ఏపీ నుంచి సేఫేనా…టెన్షన్ పుట్టిస్తున్న ఫోన్ నంబర్లు

ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వారంతా క్షేమమేనా అన్నదే ఇపుడు అందరిలో నెలకొని ఉన్న ఆందోళన. దీని మీద ఏపీ ప్రభుత్వం రోజంతా సమీక్షలు చేస్తూ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. మూడు రైళ్ళు…

ఒడిషా రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన వారంతా క్షేమమేనా అన్నదే ఇపుడు అందరిలో నెలకొని ఉన్న ఆందోళన. దీని మీద ఏపీ ప్రభుత్వం రోజంతా సమీక్షలు చేస్తూ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. మూడు రైళ్ళు ఢీ కొట్టిన ఘటనలో మూడు వందల మంది దాకా మరణించారు. అందులో కోరమాండల్ లో ఎంత మంది ఎక్కారు, యశ్వంతపూర్ లో ఎంతమంది ఏపీ వారు ఉన్నారు అన్న దాని మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు వివరాలు అందించారు.

ఆయన ఇచ్చిన మ్యాటర్ చూస్తే ఇప్పటిదాకా ఏపీ వారు ఎవరూ చనిపోలేదు అన్నది ఒక శుభవార్తగా ఉంది. అయితే చాలా మంది ఫోన్లు స్విచాఫ్ లో ఉన్నాయి. దాంతో ఆ ఫోన్ నంబర్లే ఇపుడు టెన్షన్ పుట్టిస్తున్నాయి. కోరమాండల్ లో 482 మంది ఏపీకి చెందిన ప్రయాణికులు ఉన్నారని, అందులో 309 మంది విశాఖపట్నంలో దిగాల్సిన వారు, 31 మంది రాజమండ్రిలో దిగాల్సిన వారు, ఐదుగురు ఏలూరులో దిగాల్సిన వారు, 137 మంది విజయవాడలో దిగాల్సిన వారు ఉన్నట్లుగా మంత్రి వివరాలు అందించారు.

ఇలా చూస్తే కోరమాండల్ ప్రయాణికుల్లో 267 మంది సురక్షితంగా ఉన్నారని, 20 మంది స్వల్పంగా గాయపడ్డారన్నారు. 82 మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇందులో నుంచి చూస్తే  113 మంది ప్రయాణీకుల ఫోన్లు మత్రం లిఫ్ట్ చేయకపోవడం లేదా స్విచ్చాఫ్ కావడం జరిగిందని ఆయన చెప్పారు. దీంతో ఇపుడు వీరి పూర్తి సమాచారం తెలిస్తే తప్ప ఏపీ వారంతా సేఫ్ అని చెప్పే పరిష్తితి లేదు అంటున్నారు.

అలాగే యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీ నుండి 89 మంది రిజర్వ్ చేసుకున్నట్లుగా మంత్రి బొత్స  చెప్పారు. విశాఖ నుండి 33, రాజమండ్రి నుండి ముగ్గురు, ఏలూరు నుండి ఒక్కరు, విజయవాడ నుండి 41 మంది, బాపట్ల నుండి 8 మంది, నెల్లూరు నుండి ముగ్గురు ఉన్నట్లు చెప్పారు. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని, స్వల్పంగా గాయాలయ్యాయన్నారు. పదిమంది రైలు ఎక్కలేదని అధికారిక లెక్కలనే ఆయన పేర్కొన్నారు.

ఇందులో కూడా 28 మంది ఫోన్లు ఎత్తకపోవడమో లేదా స్విచ్ఛాఫ్ చేయడమో జరిగిందని అన్నారు. అలా వారి సమాచారం సేకరించే పనిలో ఏపీ అధికారిక యంత్రాంగం ఇపుడు బిజీగా ఉంది. కోరమాండల్ లో 113, యశ్వంతపూర్ లో 28 మంది అంటే 141 మంది ఆచూకీ ఇంకా ఏపీ ప్రభుత్వానికి తెలియడంలేదు. ఇది పెద్ద నంబరే. ఇందులో ఎవరి పరిస్థితి ఏంటి అన్నది వారి ఫోన్ నంబర్ల ద్వారా అయినా తెలియాలి. లేదా అక్కడికి వెళ్ళిన అధికారిక బృందం సేకరించే సమాచారం బట్టి అయినా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అంతవరకూ ఈ టెన్షన్ తప్పకపోవచ్చు.