అవ‌స‌ర‌మైతే… పార్టీని విలీనం చేస్తా…!

ఇది ఎన్నిక‌ల సీజ‌న్‌. రాజ‌కీయంగా ఏమైనా జ‌ర‌గొచ్చు. తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సంచ‌ల‌న కామెంట్స్‌. తెలంగాణ‌ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు…

ఇది ఎన్నిక‌ల సీజ‌న్‌. రాజ‌కీయంగా ఏమైనా జ‌ర‌గొచ్చు. తెలంగాణలో రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ సంచ‌ల‌న కామెంట్స్‌. తెలంగాణ‌ అసెంబ్లీకి ఈ ఏడాది చివ‌ర్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్యూహ‌ప్ర‌తివ్యూహ‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యాయి. బీఆర్ఎస్ ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు అన్ని ర‌కాల అస్త్రాల‌ను ప్ర‌యోగించ‌డానికి సిద్ధం చేసుకుంది.

బీఆర్ఎస్‌ను ఎలాగైనా గ‌ద్దె దించాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌తిప‌క్షాలు కూడా సీరియ‌స్‌గా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న పార్టీ విలీనంపై ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2018 ఎన్నిక‌ల‌కు ముందు  ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ నేతృత్వంలో తెలంగాణ జ‌న‌స‌మితి అనే పార్టీ ఆవిర్భ‌వించింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌, టీడీపీ, వామ‌ప‌క్షాల‌తో పాటు కోదండ‌రామ్ పార్టీ కూడా పొత్తులో ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ వ‌ల్ల రాజ‌కీయ ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని ఆశించిన‌ప్ప‌టికీ, కేసీఆర్ వ్యూహాల ముందు ఎవ‌రూ నిల‌వ‌లేక‌పోయారు.

మ‌రోసారి కేసీఆర్ స‌ర్కార్ ఏర్ప‌డ‌డంతో కోదండ‌రామ్ పార్టీ ఉన్నాలేన‌ట్టుగా త‌యారైంది. అడ‌పాద‌డ‌పా త‌ప్ప‌, కోదండ‌రామ్ రాజ‌కీయ కార్య‌క‌లాపాలేవీ జ‌ర‌గ‌డం లేదు. సూర్యాపేట‌లో  నిర్వ‌హించిన పార్టీ ప్లీన‌రీ స‌మావేశాల్లో కోదండ‌రామ్ మాట్లాడుతూ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ఎలాంటి రాజ‌కీయ నిర్ణ‌యాన్ని అయినా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. అవ‌స‌ర‌మైతే పార్టీని విలీనం చేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేయ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. కోదండ‌రామ్ ఏ పార్టీలో విలీనం చేస్తార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

బీఆర్ఎస్‌ను ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా కోదండ‌రామ్ త‌న పార్టీని విలీనం చేయొచ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయ‌డం వ‌ల్ల అంతిమంగా బీఆర్ఎస్‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి కేసీఆర్‌ను గ‌ద్దె దించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ స‌రైన వేదిక‌గా కోదండ‌రామ్ ఎంచుకుంటారో చూడాలి.