కీచకుడిని కాపాడుతోంటే.. పరువు పోదా?

ఒక అప్రస్తుతం అంశాన్ని ముందు ప్రస్తావించాలి. రాహుల్ విదేశాలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతరత్రా సభాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆ సమావేశాల్లో ఆయనేమీ ధర్మోపన్యాసాలు ఇవ్వడం లేదు కదా.. రాజకీయాలే…

ఒక అప్రస్తుతం అంశాన్ని ముందు ప్రస్తావించాలి. రాహుల్ విదేశాలలో తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇతరత్రా సభాకార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆ సమావేశాల్లో ఆయనేమీ ధర్మోపన్యాసాలు ఇవ్వడం లేదు కదా.. రాజకీయాలే మాట్లాడతారు. 

అధికారంలో లేని భారతదేశ రాజకీయ నాయకుడి నుంచి.. ఆ దేశంలోని పరిస్థితులను తెలుసుకోవడానికే సభికులు కూడా వస్తారు. ఆయన భారతదేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల గురించి తనకు తెలిసింది, తాను అభిప్రాయపడుతున్నది మాట్లాడుతోంటే.. కమలదళానికి కంటగింపుగా ఉంది. ప్రపంచ దేశాల ఎదుట రాహుల్ మన దేశం పరువు తీస్తున్నారని వారంతా గొల్లుమంటున్నారు. రాహుల్ గాంధీని అనేక రకాలుగా విమర్శిస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. రాహుల్ విదేశాలలో మాట్లాడితే మాత్రమే మన దేశం పరువు పోతుందా? మరో రకంగా మన దేశం పరువు పోయే మార్గాలేమీ లేవా? అనేది! భారత దేశానికి పతకాలు తీసుకువచ్చిన, అంతర్జాతీయ యవనికపై మన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన మహిళా రెజ్లర్లు మా మానహానికి దాపురించిన కీచకుడి బారినుంచి కాపాడమని, ఆ కీచకుడిని రెజ్లర్ల సమాఖ్యకు సారథిగా తొలగించమని ఆందోళన చేస్తున్నారు. 

తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, కెరీర్ లో మంచి అవకాశాలు రావాలంటే.. తనతో గడపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కొన్ని నెలలుగా వారి పోరాటం సాగుతోంది. వారి పోరాటం పట్ల కేంద్రప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. వారిని అణిచివేయడానికి ప్రయత్నిస్తోంది. వారి మొరను ఆలకించే ఉద్దేశాన్ని కూడా కనబరచడం లేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు కీచకుడు- బిజెపి ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ కావడమే అందుకు కారణం.

ఈ నేపథ్యంలో భారతదేశంలో మహిళా రెజ్లర్ల మానానికి రక్షణ లేకుండా పోతోందంటూ.. వారి ఉద్యమానికి మద్దతుగా ఒలింపిక్ అసోసియేషన్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనే అంతర్జాతీయ సమాఖ్య అన్నీ కూడా నిలుస్తున్నాయి. భారత ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాయి. 

ఇలా అంతర్జాతీయ క్రీడాసమాఖ్యలు, మన ప్రభుత్వాన్ని తప్పు పడుతోంటే భారతదేశం పరువు పోదా? కేవలం రాహుల్ మాట్లాడితే మాత్రమే పోతుందా? మోడీసారథ్యంలోని కేంద్రప్రభుత్వం కీచకుడిని కాపాడుతోందని, అమ్మాయిల ఆందోళనను చిన్నచూపు చూస్తోందని అంతర్జాతీయంగా ఇవాళ చర్చనీయాంశం అవుతోంది. 

కేవలం రాహుల్ మాటల మీద పడి విమర్శలు చేయడం కాదు. తమ చేతలే మరింత ఎక్కువగా దేశం పరువును అంతర్జాతీయంగా దిగజారుస్తున్నాయని కేంద్రప్రభుత్వం గ్రహించాలి.