సల్మాన్ ఖాన్ నటించే తొలి తెలుగు సినిమాకు రంగం సిద్ధమైంది. గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించడానికి సల్మాన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ లో సల్మాన్ జాయిన్ అయ్యాడు.
ముంబయిలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో చిరంజీవి-సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో షూటింగ్ మొదలైంది. దర్శకుడు మోహన్ రాజా, వీళ్లిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాడు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ నుంచి ముంబయి వెళ్లారు చిరంజీవి.
మెగా కాంపౌండ్ కు సల్మాన్ ఖాన్ కు మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. గతంలో రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సల్మాన్ మంచి సహకారం అందించాడు. సల్మాన్ నటించిన ఓ సినిమాకు తెలుగులో రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు. చిరు-సల్మాన్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది.
దీంతో చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ లో గెస్ట్ రోల్ చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. అలా ఈ సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ వచ్చింది. మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది గాడ్ ఫాదర్. మలయాళీ వెర్షన్ లో పృధ్వీరాజ్ పోషించిన పాత్రను, గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. తెలుగు వెర్షన్ కు వచ్చేసరికి చాలా మార్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజా.
పొలిటికల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలోకి వస్తుందని దర్శకుడు ఇదివరకే ప్రకటించాడు.