తెలుగుదేశం పార్టీ పునాదులు కమ్మ సామాజిక వర్గం మీదనే నిర్మితమయ్యాయనే భావన రాజకీయ వర్గాల్లో వుంది. ఎప్పటికీ అధికారం రెడ్ల కేనా అనే భావనతో నాదెండ్ల, ఎన్టీఆర్ లాంటి వారు కలిసి పార్టీ స్థాపించడం దానికి రామోజీ లాంటి వారి వెన్ను దన్ను లభించడం, అధికారం సాధించడం తెలిసిందే.
అప్పట్లో ఎన్టీఆర్ జిల్లాకు ఒకరైనా కమ్మ సామాజిక వర్గ ప్రతినిధి వుండాల్సిందే అని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వెదికి పట్టుకుని మరి కమ్మవారికి సీట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా పునాదుల్లో కమ్మవారు, పైకి బిసి ల పార్టీ అనే కలర్ ఇస్తూ వచ్చారు. వైఎస్ జమానా నుంచి అసలు రంగు సదా బయటపెడుతూ వచ్చారు. దాంతో ఇప్పుడు ఆంధ్రలో కులాల డివిజన్ క్లియర్ గా కనిపిస్తూనే వుంది. అయినా కూడా వైకాపా రెడ్ల పార్టీ అని ఆరోపించే తెలుగుదేశం జనాలు తమది కమ్మ పార్టీ అని మాత్రం అంగీకరించరు.
అయితే తెలుగుదేశం పార్టీ విధి విధానాలను శాసించేది, నడిపించేది, బతికించేది కమ్మ సామాజిక వర్గమే. అది మరోసారి క్లారిటీ ఇచ్చారు సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్రజ్యోతి ఆర్కే. ఆయన ఈ మేరకు ఈవారం తన కొత్త పలుకులో ఓ విషయం వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవద్దు అని తెలుగుదేశం పార్టీని కమ్మ సామాజిక వర్గానికి చెందిన సెటిలర్స్ వత్తిడి చేస్తున్నారట. అలా పోటీ చేస్తే తామంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సి వస్తుందని, అప్పుడు ఓట్లు చీలిపోయి తెరాస గెలుస్తుందని లెక్కలు వేస్తున్నారట. తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోతే తాము కాంగ్రెస్ కు ఓటు వేసి, తెరాస ను గద్దె దింపవచ్చు అన్నది కమ్మ సామాజిక వర్గం భావన అంట.
అంతే కాదు, తెలంగాణలో భాజపా-జనసేన-తేదేపా కూటమి ప్లాన్ చేయాలని భాజపా అనుకుంటూ వున్నా కూడా సెటిలర్లలో కమ్మ వర్గం వద్దని అంటోందట. అలా చేస్తే మళ్లీ కేసీఆర్ ను బలోపేత చేసినట్లు అవుతుందని భావిస్తోందట. ఎందుకంటే లోకల్-నాన్ లోకల్ ఫీల్ ను తీసుకువస్తారు కదా. అందుకే ఏ పోటీ లేకుండా వదిలేస్తే, సెటిలర్స్ అంతా కాంగ్రెస్ కు ఓటు వేస్తారనేది వారి భావన కావచ్చు. ఆర్కే రాసిన కొత్త పలుకు చెబుతున్న అంతరార్ధం ఇదే.
సరే ఇదంతా జగన్ కు సహకరిస్తున్న కేసీఆర్, భాజపాల మీద కోపం కావచ్చు. సహజంగానే తమ శతృవుకి మిత్రుడు.. తమకూ శతృవే అవుతారు కదా. ఆ లాజిక్ తో కావచ్చు.
మొత్తం మీద ఒకటి క్లారిటీ కమ్మ సామాజిక వర్గం వత్తిడికి తెలుగుదేశం పార్టీ తల వొగ్గి తెలంగాణలో పోటీ అన్నదే విస్మరిస్తే, ఆ పార్టీని తెరవెనుక నుంచి నడుపుతున్నది ఆ వర్గమే అన్న వాదన బలపడుతుంది కదా?