చంద్రబాబునాయుడిపై ఆయన అత్త, తెలుగు సంస్కృతి అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను సాకుగా చూపి ఎన్టీఆర్‌ను గద్దె దింపారనే ఆగ్రహం ఆమెలో ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవాలని లక్ష్మీపార్వతి తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు సమాధి కట్టడం ఖాయమని సంచలన కామెంట్ చేశారు. ఓటమి తర్వాత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రవాసీలుగా మిగిలిపోతారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ నుంచి వచ్చి వెళుతుండడాన్ని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు సిగ్నల్ ఇచ్చిన తర్వాతే వారాహి రోడ్డెక్కుతోందని పవన్‌పై సెటైర్స్ విసిరారు. టీడీపీతో కలిస్తే రాజకీయంగా పవన్‌కల్యాణ్‌కు నష్టం కలుగుతుందని ఆమె హెచ్చరించారు. పవన్‌కల్యాణ్ అనుకుంటున్నట్టు ప్రభుత్వం వ్యతిరేక ఓట్లు చీల్చడం సులువు కాదన్నారు.
మరోవైపు పవన్‌కల్యాణ్ నిర్ణయాలతో జనసేన కార్యకర్తలు అయోమయంలో ఉన్నారన్నారు. లోకేష్ చదువు సంధ్య లేని మూర్ఖుడని తీవ్రంగా విమర్శించారు. సీఎం జగన్‌పై పాదయాత్రలో లోకేశ్ విమర్శలు దారుణంగా ఉన్నాయన్నారు. వ్యక్తిగత విమర్శలు చేసే కుసంస్కారి లోకేశ్ అని విరుచుకుపడ్డారు.
టీడీపీ మేనిఫెస్టో ఆత్మవంచనగా ఆమె అభివర్ణించారు. కేసుల మాఫీ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. చంద్రబాబును బీజేపీ నమ్మదన్నారు. కేవలం వెంకయ్యనాయుడు చెప్పారనే చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు.