చంద్రబాబు వ్యూహం ఫలించేనా? వికటించేనా?

ఆంధ్రలో భాజపా ఓటు బ్యాంకు అనేది తెలుగుదేశం ఆవిర్భావంతోటే చిక్కిపోతూ వస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడం ఇలాంటి ఆట చిరకాలంగా ఆడుతూ రావడంతో నికార్సయిన క్యాడర్ అనేది లేకుండాపోయింది. పైగా వెంకయ్య నాయుడు…

ఆంధ్రలో భాజపా ఓటు బ్యాంకు అనేది తెలుగుదేశం ఆవిర్భావంతోటే చిక్కిపోతూ వస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, విడిపోవడం ఇలాంటి ఆట చిరకాలంగా ఆడుతూ రావడంతో నికార్సయిన క్యాడర్ అనేది లేకుండాపోయింది. పైగా వెంకయ్య నాయుడు సారథ్యం వచ్చాక. సీనియర్లు అంతా పోయిన వాళ్లు పోయారు. తప్పుకున్నవాళ్లు తప్పుకున్నారు. అవసరం కోసం వచ్చేవాళ్లు, వెళ్లడం, రావడం చేస్తూ వచ్చారు. దాంతో సరైన దిశ, దశ లేకుండా పోయింది ఆ పార్టీకి.

మోడీ హయాం వచ్చిన తరువాత, ముఖ్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో వెంకయ్య హవా తగ్గిపోయిన తరువాత మళ్లీ కొత్త తరం భాజపాలో కనిపించడం మొదలైంది. అప్పటి వరకు తెరవెనుక సాగిన నాయుడు ప్లస్ నాయుడు బంధాలు, బంధనాలు వీడిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు ఎంత ప్రయత్నించినా భాజపా దగ్గర కావడం లేదు. దగ్గరకు రానివ్వడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో ఇంతో అంతో ఓటు బ్యాంకు భాజపాకు కూడా ఏర్పడుతోంది అన్న సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అది ఎంత వరకు నిజం అన్నది తెలియాలి అంటే నికార్సయిన ఎన్నికలు రావాల్సి వుంది. కానీ ఈలోగానే ఆ ఓటు బ్యాంకును ఖాళీ చేయించి, తన ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రయత్నంలో కూడా ఉభయతారక ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు క్లారిటీగా తెలిసిపోతోంది.

హిందూత్వ

గతంలో తాను ఏం చేసాను అన్నది తెలుగుదేశం పార్టీ చాలా కన్వీనియెంట్ గా మరచిపోతోంది. ఆలయాల విషయంలో ఎలా వ్యవహరించిందీ మరిచిపోతోంది. చిలుకూరు ఆలయ వ్యవహారం గుర్తులేనట్లుగా వుంది. విజయవాడ ఆలయాల కూల్చివేత గుర్తే లేదు. చర్చిలకు, మసీదులకు వెళ్లి ఇచ్చిన ప్రసంగాల వైనమే లేదు. హిందూత్వ అంటూ జపం చేస్తోంది. జగన్ ను క్రిస్ట్రియన్ అంటూ టార్గెట్ చేస్తోంది. నిజానికి ఇలా చేయడం రాజకీయంగా ఆత్మహత్యా సదృశం అని తెలిసిందే.

రాష్ట్రంలో మైనారిటీ ఓటు బ్యాంకు మొత్తాన్ని వదిలేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అయిపోయింది. నేరుగానే కామెంట్లు, విమర్శలు చేయడం ద్వారా ఆ ఓటు బ్యాంకు తమకు రాదు అనో, తమది కాదు అనో, తమకు అక్కర్లేదు అనో డిసైడ్ అయిపోయినట్లేగా. అదే సమయంలో హిందూత్వ మీద గట్టిగా పోరాడే వీరుడు నేనే అని అనిపించుకోవడానికి తహతహలాడుతున్నారు అంటే రెండు కారణాలు అయి వుండాలి.

