ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్ల పర్వానికి తెరలేచింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలు అసెంబ్లీ, శాసనమండలిలో రగడకు దారి తీశాయి. ఈ అంశంపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడం, దాన్ని స్పీకర్ తిరస్కరించడంతో గొడవ మొదలైంది.
చివరికి అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ వరకూ వెళ్లింది. సభలో సభ్యుల హక్కులను హరించేలా టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి, తమ్మినేనిపై కాగితాలు చించి, విసిరి చల్లడంతో గందరగోళం నెలకుంది. తమతమ స్థానాల్లో కూచొని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే కోరారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వినిపించు కోకుండా గొడవను కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు సభ్యులను సభ నుంచి బయటికి పంపేందుకు స్పీకర్ నిర్ణయించారు.
సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు ఐదుగురు టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. శాసనసభా సమావేశాలు ముగిసే వరకూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, బాలవీరాంజనేయులను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.
సభ నుంచి గౌరవంగా వెళ్లిపోవాలని ఆయన కోరారు. అయినప్పటికీ అక్కడి నుంచి వారు కదలకపోవడంతో మార్షల్స్‌ను స్పీకర్ పిలిపించారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మాత్రం రెండుమూడు రోజులు గడిచిన తర్వాత ఆ సీన్ కనిపించింది.