జబర్దస్త్ నటుడి చికిత్స కోసం జోలె పడుతున్న ఈనాడు!

ఆరోగ్య సమస్య అనేది ఎవ్వరికైనా రాగల అనూహ్యమైన విపత్తు. ఉన్నపళంగా అనారోగ్యం పడిన వారి జీవితాలు ఒక్కసారిగా కుదేలైపోతాయి. చికిత్సలకు అతి ఎక్కువ ఖర్చులు కాగల రోగాన బారినపడితే జీవితాలు మొత్తం ఛిద్రం పోతుంటాయి…

ఆరోగ్య సమస్య అనేది ఎవ్వరికైనా రాగల అనూహ్యమైన విపత్తు. ఉన్నపళంగా అనారోగ్యం పడిన వారి జీవితాలు ఒక్కసారిగా కుదేలైపోతాయి. చికిత్సలకు అతి ఎక్కువ ఖర్చులు కాగల రోగాన బారినపడితే జీవితాలు మొత్తం ఛిద్రం పోతుంటాయి కూడా. మధ్యతరగతి వారు కూడా ఆ ఖర్చులను తట్టుకోలేరు. అలాంటి సందర్భాల్లో ఆత్మీయుల సాయం కోరడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బహిరంగంగా కూడా ఆర్థిక సాయం అర్థిస్తూ ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్ టీవీ కార్యక్రమం నటుడు పంచ్ ప్రసాద్ విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంది.

పంచ్ ప్రసాద్ కు చాన్నాళ్ల కిందట రెండు కిడ్నీలు పాడయ్యాయి. డయాలసిస్ ఇతర చికిత్సలు క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం మరింతగా విషమించడంతో తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి చేయాల్సిందేనని డాక్టర్లు హెచ్చరించారట. కిడ్నీ మార్పిడి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో దయచేసి దాతలు మాకు సహకరించండి అంటూ పంచ్ ప్రసాద్ కు మిత్రుడైన మరో నటుడు నూకరాజు వీడియో తయారుచేసి విడుదల చేశాడు.

సాధారణంగా ఇలాంటి మధ్యస్థాయి సెలబ్రిటీలు కానక్కర్లేదు.. నిరుపేదలకైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు మీడియా సహకరిస్తుంది. వారి గురించి ప్రచారం చేసి.. దాతల ఔదార్యంతో వారు కుదుటపడేలా.. వారికి సొమ్ము అందేలా సహకరిస్తుంది. అలాంటి పాత్రను పంచ్ ప్రసాద్ విషయంలోనూ దాదాపుగా ఇతర మీడియా సంస్థలు కూడా పాటిస్తున్నాయి.

కానీ తమాషా ఏంటంటే.. పంచ్ ప్రసాద్ జబర్దస్త్ కమెడియన్ గానే సెలబ్రిటీ అయ్యారు. జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసాద్ పంచ్ ల వల్ల అతిగా లాభపడినది ఎవరైనా ఉంటే.. వారు ఆ కార్యక్రమ రూపకర్తలు, ప్రసారం చేసే ఈటీవీ మాత్రమే. ఈటీవీ లాంటి పెద్ద సంస్థ ప్రసాద్ లాంటి వ్యక్తి అవసరంలో ఉన్నప్పుడు ఎంతైనా సాయం చేయవచ్చు. 

తమ ఈటీవీ కుటుంబంలోని నటుడిని కాపాడడానికి చిటికెలో అవసరమైనది చేయవచ్చు. కానీ అలా ముందుకు రాకపోగా.. నూకరాజు చేసిన వీడియోను బ్యానర్ వార్తలలో ఉంచి మరీ ఈనాడు వెబ్ సైట్ ద్వారా ప్రచారంలో పెట్టడం, పంచ్ ప్రసాద్ తరఫున ఈనాడు వెబ్ సైట్ లో ప్రముఖంగా పెట్టడం అనేది చిత్రంగా ఉంది. 

చిన్న సంస్థలు, వేరే గతిలేని వ్యక్తుల గురించి ఇలా చేసినా ఓకే.. తమ గ్రూపునకే చెందిన నటుడు.. తమ కార్యక్రమాల్లో చేసే వాడిని ఆదుకోవడానికి తామే ముందుకు రావొచ్చు కదా.. అందరినీ ఇలా జోలెపట్టి అడిగేకంటే.. అని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.