ఒకటి భాజపా ఎక్కడ బలపడుతుందో, ఆ ఓటు బ్యాంకును ఎక్కడ తన్నుకుపోతుందో అన్న భయం అన్నా వుండి వుండాలి. లేదా తాను కూడా హిందూత్వ అని చాటుకుంటూ, భాజపాకు దగ్గర కావాలన్న ప్రయత్నం అన్నా అయి వుండాలి. అంతకు మించిన కారణాలు వుంటాయి అని అనుకోవడానికి లేదు. అయితే ఇక్కడే అసలు సమస్య వుంది.

అటు భాజపా ఇటు తేదేపా రెండూ మైనారిటీ ఓటు బ్యాంకును వద్దని ఫిక్స్ అయిపోయిన తరువాత బిసి, కాపు, అగ్రవర్ణాల ఓట్లు మాత్రమే మిగులుతాయి. ఎస్సీ ఎస్టీల్లో కొంత శాతం వుంటుంది. ఈ ఓట్లలో ముఖ్యంగా అగ్రవర్ణాల ఓట్ల మీద, కాపుల ఓట్ల మీద భాజపా దృష్టి పెట్టుకుని వుంది.

ఇప్పుడు తేదేపా ఆ ఓటు బ్యాంకును టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అలా చేయడం వల్ల భాజపా భవిష్యత్ ఆశలకు తెదేపా గండి కొడుతున్నట్లే అవుతుంది. ఈ సంగతి గమనించే తేదేపాతో సమానంగా భాజపా కూడా రామతీర్థంలో హడావుడి చేసే ప్రయత్నం చేసింది.

తిరుపతి బరిలో భాజపాను ఎలాగైనా మూడో స్థానానికి పరిమితం చేయాలన్నది తేదేపా సంకల్పం. ఇప్పుడు హిందూత్వను భుజానకు ఎత్తుకోవడం కూడా అందులో భాగమే. మరి ఈ విధంగా తన భవిష్యత్ కార్యాచరణను దెబ్బ తీసే ఆలోచనలు చేస్తున్న తేదేపాను భాజపా దగ్గరకు రానిస్తుందా? ఎలాగైనా తమ దగ్గరకు వచ్చి, తమ అండతో మళ్లీ అధికారం సాధించాలనుకునే తేదేపా ఆశలకు భాజపా నీరు పోస్తుందా?

బాబు తొందరపాటు

ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. అపరచాణక్యుడు అనిపించుకున్న చంద్రబాబు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని విఫలమవుతున్నారు. ఇది గత కొన్నేళ్లుగా రుజువు అవుతున్న విషయం. 

మోడీకి దేశంలో ఎలాంటి  మద్దతు వుందీ అన్నది సరిగ్గా అంచనా వేయకుండా, తొందరపడి ఆయనకు దూరం జరిగారు. మోడీని ఎలాగైనా ప్రధాని కానివ్వకూడదు అని కాలికి బలపం కట్టుకుని తిరిగి వ్యతిరేక ప్రచారం చేసారు. అది వికటించింది. ఈ రోజు ఒక్కసారి కూడా ఢిల్లీ వెళ్లి మొహం చూపించలేకపోతున్నారు.

జనాలు తనకు వ్యతిరేకం అయిపోతున్నారనే భయాన్ని అర్జెంట్ గా పసుపుకుంకుమ డబ్బులు వేయడం ద్వారా తనకు తానే బయట పెట్టేసుకున్నారు. దాంతో బాబు భయపడుతున్నారు అని జనాలకు మరింత క్లారిటీ వచ్చేలా తొందరపడి ఆయనే చేసుకున్నారు.

ఇప్పుడు దేశంలో మోడీకి అంతో ఇంతో వ్యతికేక పవనాలు వీస్తుంటే, ఎలాగైనా ఆయన పంచన చేరాలని తహతహలాడుతున్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు. 

రైతు ఉద్యమాన్ని ప్రస్తావించడమే ఆయన వల్ల కావడం లేదు. ఏ యువత అయితే మోడీకి మద్దతు ఇస్తోందో అదే యువత దేశ రాజధాని దగ్గర సాగుతున్న రైతు ఉద్యమానికి కూడా మద్దతు ఇస్తోంది. కార్పోరేటీకరణను వ్యతిరేకిస్తోంది.

