కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్ విజయమ్మ తమ్ముడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి మళ్లీ మీడియా ముందుకొచ్చారు. లోకేశ్‌కు కౌంటర్ ఇవ్వడంలో రవీంద్రనాథ్‌రెడ్డి అట్టర్ ప్లాప్ అయ్యారనే విమర్శలు రావడంతో, ధైర్యం కూడదీసుకుని ఆయన విమర్శలకు పదును పెట్టడం విశేషం. యువగళం పాదయాత్రలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్ స్థానిక ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కమలాపురం ఎమ్మెల్యేకు భూములు ఆక్రమించడం వ్యసనమని విమర్శించారు. ఆయనో భూబకాసురుడని ఘాటు విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలో రెండోసారి లోకేశ్, కమలాపురం టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి కౌంటర్ ఇచ్చేందుకు మీడియాతో మాట్లాడారు. భూబకాసరుడని తనను విమర్శించడంపై కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భూములు ఎక్కడ ఆక్రమించానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నీ పక్కనే భూతిమింగళాన్ని పెట్టుకున్నావని టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. దాదిరెడ్డిపల్లె, దేవరాజుపల్లె, పైడికాల్వ, సముద్రంపల్లె తదితర గ్రామాల్లో దాదాపు 400 ఎకరాలను తన ప్రత్యర్థి ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు.
ఇప్పటికీ అవన్నీ డీకేటీ పట్టాలే అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆ భూముల తమవే అని ప్రజలు అడగలేకపోతున్నారని, కాళ్లతో కొడ్తావో, లేక విరగ్గొడుతావో అనే భయంతో నోరు మెదపడం లేదన్నారు. కడపలో కూడా భూఆక్రమణలకు పాల్పడ్డారని విమర్శించారు. పుత్తా నరసింహారెడ్డి దెబ్బకే కడపలో లాయర్ రంగారెడ్డి, ఆయన కుమారుడు కూడా చనిపోయారని ఆరోపించారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం ఒక్క రూపాయి పనైనా చేశావా? అని ప్రశ్నించారు.
తాము అడిగిన వెంటనే రూ.600 కోట్లు మంజూరు చేశారు సార్ అంటూ లోకేశ్‌తో పుత్తా నరసింహారెడ్డి అనడాన్ని ఆయన తప్పు పట్టారు. లోకేశ్‌ను సార్ అంటూ అన్నారని ఆయన వెటకరించారు. “వూళ్లో పని చేశారు సార్, చూపించు సార్ మాకు” అని వ్యంగ్యంగా పుత్తాను రవీంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంకా టీడీపీ హయాంలో అభివృద్ధి చేసి వుంటే ఎలా వుండేదో అని అన్నారు. బెంగళూరికి ఇసుకను అక్రమ రవాణా చేశారని విమర్శించారు. అలాగే నీరు-చెట్లు కింద అడ్డంగా దోచుకున్నాడని పుత్తాపై మండిపడ్డారు.
లోకేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. గత ప్రభుత్వంలో ఆఖరికి దేవాలయాల్లో స్వీపర్ పోస్టుల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. తండ్రి కొడుకులు ఉండేది హైదరాబాద్‌లో పోటీ చేసేది కుప్పం, మంగళగిరిలో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గాలిని ఆపింది, తుఫాన్ ఆపింది తానే అని గాలి కబుర్లు చెప్పే సీఎం జగన్ కాదన్నారు.