‘ముని’వాక్యం: ఓ వివస్త్రా.. నమో నమామి!

‘మనం దుస్తులు ఎందుకు ధరిస్తాం?’.. ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే భిన్నమైన సమాధానాలు వస్తాయి. శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం దుస్తులు ధరిస్తుంటాం. ఎందుకు? కాస్త వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ప్రకృతిలో వచ్చే…

‘మనం దుస్తులు ఎందుకు ధరిస్తాం?’.. ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే భిన్నమైన సమాధానాలు వస్తాయి. శరీరాన్ని కప్పుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం దుస్తులు ధరిస్తుంటాం. ఎందుకు? కాస్త వెనక్కు వెళ్లి ఆలోచిస్తే ప్రకృతిలో వచ్చే వాతావరణ హెచ్చుతగ్గుల నుంచి దేహాన్ని కాపాడుకోవడానికి మానవజాతి- ఇవాళ్టి రూపంలోని దుస్తులు లాగా ధరించే వాటిని, తొలిదశలో, అంటే సుమారు లక్ష నుంచి అయిదు లక్షల సంవత్సరాలకు పూర్వం, జంతుచర్మాలతోనో ఆకులతోనో అలములతోనో ప్రారంభించి ఉంటుందని జీవపరిణామ సిద్ధాంతకర్తలు చెబుతారు. 

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిపోతూ జీవనం సాగించిన ఆదిమజాతి మానవులు.. మారిపోయే వాతావరణ పరిస్థితులనుంచి దేహాన్ని కాపాడుకోవడానికి ఇవి అవసరం అయ్యాయి. తర్వాత వాటి అవసరం అనేక విధాల నిర్వచనాలను సంతరించుకుంటూ వచ్చింది.

మనుషుల మధ్య శృంగార ఆలోచనలకు ఎదుటి వారిలోని శరీరభాగాలతో ముడిఉన్నదని అనుభూతించడం మొదలైన తర్వాత.. దుస్తుల వినియోగ అవసరం, స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి. నూలు తయారు చేయడం, నేతతో దుస్తుల తయారీ కూడా దుస్తుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేశాయి. ప్రాంతాలను బట్టి, కులాలను బట్టి, మతాలను బట్టి ఏయే శరీర భాగాలను కప్పి ఉంచాలి, ఎలాంటి దుస్తులు వినియోగించాలి.. అనే సాంప్రదాయాలు స్థల కాల పరిస్థితులకు తగినట్లుగా స్థిరపడుతూ మారుతూ స్థిరపడుతూ ఉన్నాయి.

భారతీయ/ హిందూ సాంప్రదాయానికి సంబంధించినంత వరకు మహిళలకు చీర ఒక ముఖ్యమైన వస్త్రం. కొన్ని వేల సంవత్సరాల సంగతులు– అని మనం అనుకునే పురాణాల కాలం నుంచి మనకు ‘చీర’ ఉన్నది. స్నానం చేస్తున్న మహిళల చీరలన్నింటినీ చాటుగా ఎత్తుకుపోయి వారిని అల్లరి పెట్టిన వాడిని, హీరోయిజంలో చిలిపి కోణానికి ప్రతినిధిగా మనల్ని నమ్మించిన కథలున్నాయి. మానహానిని లక్ష్యించి చీరను లాగేస్తోంటే, అదే హీరో, అంతూ దరీ ఉండని అనంతమైన చీరను ప్రసాదించినట్లుగా పురాణ దృష్టాంతాలున్నాయి. 

కానీ చీరను వాడి, ప్రాణాలను కాపాడిన స్త్రీ గురించిన కథలు మనకు లేవు. పైగా కట్టుకున్న చీరను విప్పి, నలుగురిలో నడి రోడ్డులో, ఇతరుల ప్రాణాలను కాపాడిన ధీరవనితలు, త్యాగమూర్తులు మనకు లేరు. పైగా చీరను ‘మానం’తో ముడిపెట్టి తరతరాలుగా మన బుద్ధులలో పాచిభావాలను పాతిపెట్టిన, ‘ఆడదానికి ప్రాణం కంటె మానం గొప్పది’ లాంటి అబద్ధపు నైతిక విలువలను యుగయుగాలుగా మన రక్తంలో జీర్ణింపజేసిన దుర్మార్గమైన వ్యవస్థలో.. ఒక నడివయసు మహిళ, తన చీరను పూర్తిగా విప్పేసి, ఆపదలో ఉన్నవారిని కాపాడడానికి ప్రయత్నించడం అనేది చరిత్రలో ప్రత్యేకంగా నమోదుకావాల్సిన సంగతి.