ఇలాంటి టైమ్ లో ఇటు హిందూత్వను తలెకెత్తుకోవడం, అటు మోడీకి దగ్గర కావాలని ప్రయత్నించడం, అదే సమయంలో ఆంధ్రలో భాజపాను కట్టడి చేయాలని ప్రయత్నించడం వంటి వ్యూహాలు తేదేపా ఆశయ సాధనకు ఏ మేరకు సహకరిస్తాయన్నది అనుమానం.

అసలు విషయం వదిలేసారు

నిజానికి చంద్రబాబు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు తీసుకుంటున్న వన్నీ టెంపరరీ సమస్యలు. బిసి లు, కాపులు, ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు అన్నవి బలమైన ఓటు బ్యాంకులు. వీటిలో మైనారిటీలను వదిలేసారు. కాపులకు ప్రయారిటీ ఇచ్చి వారిని దగ్గరకు తీసుకోవాలనుకుంటోంది భాజపా. 

ఇక మిగిలింది బిసిలు, ఎస్సీ ఎస్టీలు. వీరిలో ఎస్సీ ఎస్టీలను కాంగ్రెస్ నుంచి తీసుకుంది వైకాపా. దాన్ని దూరం చేయాలని దళితులపై దాడులు అనే కార్డ్ ను ఆ మధ్య వీలయినపుడంతా వాడారు. కానీ ఇలాంటి దాడుల విషయంలో తేదేపా కూడా తక్కువ తిన్న పార్టీ కాదు అని దళితులకు బాగా తెలుసు. 

అసలు అందుకే కదా వారు తేదేపాకు దూరం అయింది. ఇక మిగిలింది బిసిలు. వీరికి వైకాపా మీద ప్రస్తుతానికి ఏ కంప్లయింట్ లేదు. 2019లో జగన్ వెంట వున్నారు. ఆయన కూడా వారికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.

అందువల్ల తేదేపా చేయాల్సింది కులాల ఓట్లు, మతాల ఓట్ల పాకులాట కాదు. స్థానిక సమస్యల మీద పోరు చేసి, జనాల మనసులు మళ్లీ గెల్చుకోవడం. కానీ ఆదిశగా అవకాశం దొరకడం లేదు. ఇసుక సమస్య అనుకున్నారు. అది పరిష్కారం అయిపోయింది దాదాపుగా. స్కూళ్లు బాగుపడ్డాయి. ఆసుపత్రులు, పిహెచ్ సి లు బాగుపడ్డాయి. గ్రామ సచివాలయాలు వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు వచ్చాయి. రోడ్ల మరమ్మతు ప్రారంభమైంది.

మరింక అవకాశం ఎక్కడ. అందుకే ఈ కుల, మత వ్యవహారాలు పట్టుకున్నారు. కానీ ఇవన్నీ చేయాల్సింది ఇప్పుడు కాదు. ఎన్నికలు ఆరు నెలలు వున్నాయి అనగా. మరో వారం రోజుల్లో ఈ వ్యవహారాలు చల్లబడిపోతాయి. కానీ బాబుగారు, తేదేపా నాయుకులు చేసిన కామెంట్లు మిగిలిపోతాయి. అందువల్ల వ్రతం చెడ్డా పలితం దక్కనట్లు అవుతుంది.

అటు హిందూత్వ ఓట్లలో వాటా మాత్రమే తీసుకుని, అటు మైనారిటీ ఓట్లు వదిలేసుకుని తేదేపా సాధించేది ఏమిటి? అది చంద్రబాబుకే తెలియాలి. గత కొన్నేళ్లుగా బాబుగారి వ్యూహాలన్నీ వికటిస్తున్నాయి. అయినా నెట్టుకుంటూ వస్తున్నారు. ఈసారి కూడా వ్యూహం వికటిస్తే, 2023లో అధికారం అందకపోతే అది బాబుగారి సంగతి అలా వుంచి, తెలుగదేశం మనుగడనే దెబ్బతీసే అవకాశం ఎక్కువగా వుంది.

చాణక్య

దర్శకుడిగా మారుతున్న రవితేజ

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?