అప్పు రేపు అని గోడ మీద రాసి పెట్టాడట వెనకిటి ఓ దుకాణదారు. ఆంధ్ర సిఎమ్ జగన్ వ్యవహారం అలాగే వుంది వైజాగ్ రాజధాని విషయంలో.
ఏ ముహుర్తాన మూడు రాజధానులు ప్రకటించారో, అప్పటి నుంచి సిఎమ్ వైజాగ్ నుంచి పాలన సాగించడం అన్నది గోడ మీద రేపు అని రాసుకున్న చందంగానే వుంది.
సిఎమ్ వైజాగ్ లో వుండి పాలన సాగించడానికి ఏ కోర్టు అడ్డంకీ వుండబోదు అనే అనుకోవాలి. ఎందుకంటే ఎక్కడ కూర్చుని పాలన సాగించుకోవడం అన్నది సిఎమ్ ఇష్టం.
రాజధాని తరలింపు అంటే కోర్టు పరిధిలో వుంటే వుండొచ్చు. కార్యాలయాల ఏర్పాటు అన్నది కోర్టు పరిధి లో వుంటే వుండొచ్చు. కానీ సిఎమ్, ఇతర అధికారులు నెలకు ఇన్ని రోజులు విశాఖలో వుంటాం అంటే అడ్డంకి వుండదు.
కానీ జగన్ ఈ విషయంలో అస్సలు అడుగు ముందుకు వేయడం లేదు. ఆయనకు వున్న పెద్ద సమస్య ఇల్లు. తనకు అనుకూలమైన ఇల్లు లేకుండా అక్కడ వుండలేరు. దానికే చాలా కాలం వృధా అయిపోయింది.
సరే, ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ సిఎమ్ వసతి గృహం రెడీ అయ్యాయి. దసరాకు వెళ్తున్నా విశాఖకు అని ఆయనే ప్రకటించారు. అక్కడ ఏర్పాట్లు కూడా యుద్ద ప్రాతిపదికన జరిగిపోతున్నాయి. అయినా కూడా ఇప్పుడు మళ్లీ డిసెంబర్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
అసలు దసరాకు వెళ్తున్నా అని జగన్ ను చెప్పమన్నది ఎవరు? అసలు ఎవరు అడిగారు? వెళ్తే వెళ్లిపోవడమే కానీ ఈ ‘రేపే విడుదల’ అన్నట్లుగా జరుగుతూనే వుంది. దీని వల్ల నగుబాటు పాలయ్యేది జగన్ నే తప్ప మరెవరు కాదు. మాట ఇస్తే నిలబెట్టుకుంటారు అని పేరుపడిన జగన్ వైజాగ్ నుంచి పాలన విషయంలో మాత్రం ఆ మాట ను నిలబెట్టుకోవడం లేదు.
ఇప్పుడు కొత్త డేట్..డిసెంబర్. అది దాటితే ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఎన్నికల ప్రకటన, కోడ్ వచ్చేస్తాయి. ఎన్నికల తరువాత రాజు ఎవరో..రెడ్డి ఎవరో అన్నట్లు వుంటుంది వ్యవహారం.
జగన్ కు ఇలాంటి అద్భుతమైన సలహాలు ఇస్తున్నవారికి కోటి దండాలు.