మ‌హిళ‌ల శరీరాల‌పై హైకోర్టు కామెంట్స్…వావ్‌!

మ‌హిళ‌ల శ‌రీరాల‌పై కేర‌ళ హైకోర్టు చేసిన కామెంట్స్ ముచ్చ‌ట‌గొలిపేలా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పురుషాధిక్య స‌మాజంలో కొన్ని అంశాల్లో మ‌హిళ‌ల‌పై ఇంకా అణ‌చివేత కొన‌సాగుతూనే వుంది. మ‌నం కోరుకున్న‌ట్టే మ‌హిళ‌లు జీవించాల‌నే ధోర‌ణి లేక‌పోలేదు.…

మ‌హిళ‌ల శ‌రీరాల‌పై కేర‌ళ హైకోర్టు చేసిన కామెంట్స్ ముచ్చ‌ట‌గొలిపేలా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పురుషాధిక్య స‌మాజంలో కొన్ని అంశాల్లో మ‌హిళ‌ల‌పై ఇంకా అణ‌చివేత కొన‌సాగుతూనే వుంది. మ‌నం కోరుకున్న‌ట్టే మ‌హిళ‌లు జీవించాల‌నే ధోర‌ణి లేక‌పోలేదు. సంస్కృతి, సంప్ర‌దాయాలు, క‌ట్టుబాట్లు కేవ‌లం మ‌హిళ‌ల‌కే ప‌రిమితం చేయ‌డాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. వీటిపై తిరుగుబాటు చేసే మ‌హిళ‌ల‌ను స‌మాజం చిన్న‌చూపు చూస్తోంది. ర‌క‌ర‌కాల పేర్ల‌తో మాన‌సికంగా క్షోభ‌కు గురి చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో మ‌హిళ‌ల శ‌రీరాల‌పై కేర‌ళ హైకోర్టు తాజాగా చేసిన కామెంట్స్ ఆలోచించేలా ఉన్నాయి. హైకోర్టు గౌర‌వాన్ని పెంచేలా ఉన్నాయి. అలాగే న‌గ్న‌త్వానికి, అశ్లీల‌త‌కు తేడా వుంద‌ని న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. సామాజిక కార్య‌క‌ర్త రెహ‌నా ఫాతిమాపై పోక్సో, జువెనైల్ జ‌స్టిస్ యాక్ట్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ చ‌ట్టాల కింద న‌మోదైన కేసులో విచార‌ణ‌లో భాగంగా కేర‌ళ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అలాగే ఆమెకు కోర్టులో ఊర‌ట ల‌భించింది.

కొంత కాలం క్రితం ఫాతిమా సోష‌ల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె ప‌డుకుని వుంటే, న‌డుము ఫైభాగాన ఎలాంటి వ‌స్త్రం లేని ఆమె ఒంటిపై ఫాతిమా కుమారుడు, కుమార్తె రంగులు వేస్తుంటారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో భారీగా వైర‌ల్ అయ్యింది. ఆమెపై పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌య్యాయి. కేసుల నుంచి విముక్తి కోసం ఆమె న్యాయ‌పోరాటానికి దిగారు.

ఈ క్ర‌మంలో వ్య‌వ‌హారం కేర‌ళ హైకోర్టుకు చేరింది. కేసు విచార‌ణ‌లో భాగంగా జ‌స్టిస్ కౌస‌ర్ ఎడ‌ప్ప‌గ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హిళ‌ల‌కు త‌మ సొంత శ‌రీరాల‌పైన్నే హ‌క్కు లేకుండా పోతోంద‌ని వాపోయారు. న‌గ్న‌త్వం, అశ్లీల‌త ప‌ర్యాయ‌ప‌దాలు కావ‌ని కోర్టు వ్యాఖ్యానించింది. సామాజిక కార్య‌క‌ర్త ఫాతిమా తన శరీరాన్ని తన పిల్లల కాన్వాస్‌లా వాడుకోనిచ్చారే తప్ప, తన లైంగిక వాంఛ‌ల‌ను తీర్చుకోడానికి కాద‌ని కేర‌ళ హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

పిటిష‌న‌ర్  రెహ‌నా ఫాతిమా ప్ర‌ధానంగా స్త్రీపురుషుల శ‌రీరాల‌ను స‌మాజం చూసే దృష్టిలో మార్పు రావాల‌నే త‌ప‌న‌తో సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్ట‌డాన్ని కేర‌ళ హైకోర్టు సానుకూలంగా చూసింది. మ‌గ‌వాళ్ల‌ శరీరంలో పైభాగం నగ్నంగా ఉన్నా దాన్ని లైంగిక దృష్టితో చూడని సమాజం.. త‌మ విషయంలో మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ఆ వివ‌క్ష‌ను ధిక్కరించేందుకే తాను ఆ బాడీ పెయింటింగ్‌ వీడియో పెట్టానంటూ పిటిష‌నర్ రెహనా వివరణతో కోర్టు ఏకీభవించింది. ఈ కేసులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చి రెహనాకు కోర్టు విముక్తి క‌ల్పించింది.