న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది..!

నా భార్య నా మాట విన‌దు.. న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల జీతాలు, మేనేజ‌ర్ హోదాల్లో పెద్ద పెద్ద టీమ్ ల‌ను, ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ క్లైంట్ల‌ను కూడా త‌మ…

నా భార్య నా మాట విన‌దు.. న‌యా జ‌న‌రేష‌న్ భ‌ర్త కామ‌న్ కంప్లైంట్ ఇది. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌ల జీతాలు, మేనేజ‌ర్ హోదాల్లో పెద్ద పెద్ద టీమ్ ల‌ను, ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్ క్లైంట్ల‌ను కూడా త‌మ స‌మ‌ర్థ‌త‌తో మేనేజ్ చేస్తున్న తాము త‌మ భార్య‌ల‌ను మాత్రం మేనేజ్ చేయ‌లేక‌పోతున్నామ‌ని వాపోతున్న తీరు రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వ‌ద్ద వ్య‌క్తం అవుతూ ఉంది. 

భ‌ర్త మాట భార్య విన‌డం- విన‌క‌పోవ‌డం అనేది ఇప్ప‌టి టాపిక్ ఏమీ కాదు. పురాణ కాలం నుంచి ఉన్న‌దే! ఆయా నాగ‌రిక‌త‌లు, సామాజిక ప‌రిస్థితులకు అనుగుణంగా ఇది న‌డుస్తున్న వ్య‌వ‌హార‌మే. మరి ప్ర‌స్తుతానికి వ‌స్తే… ఎన్నెంటినో సాధించిన తాము త‌మ భార్య త‌న మాట వినేలా చేసుకోలేక‌పోతున్నామ‌నే నూన్య‌తాభావం న‌యాత‌రంలో వెన్నాడుతూ ఉంది. మ‌రి స‌మ‌స్య ఎక్క‌డ ఉంది.. అంటే ఈ వ్య‌వ‌హారాన్ని విశ్లేషిస్తే… అబ్బాయిలు తాము ఎలాంటి కాలంలో ఉన్నామో గుర్తించ‌క‌పోవ‌డంతోనే ఈ స‌మ‌స్య ఉత్ప‌న్నం అవుతోంద‌నేది ప్రాథ‌మికంగా చెప్ప‌ద‌గిన అంశం.

అస‌లు స‌మ‌స్య ఏమిటి?

త‌న భార్య త‌న కుటుంబంతో స‌రిగా క‌ల‌వ‌ద‌ని, త‌న అక్కచెల్లెల్లు, అన్న వ‌దిన‌ల‌తో మెల‌గ‌ద‌ని, త‌న త‌ల్లిదండ్రుల‌ను కూడా పెద్ద‌గా ఖాత‌రు చేయ‌ద‌ని, అన్నింటికీ మించి సొంతూళ్లో త‌న ఊర్లో గ‌డ‌ప‌డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌ద‌నేది నయా జ‌న‌రేష‌న్ భ‌ర్త‌ల నుంచి వ‌చ్చే అతి సాధార‌ణ కంప్లైంట్. చాలా మందికి ఉన్న ఫిర్యాదే ఇది భార్య‌పై.

ఈ విష‌యంలో సామ‌దాన‌భేదదండోపాయాల‌న్నీ ప‌ఠించి విఫ‌లం అయిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నించి త‌మ భార్య‌ను తమ చెప్పుచేత‌ల్లోకి తెచ్చుకోవ‌డంలో విఫ‌ల‌మయ్యామ‌నేది వీరి బాధ‌.

స‌మ‌స్య అక్క‌డే ఉంది!

