ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధానంగా లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ పేరు వినిపించింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఈ కేసులో అవినీతి బాగోతం బయట పడుతుందనే భయంతో చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేశ్ సన్నిహితుడు కిలారు రాజేశ్ దేశం విడిచి పారిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రాజేశ్ విదేశాలకు పారిపోయినట్టు స్వయంగా సీఐడీ అధికారులే మీడియా సమావేశంలో చెప్పారు.
కిలారు రాజేశ్ అకౌంట్స్ నుంచే లోకేశ్‌కు పెద్ద మొత్తంలో అవినీతి డబ్బు చేరిందనేది ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో విదేశాలకు పారిపోయాడనే ఆరోపణలు ఎదుర్కొన్న కిలారు రాజేశ్ ఇవాళ తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయంలో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్‌లో విచారణకు రావాలంటే కిలారుకు సీఐడీ రెండు రోజుల క్రితం 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. సీఐడీ అధికారులు చెబుతున్నట్టు తాను విదేశాలకు పారిపోలేదని, విచారణకు హాజరవుతానని కిలారు ప్రకటించారు.
అన్నట్టుగానే ఇవాళ అతను సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం అతను స్కిల్ స్కామ్‌లో సీఐడీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు. స్కిల్ స్కామ్‌లో కిలారుకు ఎలాంటి సంబంధం ఉందని సీఐడీ భావిస్తోందని, అందుకు తగ్గట్టు ఆధారాలున్నాయా? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కిలారును విచారిస్తే లోకేశ్ పట్టుబడుతారని సీఐడీ ఇంత కాలం చెబుతూ వచ్చింది. కిలారు నుంచి ఎంత మాత్రం అవినీతికి సంబంధించి ఆధారాలు సేకరించి, చంద్రబాబు, ఆయన కుమారుడిని సీఐడీ అధికారులు శిక్షిస్తారో చూడాలి.