Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఆర్ఆర్ఆర్ ద్వారా చంద్రబాబు మాస్టర్‌ గేమ్‌ప్లాన్!

ఆర్ఆర్ఆర్ ద్వారా చంద్రబాబు మాస్టర్‌ గేమ్‌ప్లాన్!

పొత్తుల కోసం ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ తలుపు తట్టడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు సన్నాహాలను చంద్రబాబు నాయుడు నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లారు. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్నప్పటికీ.. ఇప్పుడే ఒక విడత మేనిఫెస్టో కూడా విడుదల చేసేసి తొందరపడుతున్న చంద్రబాబు నాయుడు.. పొత్తులను కూడా వీలైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ సయోధ్య కుదుర్చుకునేలాగా అమిత్ షా, నడ్డాలతో ఆయన భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యవహార సరళి, వ్యూహరచనా సామర్థ్యం తెలిసిన కొందరు చేస్తున్న విశ్లేషణ ఇంకోలా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘చెప్పులోని రాయి’ లాగా మారిన సొంత ఎంపీ రఘురామ కృష్ణంరాజు ద్వారా ఒక మాస్టర్ గేమ్ ప్లాన్ నడిపించాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. 

రఘురామకృష్ణరాజు తనను ఎంపీని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అప్రతిష్ట పాలు చేయడానికి కోవర్ట్ లాగా పని చేయడం ప్రారంభించిన తర్వాత- చంద్రబాబు నాయుడుని కీర్తించడం తన దైనందిన విధిలాగా నిర్దేశించుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ వీడియోలు విడుదల చేయడం, విలేకరుల సమావేశాలు పెట్టడం, పనిలో పనిగా చంద్రబాబునాయుడు భజన చేయడం.. కొన్ని సంవత్సరాలుగా రఘురామకృష్ణ రాజు చేస్తున్న పని. ఇందుకు ఆయన రుణం చెల్లించుకోవడానికి చంద్రబాబు ఒక పెద్ద ఎత్తుగడ వేశారు.

ఇప్పటిదాకా రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల నాటికి ఏ పార్టీలో ఉంటారనే స్పష్టత రాలేదు. అటు భారతీయ జనతా పార్టీ కీలక నాయకులతో కూడా ఆయన చాలా సన్నిహితంగా మెలగుతుంటారు. ఆయన తెలుగుదేశంలో చేరుతారా, కమల తీర్థం పుచ్చుకుంటారా అనే విషయంలో ఇప్పటిదాకా సంకేతాలు కూడా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తాజాగా అమిత్ షా తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు రఘురామకృష్ణ రాజు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో కలిసి తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ ఇంటికి వెళ్లారు. అలా వారితోనే ఎక్కువ సమయం గడిపారు.

ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని చంద్రబాబు మాస్టర్ గేమ్ ప్లాన్ వ్యూహరచన చేసినట్లుగా కనిపిస్తుంది. అదేంటంటే తన పరిచయాలను వాడుకొని రఘురామకృష్ణరాజు బిజెపి తీర్థం పుచ్చుకుంటారు. పొత్తులలో భాగంగా ఆయన గతంలో వైఎస్ఆర్సిపి నుంచి గెలిచిన నియోజకవర్గం నరసాపురంను తెలుగుదేశం పార్టీ బిజెపికి కేటాయిస్తుంది. అక్కడి నుంచి తిరిగి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారు.

ఇలా చేయడం వలన భారతీయ జనతా పార్టీ టికెట్ మీద తన భజనపరుడిని గెలిపించుకునే మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు సిద్ధం చేసుకున్నారు. గతంలో కూడా అచ్చంగా ఇదే పని చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. పవన్ కళ్యాణ్ ద్వారా ఎమ్మెల్యే టికెట్ కావాలని కామినేని శ్రీనివాస్ తనను ఆశ్రయించినప్పుడు.. వెళ్లి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబు ఆయనకు సూచించారు. ఆయన కోరిన నియోజకవర్గాన్ని పొత్తుల్లో బిజెపికి కేటాయించారు. గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. 

ఇలాంటి అతి తెలివితేటలు చంద్రబాబు నాయుడు బుర్రలో పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు రఘురామ కృష్ణరాజ విషయంలో కూడా అచ్చంగా అదే మాస్టర్ గేమ్ ప్లాన్ వ్యూహాన్ని ఆయన అనుసరించబోతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?