ఏపీ స్పీక‌ర్‌ను చుట్టుముట్టి…

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న‌తో ర‌సాభాస అయ్యాయి. స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళాన్ని సృష్టించారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ పోడియాన్ని చుట్టుముట్టి ఆయ‌న‌పై పేప‌ర్లు చించి, విసిరేయ‌డం గ‌మ‌నార్హం. బ‌డ్జెట్ స‌మావేశాలను టీడీపీ…

ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు టీడీపీ స‌భ్యుల ఆందోళ‌న‌తో ర‌సాభాస అయ్యాయి. స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళాన్ని సృష్టించారు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారామ్ పోడియాన్ని చుట్టుముట్టి ఆయ‌న‌పై పేప‌ర్లు చించి, విసిరేయ‌డం గ‌మ‌నార్హం. బ‌డ్జెట్ స‌మావేశాలను టీడీపీ స‌భ్యులు అడ్డుకోడానికి ప్ర‌ధాన కార‌ణం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా జంగారెడ్డిగూడెం ఘ‌ట‌న‌. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై చర్చకు టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబ‌ట్ట‌డంతో వివాదం నెల‌కుంది.

టీడీపీ స‌భ్యుల డిమాండ్‌కు స్పీక‌ర్ అనుమ‌తించ‌లేదు. దీంతో బ‌డ్జెట్ స‌మావేశాల‌ను ముందుకు సాగ‌నివ్వ‌కుండా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు అడ్డుకున్నారు. స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన‌డంతో స‌భ‌ను కొంత‌సేపు వాయిదా వేశారు. ఆ త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైనా అదే ప‌రిస్థితి. టీడీపీ స‌భ్యులు వెన‌క్కి త‌గ్గ‌లేదు.

స‌భ వాయిదా అనంత‌రం తిరిగి ప్రారంభ‌మ‌య్యాక టీడీపీ స‌భ్యులు మ‌రింత రెచ్చిపోయారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియం పైకెక్కి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. కాగితాలు చింపి తమ్మినేనిపై విసిరేశారు. టీడీపీ సభ్యుల ప్ర‌వ‌ర్త‌న‌పై ప‌లువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగారు.  

సహజ మరణాలను కూడా అక్రమ మద్యం మరణాలంటున్నారని అధికార పార్టీ నేత‌లు ఎదురు దాడికి దిగారు. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ  ప్రభుత్వం చర్చకు సిద్ధమన్నా… స్పీకర్‌పై టీడీపీ సభ్యులు కాగితాలు విసిరారన్నారు. జంగారెడ్డిగూడెంలో మరణాలపై డిప్యూటీ సీఎం వెళ్లి పరిశీలన చేశారన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై బాధిత కుటుంబం ఎక్కడా ఆందోళన చేయలేదని పేర్కొన్నారు.