్లరేషన్ ప్రకటించారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు రాయలసీమను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అదేమంటే రాయలసీమలో తమకు ఓట్లు, సీట్లు ఇవ్వరని, అందుకే అభివృద్ధి చేయలేదని గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు పాణ్యంలో బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అది కూడా పాణ్యం నాటి ఎమ్మెల్యే సుచరిత ఎదుట అన్నారు.
ఇప్పుడు తగదునమ్మా అంటూ రాయలసీమను ఉద్ధరిస్తానని, తనను నమ్మి ఓట్లు వేయాలని లోకేశ్ వేడుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా చంద్రబాబు గురించి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్న మాటలను జనం గుర్తు చేసుకుంటున్నారు. అమ్మకు అన్నం పెట్టని వాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానని అన్నారట అని బాబు వైఖరిని ఒక్క మాటలో వైఎస్సార్ ఆవిష్కరించారు. ఇప్పుడు లోకేశ్ రాయలసీమ మిషన్ పేరుతో ఇస్తున్న హామీలు బాబు గురించి వైఎస్సార్ చెప్పిన చందంగా ఉన్నాయని జనం అంటున్నారు.
రాయలసీమలో పుట్టి పెరిగిన చంద్రబాబునాయుడు 14 ఏళ్లపాటు సీఎంగా పని చేసి, సొంత ప్రాంతానికి ఏమీ చేయకపోవడం వల్లే సీమకు ఈ దుస్థితి అని లోకేశ్‌కు తెలియదా? అవకాశం లేకపోతే సీమకు సాగు, తాగునీటిని తీసుకురాలేదంటూ చంద్రబాబును అర్థం చేసుకోవచ్చు. సీమకు బాబు న్యాయం చేయకపోగా, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ సర్కార్ పెంచుతుంటే, దేవినేని ఉమా ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది చంద్రబాబు కాదా?
మరోసారి అధికారంలోకి వస్తే సీమ బతుకులను మారుస్తానని లోకేశ్ చెప్పే మాటల్ని నమ్మే పరిస్థితిలో ఆ సమాజం లేదు. కేవలం తమ రాజకీయ బతుకుల్ని మార్చుకునేందుకే మిషన్ రాయలసీమ అంటూ మాయ మాటలు చెబుతున్నారని ఆ ప్రాంతం గ్రహిస్తోంది. సీమకు బాబు అన్యాయం చేయడం వల్లే ఆ ప్రాంతం పూర్తిగా తన పార్టీని, తండ్రిని దూరం పెట్టిందని లోకేశ్ మొట్ట మొదట గుర్తించాలి.
ఇప్పటికీ రాయలసీమకు కనీసం హైకోర్టు ఇస్తామని లోకేశ్ హామీ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అధికారంలోకి రాగానే కోస్తా ప్రాంతానికి తాగునీళ్లు అందించడానికి పట్టిసీమ కట్టిన వాళ్లకు, రాయలసీమ తాగు, సాగునీరు అవసరాలను తీర్చడానికి మనసు రాకపోవడం … ఆ ప్రాంతంపై వివక్ష తప్ప మరొకటి కాదని పసిగట్టలేని అమాయక స్థితిలో సీమ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.