ఎమిల్ చోరాన్ (Emil Cioran) అనే రొమేనియన్ తత్వవేత్త ఓ సందర్భంలో సోక్రటీసు చివరి క్షణాల గురించి ఓ విషయాన్ని వెల్లడించాడు. సోక్రటీసుకు యువతరాన్ని తన మాటలతో చెడగొడుతున్నాడనే నేరం మీద మరణశిక్ష విధించారు. విషం ఇచ్చి చంపాలని నిర్ణయించారు. మరణ శిక్ష అమలు చేసే సమయం ఆసన్నం అయిన తర్వాత.. జైలు సిబ్బంది ఆయన కోసం హెమ్లాక్ (గన్నేరు వేళ్ల తరహాలో ఒక చెట్టునుంచి తీసే విషం) తయారుచేస్తున్న సమయంలో.. సోక్రటీసు మాత్రం చాలా ప్రశాంతంగా ఫ్లూటును మధురంగా వాయించడం ఎలాగో నేర్చుకుంటున్నాడు. మరణశిక్ష అమలు కావడానికి ముందురోజు ఆయనను కలిసిన శిష్యుల్లో ఒకరు ఇలా అడిగారు..
‘‘తమకేమిటి దానివలన ఉపయోగం?’’
‘‘కనీసం నేను చనిపోయే లోగా, ఫ్లూటును మధురంగా వాయించడం ఎలాగో నేర్చుకున్నట్టు అవుతుంది కదా!’’ జవాబు చెప్పాడు సోక్రటీసు.
కార్త్యాయని అమ్మ, సోక్రటీసు కంటె చాలా గొప్పది అనిపించింది నాకు. ఆమె మరణించినదనే వార్త చూసిన తర్వాత! సోక్రటీసు దేముంది? ఎన్నో విద్యలను నేర్చిన, ఎందరో శిష్యప్రశిష్యులను కలిగి ఉన్న ఆయన, 71 ఏళ్ల వయసులో ఫ్లూటు నేర్చుకోవడంలో అంత ఘనత ఏముంది? అదే కార్త్యాయని అమ్మ అయితే.. ఏకంగా తొంభై ఏళ్లు దాటిన తర్వాత ప్రారంభించింది.
సోక్రటీసు లాగా ఫ్లూటో, మరో చిత్రలేఖనమో కాదు. మామూలు చదువు సంధ్యలకే ఆమె అప్పుడు శ్రీకారం దిద్దింది. కేరళ ప్రభుత్వం వారి అక్షరాస్యతా మిషన్ లో తొంభయ్యేళ్లు దాటిన తర్వాత విద్యార్థి జీవితాన్ని మొదలుపెట్టిన స్ఫూర్తిదాయక మహిళ ఆమె. 2018లో కేరళ ప్రభుత్వం వయోజన విద్య అభ్యసించే వారికి నిర్వహించిన ‘అక్షర లక్షం’ అనే పరీక్షలో 100కు 98 శాతం మార్కులు సాధించి, ఆ పరీక్షకు హాజరైన 40,362 మందిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అప్పుడు ఆమె వయసు 96!
అళప్పుజలోని హరిపాద్ మునిసిపాలిటీలో ఆలయాల వెలుపల వీధులను ఊడ్చడమే బతుకుతెరువుగా ఆరుగురు పిల్లలను పెంచి పెద్దచేసిన ఈ విధవ.. పిల్లలు, మనవలు అందరూ పెద్దవాళ్లయ్యాక చదువుకోవడం మొదలెట్టింది. తన శ్రద్ధకు ప్రశంసగా ప్రభుత్వం నుంచి నారీశక్తి పురస్కారాన్ని పొందింది. దూరవిద్యను ప్రచారం చేయడానికి 53 సభ్యదేశాలున్న కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్ గా సేవలందించింది. అలాంటి కార్త్యాయని అమ్మ 101 ఏళ్ల వయసులో ఇటీవల మరణించింది. ముఖ్యమంత్రి కూడా సంతాపం వెలిబుచ్చి, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించారు.
నాకొక స్నేహితురాలు ఉంది. ప్రభుత్వ టీచరు. హైదరాబాదులో నివాసం.. ఎక్కడో దూరాన మారుమూలపల్లెలో ఉద్యోగం! బడివేళలకు అదనంగా.. ప్రతిరోజూ అయిదుగంటలు ప్రయాణంలోనే గడుపుతుంటుంది. నిత్యవిద్యార్థిగా ఉండాలనుకునే లక్షణాన్ని, నేను గమనించిన మరో వ్యక్తి ఆమె. నడివయసు దాటాక కొన్ని సంవత్సరాలపాటు సంగీతం నేర్చుకుంది. స్కూలు టీచర్లకు స్పోకెన్ ఇంగ్లిషు నేర్పే ఆన్ లైన్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. శ్రద్ధగా అందులో చేరింది. సాయంత్రం 6 నుంచి 7 వరకు జూమ్‌లో ఆ తరగతి నడుస్తుంది! ఆ వేళకు ఆమె నగరంలోని ఇల్లు చేరడం అసాధ్యం. ప్రతిసాయంత్రం 6 గంటలు అవుతుండగా.. స్కూలునుంచి తిరుగు ప్రయాణంలో ఎక్కడ ఉంటే అక్కడి బస్టాపులో దిగేసి.. ఆ స్టాపులోనే కూర్చుని, ఫోనులో పాఠం వింటూ, చెప్పే నోట్సు మొత్తం రాసుకుంటూ క్లాసంతా అయిపోయిన తర్వాత.. నెమ్మదిగా ఇల్లు చేరుతుంది.
