తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరిక చిచ్చు రేపుతోంది. గత కొంతకాలంగా ఎస్సీవీ నాయుడు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ఆయనతో పొసగడం లేదు. ఎస్సీవీ నాయుడికి వ్యక్తిగతంగా మంచి పేరు వుంది. ఈయన చేరితో శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం చూపుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజకీయం రంజుగా మారింది.
టీడీపీలో ఎస్సీవీ చేరికను శ్రీకాళహస్తి టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీవీ చేరికపై బహిరంగంగానే తన అసంతృప్తి, ఆగ్రహాన్ని బొజ్జల ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. అమరావతిలో గురువారం చంద్రబాబునాయుడు సమక్షంలో ఎస్సీవీ టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో చేరిక కార్యక్రమానికి నియోజకవర్గానికి సంబంధించి ఏ ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు పాల్గొనవద్దని బొజ్జల సుధీర్‌రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు బొజ్జల సుధీర్‌రెడ్డి ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఆ ఆడియోలో ఏమున్నదంటే…
“నేను బొజ్జల సుధీర్‌రెడ్డిని. ముఖ్య గమనిక ఏమంటే… రేపు అమరావతిలో ఎస్సీవీ నాయుడు టీడీపీలో చేరుతున్నారని సమాచారం వచ్చింది. ఒక ఇన్చార్జిగా నాకు కూడా ఆయన చేరిక విషయం అధికారికంగా తెలియదు. నాతో ఎవరూ మాట్లాడలేదు. బూత్‌స్థాయి మొదలుకుని టీడీపీ మండలాధ్యక్షులు, ఇతర నాయకులెవరూ రేపు అమరావతికి వెళ్లొద్దు. వైసీపీ నుంచి అతను చేరుతున్నారు కాబట్టి, ఆ పార్టీ నుంచి వెళ్తారు. కావున నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏది సరైందని అనుకుంటే అలా నడుచుకోవాలని కోరుకుంటున్నా” అంటూ బొజ్జల పేర్కొన్నారు.
టీడీపీలో ఎస్సీవీ చేరనున్న నేపథ్యంలో బొజ్జలకు టికెట్ భయం పట్టుకున్నట్టుంది. యువగళం పాదయాత్రలో బొజ్జలే శ్రీకాళహస్తి అభ్యర్థి అని ప్రకటించారు. కానీ సుధీర్‌రెడ్డి యాక్టీవ్‌గా లేరని చంద్రబాబు గతంలో మందలించారని సమాచారం. బొజ్జలకు టికెట్ ఇచ్చే విషయమై చంద్రబాబులో మరో ఆలోచన వుందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎస్సీవీ టీడీపీలో చేరితే… గ్రూప్ రాజకీయానికి తెరలేచినట్టు అవుతుంది. శ్రీకాళహస్తిలో ఎస్సీవీ, బొజ్జల వర్గాల మధ్య ఫైట్‌ను ఇకపై చూడాల్సి వుంటుంది. ఇందుకు తాజా బొజ్జల సుధీర్‌రెడ్డి విడుదల చేసిన ఆడియోనే నిదర్శనం.