భాస్క‌ర్‌రెడ్డి బెయిల్‌పై సీబీఐ ఏమ‌న్న‌దంటే…!

వివేకా హ‌త్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. హ‌త్య కేసు విచార‌ణ‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఈ నెలాఖ‌రుకు ముగించాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో హ‌త్య కేసులో దాదాపు అనుమానితులంద‌రిని సీబీఐ అరెస్ట్ చేసింది.…

వివేకా హ‌త్య కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. హ‌త్య కేసు విచార‌ణ‌ను సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఈ నెలాఖ‌రుకు ముగించాల్సి వుంది. ఈ నేప‌థ్యంలో హ‌త్య కేసులో దాదాపు అనుమానితులంద‌రిని సీబీఐ అరెస్ట్ చేసింది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని మాత్రం సీబీఐ అరెస్ట్ చేయ‌లేక‌పోయింది. అవినాష్‌రెడ్డి విచార‌ణ‌, అరెస్ట్‌కు సంబంధించి అనేక మ‌లుపులు తిరిగాయి. చివ‌రికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరుతో ఆయ‌న అరెస్ట్ ఆగిపోయింది. దీంతో ఇక అవినాష్‌రెడ్డి అరెస్ట్ ఉండ‌క‌పోవ‌చ్చ‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

ఈ నేప‌థ్యంలో అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి బెయిల్‌పై ఇవాళ సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది. భాస్క‌ర్‌రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. వివేకా హ‌త్య‌తో భాస్క‌ర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేద‌ని, బెయిల్ మంజూరు చేయాల‌ని ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపించారు. ఇదే సంద‌ర్భంలో సీబీఐ కౌంట‌ర్ దాఖ‌లు చేసింది. ద‌ర్యాప్తు సాగుతోంద‌ని, ఈ ద‌శ‌లో ఆయ‌న‌కు బెయిల్ ఇవ్వొద్ద‌ని సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదులు గ‌ట్టిగా వాదించారు. దీంతో విచార‌ణ‌ను కోర్టు రేప‌టికి వాయిదా వేసింది.

అవినాష్‌రెడ్డికి ముంద‌స్తు బెయిల్ మంజూరైన ప‌రిస్థితుల్లో భాస్క‌ర్‌రెడ్డికి కూడా ల‌భించే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు. హ‌త్య కేసులో త‌న పాత్ర‌పై ఎలాంటి ఆధారాలు లేన‌ప్పుడు, కేవ‌లం ఎవ‌రో ఏదో చెప్పార‌నే కార‌ణంతో అరెస్ట్ చేయ‌డం ఏంట‌ని భాస్క‌ర్‌రెడ్డి బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నారు. 

కేవ‌లం త‌న‌తో పాటు త‌న కుమారుడిని ఇరికించేందుకే సీబీఐ కుట్ర‌పూరితంగా అరెస్ట్ చేసింద‌ని భాస్క‌ర్‌రెడ్డి చేస్తున్న వాద‌న‌తో సీబీఐ కోర్టు ఎంత వ‌ర‌కూ ఏకీభ‌విస్తుందో చూడాలి. భాస్క‌ర్‌రెడ్డి బెయిల్ పిటిష‌న్ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.