ఇప్పుడు సంఘటన గురించి ప్రస్తావిస్తాను.. బెంగుళూరు నగరంలో సుమారు పదిరోజుల కిందట భారీ వర్షాలు వచ్చాయి. మామూలు పరిస్థితుల్లో ఎంత అద్భుత నగరాలుగా శోభిల్లినా, వర్షాలు ఒకింత ఎక్కువైతే వరదలను తలపింపజేసే దౌర్భాగ్య నరకాలు, నగరాలు మనకు అనేకం ఉన్నాయి. అందులో బెంగుళూరు కూడా ఒకటి. ఆ వర్షాలకు రోడ్ల మీద ఎక్కడికక్కడ జలాశయాలు తయారయ్యాయి. బెంగుళూరు కేఆర్ జంక్షన్ వద్ద వర్షం నీళ్లు, డ్రైనేజీ పొంగుకొచ్చి పెద్ద ప్రవాహమే తయారైంది. అండర్ పాస్‌లోకి ప్రవేశించిన ఒక కారు ఆ ప్రవాహంలో చిక్కుకుపోయింది. అందులోని ఆరుగురి ప్రాణాలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెకీ భానురేఖ మరణించింది కూడా. మిగిలిన అయిదుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. బీబీఎంపీ రక్షణ బృందం వారిని కాపాడింది. ఇంతకూ వారి ప్రాణరక్షణ ఎలా జరిగింది?

వారు నీటిలో చిక్కుకున్న సంగతిని గమనించిన ఒక జర్నలిస్టు ఈదుకుంటూ కారు వద్దకు వెళ్లాడు. వారిని బయటకు తీయగలిగాడు. కానీ వారిని కాపాడాలంటే తాడు వంటిది ఏదైనా అవసరం.. తను నీళ్లలోంచే తాడు ఏదైనా అందించాలని పెద్దగా కేకలు వేశాడు.

అప్పటికే అండర్ పాస్ లో ఏదో రాద్ధాంతం జరుగుతోందని పైన రోడ్డు మీద జనం గుంపులుగా గుమికూడి ఉన్నారు. కింద మనుషుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. జర్నలిస్టు తాడుకోసం అరుస్తున్నాడు. పైన గుమికూడిన వారిలో ఎందరు ఆ దృశ్యాలను తమ తమ సెల్ ఫోన్ లలో బంధిస్తున్నారో తెలియదు. ఈలోగా ఆ రోడ్డమ్మట ఒక 42ఏళ్ల మహిళ వెళుతోంది. అండర్ పాస్ వద్ద జనం గుమి కూడా ఉండడాన్ని గమనించి తను కూడా అటు వెళ్లింది. తాడు కావాలంటున్న జర్నలిస్టు అరుపులు, ప్రమాదంలో ఉన్న ప్రాణాలు గమనించింది. 

ఆ క్షణంలో ఆమెకు మరేమీ గుర్తుకురాలేదు. వెంటనే తన చీరను విప్పేసి ఒక అంచు ఆ జర్నలిస్టు వైపు విసిరి, రెండో అంచును అండర్ పాస్ పైన ఉన్న ఇనుప రెయిలింగ్‌కు ముడివేసింది. జర్నలిస్టు దానిని అందుకుని, మునిగిపోతున్న అయిదుగురూ ఆ చీరను పట్టుకుని, కొట్టుకుపోకుండా ఉండేలా చూసి ప్రమాదంనుంచి తప్పించారు. కాసేపటికి బీబీఎంపీ సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని బయటకు తీశారు. అంతసేపు కళ్లెదుట పరిస్థితికి నిశ్చేష్టులే అయి ఉన్నారో, సినిమా చూస్తున్న తరహా అలౌకికత్వంలో ఉన్నారో తెలియదు గానీ.. ఆ గుమికూడిన జనంలోని ఒక వ్యక్తికి బుద్ధి పనిచేసింది. తను తొడుక్కున్న చొక్కా విప్పి వివస్త్రగా ఉన్న ఆ మహిళకు అందించాడు. తొడుక్కుంది. ఓ అమ్మాయి తన చున్నీని తీసి అందించింది. కప్పుకుంది.

ఒక మహిళ మానం కాపాడడానికి, తనది కాని, చీరను అందించిన వాడిని దేవుడని నిత్యమూ మొక్కుతూ ఉంటాం. అయిదుగురి ప్రాణం కాపాడడానికి తన చీరను విప్పి అందించిన స్త్రీమూర్తిని ఏం అందాం? దేవత లాంటి చిన్న పదాలు సరిపోతాయా?

చీర, పైట లాంటిది అసలు తమ రెగ్యులర్ ఆహార్యంలో ఉండనే ఉండని మహిళలు కూడా మన ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉంటారు. పైట తొలగగానే తమకు అనన్యమైన మానహాని జరిగినట్టుగా మధనపడిపోయే మహిళలు కూడా ఉంటారు. అందుకే బెంగుళూరు వనిత ఇవాళ ఆదర్శమూర్తి అయింది.