ఎప్పుడైతే  త‌న భార్య‌ను పూర్తిగా చెప్పుచేత‌ల్లో పెట్టుకోవాల‌నే ఆలోచ‌న మొద‌లైందో అక్క‌డ నుంచినే ప్ర‌శాంత‌త అనేది న‌యాత‌రం భ‌ర్త‌కు క‌నుమ‌రుగు అవుతుంది! ఇది కాద‌న‌లేని వాస్త‌వం. త‌ను కోరుకున్న‌ట్టుగానే త‌న భార్య ఉండాల‌నుకోవ‌డం ప్ర‌తి మ‌గాడి ఆశ‌. మ‌రి ఈ ఆశ నెర‌వేర‌డం తేలికేమీ కాదు. అందం, ఆస్తులు, ఉద్యోగం, క‌ట్నం.. ఇలాంటి విష‌యాల్లో అంచ‌నాలు నిజ‌మైనా.. ఇవ‌న్నీ నిజ‌మ‌య్యాకా.. అమ్మాయి వ్య‌వ‌హ‌ర‌న తీరు కూడా తాము కోరుకున్న‌ట్టుగానే ఉండాల‌నుకోవ‌డం అబ్బాయిల దురాశ‌!

ఎప్పుడైతే ముంద‌స్తుగా చూసుకునే వాటి విష‌యంలో అబ్బాయిల అంచ‌నాలు నిజం అవుతున్నాయో, పెళ్లి త‌ర్వాత అమ్మాయి చెప్పుచేత‌ల్లో ఉండ‌టం మాత్రం దుర్ల‌భం కావ‌డం రొటీన్ గా మారింది. ఇందులో అమ్మాయి త‌ప్పేం లేదు కూడా! ఇలాంటి వ్య‌వ‌హారంలో అబ్బాయిల దురాశే స‌మ‌స్య‌కు మూలం!

అన్నీ అర్హ‌త‌లున్న అమ్మాయి?

అమ్మాయిల‌ను అబ్బాయిలు ఊరికే పెళ్లిళ్లు చేసుకోవ‌డం లేదు. ఆమెకు అందం ఉండాలి, ఆస్తిపాస్తులుండాలి, చ‌దువుకుని ఉండాలి, ఉద్యోగం చేయ‌డం చేయ‌క‌పోవ‌డం అబ్బాయి కుటుంబం ఇష్టానుసారం అయి ఉండాలి! ఇవ‌న్నీ కుదిరితేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. తీరా పెళ్లి త‌ర్వాత‌.. అబ్బాయి త‌న కుటుంబ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టుగా అమ్మాయి న‌డుచుకోవాలంటున్నాడు. మ‌రి పెళ్లికి ముందే ఈ ప‌రిస్థితులు ఏవో ఆమెకు, ఆమె కుటుంబానికి అర్థ‌మ‌య్యేలా చేస్తే స‌రిపోతుంది.

అయితే అలాంటివి జ‌ర‌గ‌వు. పెళ్లికి ముందు అంతా అందంగా చూపించ‌డానికే అబ్బాయిల కుటుంబాలు కూడా పోటీప‌డ‌తాయి. పెళ్లి త‌ర్వాత మాత్రం వీరి వ్య‌వ‌హ‌ర‌ణ తీరు మారుతూ ఉంది. ఇదే స‌మ‌స్య ఉత్ప‌న్నం కావ‌డానికి కార‌ణం అవుతోంది.

అమ్మాయిల ష‌ర‌తుల‌కు మొద‌ట్లో సాగిలా!

పెళ్లి రిసెప్ష‌న్ లో నా చీర రంగుకు నీ సూట్ మ్యాచ్ అయ్యేలా లేదు.. ముందు నువ్వెళ్లి నా చీర రంగుకు సూట‌య్యే సూటును తీసుకో, ఆల్రెడీ కొన్న‌దాన్ని ప‌క్క‌న ప‌డేసైనా.. నా చీర రంగుతో సూట‌య్యే సూటునే కొనుక్కో అంటూ అమ్మాయి పెళ్లికి ముందు ఆదేశిస్తే.. ఒక‌టికి ప‌ది షాపింగ్ మాల్స్ అయినా తిరిగి, వేల‌కు వేలు పోసైనా.. ఒక్క గంట ధ‌రించే ఆ సూటు కోసం వేటాడ‌తాడు అబ్బాయి! గంట సేపే కదా.. ఆల్రెడీ కొనేశాను క‌దా.. బాగానే ఉంది క‌దా.. అంటూ ఆమెను క‌న్వీన్స్ చేయ‌డానికి కూడా అప్పుడు మ‌న‌సొప్ప‌దు! ఆమె కోరంది కాబ‌ట్టి చేయాల‌నే ఉత్సాహం విప‌రీతం అప్పుడు.

