వైసీపీ ఎంపీ కుమారుడికి మ‌ధ్యంత‌ర బెయిల్‌

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు ఇవాళ మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రాఘ‌వ‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న ఈడీ అరెస్ట్ చేసిన…

వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడు మాగుంట రాఘ‌వ‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు ఇవాళ మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రాఘ‌వ‌రెడ్డిని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న ఈడీ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి నుంచి ఆయ‌న జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసులురెడ్డిని ఈడీ విచారించింది. ఆయ‌న కూడా అరెస్ట్ అవుతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ అలా జ‌ర‌గలేదు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌ను ఈడీ ప‌లుమార్లు విచారించింది. క‌విత‌ను త‌ప్ప‌క అరెస్ట్ చేస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగింది. కానీ ఈడీ, సీబీఐలు ఆమె విష‌యంలో కాస్త వెన‌క్కి త‌గ్గాయి. దీనికి కార‌ణం ఆమె ప్ర‌మేయానికి సంబంధించి బ‌లమైన ఆధారాల‌ను ద‌ర్యాప్తు సంస్థ‌లు సేక‌రించ‌క‌పోవ‌డ‌మే.

ఇదే కేసులో వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నాయ‌కుడు విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఇటీవ‌లే బెయిల్‌పై విడుద‌లయ్యారు. ప్ర‌స్తుతం ఈయ‌న అప్రూవ‌ర్‌గా మారారు. ప్ర‌స్తుతానికి వ‌స్తే త‌న అమ్మ‌మ్మ అనారోగ్యంతో చికిత్స పొందుతు న్నార‌ని, ఆరువారాల పాటు బెయిల్ ఇవ్వాల‌ని మాగుంట రాఘ‌వ‌రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు.

అయితే మాగుంట‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వొద్ద‌ని ఈడీ వాదించింది. మాగుంట అమ్మ‌మ్మ బాగోగులు చూసుకోడానికి చాలా మంది ఉన్నారంటూ వాద‌న‌లు వినిపించింది. ఈ నేప‌థ్యంలో ఈడీ వాద‌న‌లు ప‌ట్టించుకోకుండా రెండు వారాల పాటు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. కొన్ని నెల‌ల త‌ర్వాత స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకునే అవ‌కాశం మాగుంట‌కు ద‌క్కిన‌ట్టైంది.