స‌ర్దుకున్నాక… మాట‌లేంటి నాదెండ్ల‌?

జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్ప‌టికీ ఎమ్మెల్యే కాలేన‌నే భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నారు. అందుకే టీడీపీతో పొత్తులో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి…

జ‌న‌సేన పీఏసీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఇప్పుడు కాక‌పోతే, మ‌రెప్ప‌టికీ ఎమ్మెల్యే కాలేన‌నే భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నారు. అందుకే టీడీపీతో పొత్తులో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి నాదెండ్ల మ‌నోహ‌రే కార‌ణ‌మ‌న్న భావ‌న‌ జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో బ‌లంగా వుంది. జ‌న‌సేనను బ‌లోపేతం చేయ‌కుండా చంద్ర‌బాబు చుట్టూ తిరగ‌డానికి నాదెండ్ల కార‌ణ‌మ‌ని, ఆయ‌న‌పై ఆ పార్టీ కేడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది.

ఇటీవ‌ల నాదెండ్ల‌ను ఎవ‌రైనా ఏమైనా అంటే పార్టీ నుంచి గెంటేస్తాన‌ని ప‌వ‌న్ బ‌హిరంగంగా హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెనాలిలో నాదెండ్ల పోటీపై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే తాను తెనాలి నుంచి పోటీ చేస్తాన‌ని నాదెండ్ల స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదే సంద‌ర్భంలో పొత్తుపై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీట్ల స‌ర్దుబాటుపై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూసుకుంటార‌ని తేల్చి చెప్పారు.

ఇక్క‌డే జ‌న‌సేన సీట్ల‌పై అంద‌రికీ అనుమానం వ‌స్తోంది. ఒక‌వైపు సీట్ల స‌ర్దుబాటుపై ప‌వ‌న్‌, చంద్ర‌బాబు చ‌ర్చించుకుంటార‌ని చెబుతూనే, మ‌రోవైపు తాను మాత్రం తెనాలి నుంచి బ‌రిలో దిగుతాన‌ని నాదెండ్ల చెప్ప‌డం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. సీట్ల స‌ర్దుబాటుపై స్ప‌ష్ట‌త రాకుండానే తాను తెనాలిలో పోటీ చేస్తాన‌ని నాదెండ్ల ఎలా చెబుతున్నార‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. నాదెండ్ల‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పైకి చెబుతున్న‌దొక‌టి, చంద్ర‌బాబు వ‌ద్ద మాట్లాడుకున్న‌ది మ‌రొక‌టి అనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ఇప్ప‌టికే 22 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్ల‌తో స‌రిపెట్టుకునేందుకు చంద్ర‌బాబుతో ప‌వ‌న్ ఒప్పందం చేసుకున్నార‌ని, ఇందులో భాగంగా ఎక్క‌డెక్క‌డ అనేది కూడా వాళ్ల మ‌ధ్య స్ప‌ష్ట‌త వుంద‌ని జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. ప‌వ‌న్‌, నాదెండ్ల త‌దిత‌ర ముఖ్య నేత‌లు త‌మ సీట్ల వ‌ర‌కూ ఖ‌రారు చేసుకుని, మిగిలిన‌వి టీడీపీకి వ‌దిలేశార‌నే ప్ర‌చారానికి మ‌నోహ‌ర్ మాట‌లు బ‌లం క‌లిగిస్తున్నాయ‌ని అంటున్నారు. కేవ‌లం జ‌న‌సైనికుల్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికే నాదెండ్ల వింత ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ జ‌న‌సేన కేడ‌ర్ నుంచి రావ‌డం గ‌మ‌నార్హం.