సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వేడి రోజురోజుకూ రాజుకుంటోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ భవిష్యత్ రాజకీయంపై దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలన్నీ ఏకం కానున్నాయనే స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైఎస్ జగన్ అధ్యక్షతన మంగళవారం వైఎస్సార్‌సీపీ శాసనసభా పక్షం సమావేశం జరగనుంది. శాసనసభ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా లేదా బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత, మరోవైపు ప్రతిపక్షాల ఐక్యత వెరసి వైసీపీకి రానున్న ఎన్నికలు పెద్ద సవాలే.
సంక్షేమ పథకాల విషయంలో ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించే పరిస్థితి లేదు. కానీ అభివృద్ధి, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులపై కనీసం కూడా ప్రభుత్వం శ్రద్ధ చూపలేదనే అసంతృప్తి నెలకుంది. ఎన్నికల నాటికి వివిధ వర్గాల్లో అసంతృప్తిని తగ్గించుకోవడంపైన్నే వైసీపీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ప్రతిపక్షాలు ఏకమైతే, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, తిరిగి అధికారంలోకి ఎలా రావాలనే అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. మరోవైపు మంత్రివర్గ మార్పుపై కూడా స్పష్టత ఇచ్చే అవకాశాలున్నాయి. సీనియర్ నాయకులకు పార్టీ బలోపేత బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలు దూకుడు ప్రదర్శిస్తున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యేలతో ఇవాళ్టి జగన్ సమావేశం మాత్రం ఎంతో కీలకమైందని చెప్పొచ్చు. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు రచించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.