దుస్తులు కేవలం మన ఇష్టానికి, మనం ఏర్పాటు చేసుకున్న సంఘ మర్యాదకు సంబంధించినవి. కానీ దుస్తులను రాజకీయం చేసి బతకాలనుకునే వాళ్లు, దుస్తులను ఉద్యమ అంశాలు చేసి సెలబ్రిటీ హోదా నిచ్చెనలు ఎక్కాలనుకునే వాళ్లూ మనకు అనేకులు కనిపిస్తుంటారు. కానీ తోటి మనుషుల ప్రాణాలకు సంబంధించిన అవసరం ఏర్పడినప్పుడు.. మన దుస్తులు ఆ పని చేయగలవనిపించినప్పుడు.. మరే ఆలోచనా లేకుండా ముందుకు రాగల ధీరోదాత్తత అందరికీ సాధ్యం కాదు. 

చీరను మహిళ మానంతో ముడిపెట్టి చూడడానికి మనం ఎంతగా అలవాటు పడ్డాం అంటే.. సినిమాల్లో చీర పైటలోంచి చించి హీరో గాయాలకు కట్టుకడితే, అక్కడితోనే ఆ అమ్మాయిలోని ప్రేమ, త్యాగానికి మనం ముగ్ధులైపోతుంటాం. అలాంటి నటి కథానాయిక అయితే.. ఈ బెంగుళూరు మహిళలోని తెగువ, మానవత్వం, మనుషుల పట్ల ప్రేమ, నిస్సంకోచం, నిస్సంగత్వం అన్నీ కలిపి ఆమెను లోకనాయకిగా నిలబెట్టవా? ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ దేవతలు ఉండాలంటే మహిళలను పూజించాలని, ఆచరణలో మనం పాటించని ఆర్యోక్తులను నలుగురి ఎదుట ప్రవచించడం కాదు. ఆడది కాబట్టి పూజించడం అక్కర్లేదు. ఇంతటి మానవీయత ఉన్న మహిళను పూజించకుంటే, గౌరవించకుంటే, ఆమె ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించకుంటే.. మీరు పర లోకాలను నమ్మేట్లయితే.. రౌరవాది నరకాలు పట్టిపోతారు.

శ్రీమద్రామాయణ కల్పవృక్షంలో కిష్కింధకాండలో సుగ్రీవ విషాదఘట్టంలో ఇలా ఉంటుంది: సీతమ్మను వెతకడానికి తన వానరమూకను అష్టదిక్కులకూ పురమాయించి పంపాడు సుగ్రీవుడు. అంతకంటె రాముడికి తనేమీ చేయలేకపోతున్నాననే నిర్వేదంలో ‘ఒక వంద దిక్కులైనను లేవు..’ అని విలపించినట్లుగా రాస్తారు విశ్వనాథ సత్యానారాయణ! ఆ అతిశయం గుర్తుకు వస్తోంది. ఆమెకు వేయి పాదాలైననూ లేవు. అందరిలాగే రెండే పాదాలు ఉంటాయి.. కానీ వాటికి మనం వేయిసార్లు మొక్కవచ్చు. అందుకే, ఓ వివస్త్రా.. నమోనమామి.

కారులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్న వారిని కాపాడడానికి ప్రాణాలకు తెగించి ఓ జర్నలిస్టు ఆ నీటి ప్రవాహంలోకి దిగి. ఈదుకుంటూ వెళ్లి చేసిన సాహసం అపూర్వం. అతడి పూనికతోనే, ఆ తల్లి తన చీరను విప్పి అతనికి అందించడం కూడా జరిగింది. సాహసించి ఇతరుల ప్రాణాలను కాపాడే జర్నలిస్టుల కథలు కొత్తవి కాదు. అలాగని బెంగుళూరు మిత్రుడి సాహసం విస్మరణార్హం కాదు. అతడి పనికి గర్విస్తూ, ఆత్మీయమైన శుభాకాంక్షలు.

శుభకార్యాల్లోనో, వేడుకల్లోనో, వేదికలమీదనో కొత్తవారిని కలిసినప్పుడు.. ‘మీరేం చేస్తుంటారు’ అనే ప్రశ్న ఎదురైతే.. ‘జర్నలిస్టుని’ అని చెప్పడానికి సంకోచిస్తున్న, వారికి బోధపడని ప్రత్యామ్నాయ పదాలు వెతుక్కుంటున్న రోజులివి. ఈసారి ఎవరైనా అడిగితే ‘జర్నలిస్టుని’ అనే చెప్పాలి. వాళ్లు ఈ బెంగుళూరు వార్తను చదివి ఉన్న వారైతే ఈ వృత్తిలో ఉన్నందుకు నన్ను కూడా గౌరవిస్తారు. 

..కె.ఎ. మునిసురేష్ పిళ్లె

[email protected]