అమిత్ షాతో బాబు: దూతగానా? నేతగానా?

కేంద్రం హోం మంత్రి బిజెపిలో కీలకంగా చక్రం తిప్పే అమిత్ షాతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి…

కేంద్రం హోం మంత్రి బిజెపిలో కీలకంగా చక్రం తిప్పే అమిత్ షాతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీలో సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో ఇలాంటి భేటీ జరగడం వెనుక మర్మం పూర్తిగా పొత్తులకు సంబంధించిన వ్యవహారమే అని ఎవ్వరైనా ఊహిస్తారు. అయితే ఇతర కారణాల గురించి కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు ఢిల్లీ యాత్ర గురించి వినిపిస్తున్న పుకార్లలో- ఆయన పాలన కాలంలో స్కిల్ డెవలప్మెంట్, తదితర  కుంభకోణాలు జరిగాయి. వాటి మీద విచారణ ఇప్పటికే ఒక కొలిక్కి వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం తన మీద చర్యలు తీసుకోవడంలో ముందుకు వెళ్లకుండా కాపాడాలని కోరడానికి వెళ్లినట్టుగా ఒక వాదన ఉంది. అయితే ఇది అంత నమ్మశక్యంగా లేదు. చంద్రబాబు మీద చర్యలు తీసుకోడానికి తగినట్టుగా , ఆయన పాత్ర గురించి అరెస్టు చేయడానికి చాలినన్ని ఆధారాలు దొరికితే గనుక.. అమిత్ షా, మోడీలు కాదు కదా.. బ్రహ్మరుద్రాదులు చెప్పినా సరే జగన్ విడిచిపెట్టరు అనేది అందరికీ తెలిసిన సంగతి. కాబట్టి ఈ వాదన నమ్మశక్యంగా లేదు.

అదే సమయంలో మరో పుకారు కూడా వినిపిస్తోంది. రామోజీరావు – మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. యథేచ్ఛగా నిబంధనలను అతిక్రమించి చేసుకుంటూపోయిన వ్యాపారంలోని అక్రమాలన్నింటినీ సీఐడీ నిగ్గు తేలుస్తోంది. ఈ నేపథ్యంలో రామోజీరావు, ఆయన కోడలు మరియు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అరెస్టులు తప్పకపోవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈ వాదన కాస్త నమ్మదగినది ఎందుకంటే. దేశంలో చిట్ ఫండ్ కంపెనీలు అన్నీ కేంద్రం పరిధిలోని 1982 నాటి చిట్ ఫండ్ చట్టం అనుసరించి వ్యాపారం చేయాలి. అయితే ఈ చట్టం ప్రకారం తాము వ్యాపారం చేయడం లేదని మార్గదర్శి యజమానులే సీఐడీ వద్ద వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేంద్రం ‘ప్రత్యేకంగా’ సహకరించకపోతే తప్ప.. రామోజీరావు అరెస్టు కాకుండా ఉండడం అనేది అసాధ్యం. అందుకే రామోజీరావు తరఫున దూతగా చంద్రబాబునాయుడు అమిత్ షా వద్దకు వెళ్లి.. ఆయన అరెస్టు జరగకుండా మంతనాలు చేస్తున్నారనేది రెండో సంగతి.

ఇక మూడోది, అందరూ అనుకునేది పొత్తులకు సంబంధించిన ఎజెండా. చంద్రబాబునాయుడు తాను ఒక రాజకీయ పార్టీ నేతగా.. తెలుగుదేశంతో  తెలుగురాష్ట్రాల్లో కమలదళం పొత్తులు పెట్టుకోవడం కోసం చంద్రబాబు తపన పడుతున్నారు. తద్వారా.. తెలంగాణలో శవాసనం వేసిన పార్టీకి మళ్లీ కొంత జీవం పోయవచ్చునని, ఏపీలో అధికారంలోకి రావచ్చునని ఆయన ఆశ.

అయితే స్థూలంగా గమనించినప్పుడు చంద్రబాబు నేతగా వెళ్లారా? దూతగా వెళ్లారా? అనేది కీలకం. చంద్రబాబునాయుడు వ్యక్తిత్వం గురించి తెలిసిన వాళ్ల అంచనాలు ఇంకో రీతిగా ఉన్నాయి. 

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బిజెపి పెద్దలతో భేటీ అయ్యే అవకాశం వస్తే.. ఆ అవకాశాన్ని రామోజీరావు కోసం చంద్రబాబు వృథా చేసుకోరు అని, ముందు తన కార్యం చక్కబెట్టుకున్న తర్వాతే ఇతరుల ప్రయోజనాల గురించి మాట్లాడుతారని, తనను మించి మరెవ్వరూ కూడా ఆయనకు ముఖ్యం కాదని అంటున్నారు. మరి చంద్రబాబు – అమిత్ షా భేటీ లోని మంత్రాంగం ఏమిటో, మర్మం ఏమిటో నెమ్మదిగా బయటకు వస్తుందేమో గమనించాలి.