రాయలసీమపట్ల దుర్బుద్ధిని చాటుకున్న లోకేష్!

రాయలసీమ ప్రాంతం తెలుగుదేశం పార్టీ విషయంలో ముందుగానే మేలుకుంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఆయన ఒక్క సీటు తప్ప తతిమ్మా అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో…

రాయలసీమ ప్రాంతం తెలుగుదేశం పార్టీ విషయంలో ముందుగానే మేలుకుంది. చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఆయన ఒక్క సీటు తప్ప తతిమ్మా అన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంది. కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ సాధించిన విజయాలు సరేసరి. ఇప్పుడు పాదయాత్రలో కడప జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్, రాయలసీమ ప్రజలను గంపగుత్తగా వంచించడానికా అన్నట్టుగా ప్రత్యేకంగా ‘మిషన్ రాయలసీమ’ అనే చర్చా కార్యక్రమాన్ని కడపలో నిర్వహించారు.

చర్చాకార్యక్రమానికి వచ్చిన మేధావులు ఏం సలహాలు చెప్పారో, రాయలసీమ కన్నీళ్లను ఏ రీతిగా అభివర్ణించారో తెలియదు గానీ.. నారా లోకేష్ మాత్రం ఒక సుదీర్ఘమైన ఎన్నికల ప్రసంగం చేసేవారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, తన సొంత నియోజకవర్గం కుప్పం మీదుగా వెళ్లే సాగునీటి కాలువను కూడా పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు చిత్తశుద్ధిని మరుగున పెడుతూ.. సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తూ అంటూ సినిమా డైలాగులు చెప్పారు. కియా వంటి వాటిని ప్రస్తావించి.. అదంతా తాము చేసినదే అని కూడా చెప్పుకున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ చర్చాకార్యక్రమంలో కూడా.. రాయలసీమ ప్రజలను హెచ్చరిస్తున్నట్టుగా, వారితో క్విడ్ ప్రోకో బేరం పెడుతున్నట్టుగా నారా లోకేష్ మాట్లాడడం గమనార్హం. రాయలసీమలో తమ పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా కూడా, ఆ ప్రాంతాన్ని తక్కువగా చూడలేదని లోకేష్ అన్నారు.

నిజానికి ఆయన ఈ వ్యాఖ్యను సోదాహరణంగా వివరించి ఉంటే బాగుండేది. ఇతర ప్రాంతాలకు ఏయే హెడ్స్ కింద ఎంత ఖర్చు చేశారో, సీమలో అంతకంటె మిన్నగా ఏం చేశారో చెప్పి ఉంటే బాగుండేది. రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుని చెప్పడానికి భయపడ్డారో లేదా ఎంత వివరంగా చెబితే అంతగా తమ బూటకపు మాటలు బయటపడతాయని ఆగారో తెలియదు గానీ చెప్పలేదు.

ఒకవైపు అలా అంటూనే.. ‘‘వైకాపాకు ఇచ్చినన్ని సీట్లు ఇస్తే, చెప్పింది చేసి చూపిస్తాం’’ అని లోకేష్ అనడం చాలా దారుణం. రాయలసీమ పట్ల లోకేష్ దుర్బుద్ధిని ఈ మాటలు బయటపెడుతున్నాయి. పరిశ్రమల పరంగా, హార్టికల్చర్ పరంగా, స్పోర్ట్స్ యూనివర్సిటీ వంటి కల్లమాటల పరంగా లోకేష్ చాలా ప్రకటించారు. అయితే.. కండిషన్స్ అప్లై అన్నమాట. 2019లో వైసీపీకి ఇచ్చినన్ని సీట్లు తెలుగుదేశానికి ఇస్తే మాత్రమే ఇవన్నీ చేస్తారట. లేకపోతే చేయరన్నమాట! ఇంత నీచంగా ఎన్నికలకు ముందే ప్రజలను బెదిరించే నాయకుడు.. గెలిచిన తర్వాత అసలు ప్రజలకు ఏం చేస్తాడనేది సందేహం. 

ఈ మాటల ద్వారా లోకేష్ చాలా స్పష్టంగా తమ పార్టీకి అధికారం కట్టబెట్టే ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి పనులు చేస్తామని, మిగిలిన ప్రాంతాలను తొక్కేస్తామని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. తన మనసులో ఉండే కుట్రఆలోచనలను కూడా దాచుకోకుండా చెప్పేసే లోకేష్, ఎన్నికల తర్వాత వైసీపీకి ఇచ్చినన్ని సీట్లు ఇచ్చినా సరే.. ఆ పార్టీకి ఇచ్చినంత ఓట్ షేర్ మాకు ఇవ్వలేదు గనుక.. మాట నిలబెట్టుకునే అవసరం లేదు.. అంటూ మడత పేచీ పెట్టినా పెట్టగలరని ప్రజలు అనుకుంటున్నారు.