హీరోల మెయింటైనెన్స్ గురించి అందరికీ తెలిసిందే. ఖరీదైన దుస్తులు, యాక్ససిరీస్ తో పాటు రిచ్ లైఫ్ స్టయిల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా ఛార్టర్డ్ విమానాల్లో వెళ్తుంటారు. ఇక వాళ్ల ఆస్తుల వివరాలు తెలిస్తే కళ్లు తిరుగుతాయి. అయితే ఈ మొత్తం వ్యవహారానికి తను చాలా దూరం అంటున్నాడు సిద్దార్థ్.
“ఈ జనరేషన్ కు డబ్బుపై ఆశ ఎక్కువైంది. సెలబ్రిటీల సంపాదన అందరికీ తెలిసిందే. అయితే నా పెంపకం వేరు. డబ్బు కంటే సంతోషానికి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. సంగీతం వినడం, చిన్న చిన్న పనులు చేయడంలో నేను ఆనందం వెదుక్కుంటాను. డబ్బుకు నేను ప్రాధాన్యం ఇవ్వను.”
ఓవైపు డబ్బు సంపాదిస్తున్నప్పటికీ, తన లైఫ్ స్టయిల్ సింపుల్ గా ఉంటుందంటున్నాడు సిద్దార్థ్. కాలేజ్ రోజుల్లో వాడిన దుస్తుల్లో కొన్నింటిని, ఇప్పటికీ వాడుతున్నానని తెలిపాడు.
“నేను అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేసినప్పుడు నెలకు 2వేల రూపాయలు అందుకునేవాడ్ని, నా పెట్రోల్ బిల్లు 160 రూపాయల కంటే తక్కువే. డబ్బులొస్తే రకరకాల అలవాట్లు వస్తాయంటారు, నేను అలా కాదు, చిన్న చిన్న విషయాల్లో సంతోషాన్ని వెదుక్కుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలను. కాలేజ్ రోజుల్లో వాడిన దుస్తుల్లో కొన్నింటిని ఇప్పటికీ నేను వాడుతున్నాను.”
టక్కర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా తన లైఫ్ స్టయిల్ ను బయటపెట్టాడు సిద్ధూ. త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొస్తానని, దానికి నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తానని స్పష్టం చేశాడు ఈ హీరో.