ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్టేజీపైనే కంటతడి పెట్టుకున్నారు. ఓ విద్యాసంస్థ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ.. మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాను, విద్యారంగంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనై స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యారంగానికి సిసోడియా ఎంతో కృషి చేశారని అలాంటి వ్యక్తిని జైలుకు పంపించారంటూ వాపోయారు.
అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ''సిసోడియాపై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి జైలులో పెట్టిందని.. ఆయన మంచి పాఠశాలలు నిర్మించకుండా ఉంటే ఆయనను బీజేపీ జైలులో పెట్టించేది కాదని.. విద్యారంగాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. కానీ ఆప్ ప్రభుత్వం ఎప్పుడు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేస్తునే ఉంటుందని.. విద్యారంగాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలనేది మనీష్ కల అని, దేశ రాజధానిలోని పిల్లలందరికీ మంది విద్యను అందించాలని ఆయన కోరుకునే వారని కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనపై ఉన్న ఆరోపణల తీవ్రత దృష్యా బెయిలుకు నిరాకరిస్తూనే.. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న తన భార్యను చూసేందుకు మాత్రం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకూ రెండు సార్లు ఆయనకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను ఇప్పటికే ఈడీ పలుమార్లు విచారించింది. కవితను తప్పక అరెస్ట్ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ ఈడీ, సీబీఐలు ఆమె విషయంలో కాస్త వెనక్కి తగ్గాయి.