కాన్సర్ సోకకుండా జాగ్రత్తపడిన చిరంజీవి

తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. కాన్సర్ బారిన పడకుండా, తృటిలో తప్పించుకున్న విషయాన్ని ఆయన బయటపెట్టారు. Advertisement “నా అభిమానులు కొంతమంది కాన్సర్ బారినపడడం చాలా బాధాకరం. కాన్సర్ పై…

తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయాన్ని వెల్లడించారు చిరంజీవి. కాన్సర్ బారిన పడకుండా, తృటిలో తప్పించుకున్న విషయాన్ని ఆయన బయటపెట్టారు.

“నా అభిమానులు కొంతమంది కాన్సర్ బారినపడడం చాలా బాధాకరం. కాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. దీనికి సంబంధించి ఓ సీరియస్ విషయాన్ని చెబుతాను. నేను రోజూ వ్యాయామం చేస్తాను, మంచి ఫుడ్ తింటాను, నాకేం జబ్బులు రావు అనే ఫీలింగ్ తో ఉంటాను. నాకు చెడు అలవాట్లు కూడా లేవు. కానీ అలా అనుకోవడానికి వీల్లేదు. ఈమధ్య ఏఐజీ హాస్పిటల్ లో కొలనోస్కోప్ చేయించుకున్నాను. కొలన్ లో పాలిప్స్ ఉన్నాయి, వాటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంగా మారుతుంది. నాకు అలాంటి పాలిప్స్ రెండు ఉన్నాయి. వెంటనే వైద్యులు సర్జరీ చేసి వాటిని తొలిగించారు. నాకు అవగాహన ఉంది కాబట్టి పెద్ద పేగు కాన్సర్ బారిన పడకుండా జాగ్రత్త పడగలిగాను. లేదంటే, 2-3 ఏళ్ల తర్వాత నా పరిస్థితి ఎలా ఉండేదో నాకే తెలీదు.”

ఇలా కాన్సర్ సోకకుండా జాగ్రత్తపడిన విషయాన్ని బయటపెట్టారు చిరంజీవి.  తాజాగా కూడా మరోసారి కొలోన్ టెస్ట్ చేయించుకున్నానని, ప్రస్తుతం తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు చిరు.

అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు చిరంజీవి.. మరీ ముఖ్యంగా కాన్సర్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని, డాక్టర్లు క్లినిక్స్ లో ఈగలు తోలుకునే పరిస్థితి తీసుకురావాలంటూ, వైద్యుల ముందే పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఓ కాన్సర్ హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా ఈ విషయాల్ని వెల్లడించారు చిరు.

కాన్సర్ పై అందరికీ అవగాహన కల్పించేలా వైద్యులు చొరవ చూపాలని, ఇక సినీ కార్మికులకు కాన్సర్ కు సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు చేయాలని, వైద్యులను కోరారు చిరంజీవి. దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా తను భరిస్తానని వెల్లడించారు. ఇక చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ను, హాస్పిటల్స్ కు అనుసంధానం చేసి కాన్సర్ పై పోరాటం చేయడానికి తను ఎప్పుడూ సిద్ధమని ప్రకటించారు చిరంజీవి.