జ‌న‌సేనాని మెగా డ్రామా!

జ‌న‌సేన‌ 9వ ఆవిర్భావ స‌భ ల‌క్ష్యం ఏంటో తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌ప‌డింది. తాడేప‌ల్లి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో నిర్వ‌హించిన 9వ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఆ పార్టీ…

జ‌న‌సేన‌ 9వ ఆవిర్భావ స‌భ ల‌క్ష్యం ఏంటో తేలిపోయింది. ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌ప‌డింది. తాడేప‌ల్లి మండ‌లం ఇప్ప‌టం గ్రామంలో నిర్వ‌హించిన 9వ జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ఆ పార్టీ శ్రేణులు ‘సీఎం సీఎం’ అంటూ  గ‌ట్టిగా నిన‌దిస్తూ త‌మ ఆకాంక్ష‌ను మ‌రోసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎదుట ప్ర‌ద‌ర్శించాయి. ఇదే సంద‌ర్భంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం శ్రేణుల ఆకాంక్ష‌ల‌పై నీళ్లు చ‌ల్లారు.

టీడీపీతో పొత్తుపై ప‌రోక్షంగా సానుకూల సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా ఆ పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గుర‌య్యాయి. త‌మ అధినాయ‌కుడు సీఎం కావాల‌ని కోరుకుంటుంటే, ఆయ‌న మాత్రం టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఆ సీటులో కూచోపెట్టాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ని వాపోతున్నారు. రాజ‌కీయ పంథాపై ఇప్ప‌టికీ ప‌వ‌న్‌క‌ల్యాన్ గంద‌ర‌గోళంలో ఉన్నార‌ని ఆయ‌న మాట‌లే చెబుతున్నాయి.

2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఈ సంద‌ర్భంగా తాము అధికారంలోకి వ‌స్తే చేయ‌బోయే మంచి ప‌నులేంటో కూడా ఆయ‌న స‌భాముఖంగా ప్ర‌క‌టించారు.‘2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కు కుంటాం. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం’ అని ప‌వ‌న్‌క‌ల్యాన్ స్ప‌ష్టం చేశారు. 

ఇంత వ‌ర‌కూ బాగానే ఉంద‌ని, చివ‌ర్లో ముగింపు వ్యాఖ్య‌లు ఆయ‌న మాన‌సిక అప‌రిప‌క్వ‌త‌ను, రాజ‌కీయ అజ్ఞానాన్ని చూపుతున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా… వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప‌వ‌న్‌ ప్రకటించారు.

టీడీపీతో పొత్తు కుదుర్చుకోవ‌డం ద్వారా ప్ర‌తిప‌క్ష పార్టీల కూట‌మికి అధిక సీట్లు వ‌స్తే, చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవుతారే త‌ప్ప‌, ప‌వ‌న్ ప‌రిస్థితి ఏంట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.  

ఒక‌వైపు జ‌న‌సేన అధికారంలోకి రాగానే ఉద్యోగ ఖాళీల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌ని, అప్పుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామ‌ని, ఇన్వెస్ట‌ర్ ఫ్రెండ్లీ ప్ర‌భుత్వం తీసుకొస్తామ‌ని, విశాఖ‌ను విశ్వ‌న‌గ‌రంగా , విజ‌య‌వాడ‌, తిరుప‌తిని బ‌ల‌మైన హైటెక్ న‌గ‌రాలుగా తీర్చిదిద్దుతామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టిస్తుంటే జ‌న‌సేన శ్రేణులు అధికారంలోకి వ‌చ్చినంతగా హ్యాపీగా క‌నిపించాయి. టీడీపీతో పొత్తుపై ప‌రోక్షంగా సానుకూల సంకేతాలు ఇవ్వ‌డంతో… అంత వ‌ర‌కూ చెప్పిన మాట‌ల‌న్నీ ఉత్తుత్తివే అనే తేలిపోయింది.

ఎంత‌సేపూ చంద్ర‌బాబుకు అధికారం క‌ట్ట‌బెట్టేలా రాజ‌కీయం చేయ‌డం త‌ప్ప‌, సొంతంగా ప్ర‌జాద‌ర‌ణ పొందాల‌నే బ‌లీయ‌మైన కోరిక ప‌వ‌న్‌లో క‌నిపించ‌క‌పోవ‌డాన్ని ఈ ఆవిర్భావ స‌భ చూపింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డం ప‌వ‌న్‌కు ప‌రిపాటైంది. 

చంద్ర‌బాబుపై గుండెల నిండా ప్రేమ నింపుకుని, పొంత‌న‌లేని మాట‌ల‌ను చెప్ప‌డం ప‌వ‌న్‌కే చెల్లింది. ఈ మాత్రం దానికి భారీ స‌భ నిర్వ‌హించి న‌టించ‌డం దేనికి? అనే ప్ర‌శ్న‌లు అధికార పార్టీ నుంచి వ‌స్తున్నాయి. బాబును సీఎం చేయాల‌నేది త‌న ల‌క్ష్య‌మ‌ని స‌భా వేదిక సాక్షిగా ప్ర‌క‌టించి ఉంటే, జ‌న‌సేన శ్రేణులు ఏం చేయాలో నిర్ణ‌యించుకునేవ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.