త‌న స్థాయికి మించి మాల్దీవుల‌కు హ‌నీమూన్ కు అడిగినా అబ్బాయి సై అంటాడు. ఇలా నిశ్చితార్థం అయిన ద‌గ్గ‌ర నుంచి ఆమె కోరింద‌ల్లా చేస్తూ, ఆమె అందానికి, అర్హ‌త‌ల‌కు మురిసిపోయి పెళ్లి చేసుకుని.. తీరా పెళ్లి అయిన త‌ర్వాత ఆమె కోరిన చోట కాపురం పెట్ట‌డానికీ బాధే, త‌న త‌ల్లిదండ్రుల‌ను ఆమె ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఫిర్యాదు, త‌న తోబుట్టువుల‌కు ఆమె విలువ‌ను ఇవ్వ‌ద‌ని ఇంకో బాధ‌!

అమ్మాయి వెర్ష‌న్ ఏంటి?

ఇలాంటి వ్య‌వ‌హారాల్లో అమ్మాయిల వెర్ష‌న్ లోనే ఎక్కువ న్యాయం క‌నిపిస్తుంది. వివాహానికి ముందు తాము కోరుకున్న జీవితం ఇస్తామ‌ని చెప్పే అబ్బాయిలు..ఆ త‌ర్వాత ప‌రిస్థితులు, ఉద్యోగం అంటూ ఉన్నార‌ని అవి తాము ఎక్స్ పెక్ట్ చేయ‌లేద‌నే ఫిర్యాదు వారి వైపు నుంచి ఉంది.

పుట్టింటిలో పూర్తి స్వేచ్ఛ‌, స్వ‌తంత్రాల‌తో, ఆర్థికంగా కూడా కోరుకున్న‌ట్టుగా బ‌తికిన తాము పెళ్లి త‌ర్వాత కేవ‌లం అబ్బాయి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా అణిగిమ‌ణిగి ఉండాల‌ను కోవ‌డం ఎంత వ‌ర‌కూ న్యాయ‌మ‌నేది వారి ప్ర‌శ్న‌. పెళ్లికి ముందు మాట‌ల్లో ఒక సినిమా చూసి, పెళ్లి త‌ర్వాత చేత‌ల్లో మ‌రో సినిమా చూపిస్తున్నారు అబ్బాయి. ఇదీ వారి వెర్ష‌న్.

ఇలాంటి వారు చాలా హ్యాపీ!

క‌రోనా లాక్ డౌన్ లో కొంత‌మంది అబ్బాయిలు ఆల్మోస్ట్ ఇల్ల‌రికం అల్లుళ్ల‌లా గ‌డిపారు. ఏడాది, రెండేళ్లూ అత్త‌గారింట్లోనే అమ్మాయితో పాటే ఉంటూ ప‌ని చేశారు! న‌గ‌రాన్ని ఖాళీ చేసి సొంతూరు ప్రాంతానికి వ‌చ్చాకా.. అమ్మాయి ఊర్లోనో, ఇంట్లోనో గ‌డుపుతూ.. ఆమెకు పూర్తిగా స‌రెండ‌ర్ అయిపోతున్న వారు మాత్రం హ్యాపీగా ఉన్నారు.

త‌మ అంద‌మైన‌, ఆస్తిపాస్తులు, అన్ని అర్హ‌త‌లున్న భార్య‌కు ఇలా అందంగా స‌రెండ‌ర్ అయిపోతూ.. వీరు హ్యాపీగా ఉంటున్నారు. అవ‌స‌రం అయిన వేళ‌ల త‌న కుటుంబానికి కూడా అందుబాటులో ఉంటూ, ఆమెను త‌నతో పాటే ఉండాలంటూ ఒత్తిడి చేయ‌ని వారే సంతోషంగా ఉన్నారు!