ఇంకో మిత్రుడున్నాడు. ఆర్జనే లక్ష్యమైన పరుగుపందెంలో, ఆర్కిటెక్చర్ పూర్తి చేసిందే తడవుగా, అడుగుపెట్టాడు. బతుకు మలిజాము గడిచిపోయేదాకా పరుగే. కోట్లు వెనకేశాడు. ఇప్పుడు గాలి మళ్లింది. ఒకవైపు బీఏ, మరోవైపు ఏంబీఏ (తత్సమానమైన చదువు) చేరి ముచ్చట తీర్చుకుంటున్నాడు.
నిజానికి ఉద్యోగం, ఉద్యోగాల్లో పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇలాంటి వాటికోసం చదివేవాళ్లు మనకు రిటైర్మెంటు వయసు దాకా కనిపిస్తూనే ఉంటారు. కానీ ఈ రెండు ఉదాహరణల్లో వీరికి ఆ చదువుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదు. నేర్చుకోవాలనే ముచ్చట తీరడం, నేర్చుకున్న తర్వాత దక్కే తృప్తి తప్ప! ‘ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే’ అని చెప్పిన సూక్తికారుని అవగాహనకు వీరు అతీతులు.
‘విద్యార్థిత్వం’ అనేది జీవ లక్షణం. ‘ఇంత వయసొచ్చింది.. ఇంకేం నేర్చుకుంటాం లే’ అనే నిర్లిప్తత మృత్యులక్షణం.
మనిషిలో నేర్చుకోవడం పట్ల ఒక జిజ్ఞాస, ఒక తృష్ణ ఉండాలి. అది నిత్యమై ఉండాలి! సాధారణంగా మనలో చాలా మంది, చదువుల్ని అనేక అనివార్యతల మధ్య అదొక భారం అన్నట్లుగానే పూర్తిచేస్తుంటారు. అచ్చంగా ‘చదువులు’ అనే కాదు. ఏదైనా సరే ఒక విషయాన్ని నేర్చుకోవడం పట్ల అనురక్తితో, ఇష్టంతో అడుగులు వేయడం మనకు ప్రాథమిక లక్షణంగా ఉండాలి. నేర్చుకోవడం అంటే చదువు- డిగ్రీలు మాత్రమే అని భావించి, వాటిని మొక్కుబడిగా పూర్తిచేసిన వారు, ఆ పిమ్మట తమకు ఏ ఉద్యోగమో దొరికిందంటే గనుక.. అక్కడితో చదువుల, నేర్చుకోవడం అనే ప్రయత్నాల పరమార్థం నెరవేరినట్లుగానే భావిస్తుంటారు.
ఏ వ్యక్తి జీవితంలోనైనా చాలా దుర్మార్గమైన, పతనానికి బీజం వేసే దశ అది! తాము నేర్చుకున్నది చాలు.. ‘ఇక నేర్చుకోవాల్సినది ఏమీ లేదు’ అని ఏ ఒక్కరైనా ఏ లిప్తపాటు అయినా అనుకున్నారంటే గనుక.. ఆ క్షణమే వారి మరణఘడియ! జీవించడంలోని మాధుర్యం నేర్చుకోవడంలోనే ఉంటుంది. మనల్ని మనం ఎప్పటికీ నిత్యవిద్యార్థిగా పరిగణించుకుంటూ ఉండాలి.
డాక్టర్లు, లాయర్లు, అటువంటి కొన్ని నిత్యచైతన్యశీలమైన వృత్తుల్లో తమను తాము దిద్దుకుంటున్న వారిలో కొందరు.. తమ వృత్తిగత ప్రస్థానంలో ఎంతగానో ఎదిగిన తర్వాత కూడా, కొత్తవారితో పరిచయం చేసుకునేప్పుడు.. ‘I am a student of Medicine/Law’ అని చెప్పే పోకడను మనం గమనిస్తుంటాం. అలా చెప్పుకునే మాటల్లో మనకు వారిలోని వినయశీలత మాత్రమే కాదు, వారిలోని నిత్య విద్యార్థిత్వం కూడా నిండుగా కనిపిస్తుంది. ‘బతుకంటే నేరుస్తూ ఉండడమే..’ అనే జీవనశైలుల సిద్ధాంతానికి వారు ప్రతీకలుగా కనిపిస్తారు.
ఆధునికతరంలో.. సాంకేతికత ప్రతి జీవితాన్ని శాసిస్తున్నది. కంప్యూటర్లు జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయని అనుకున్న మాటలు కూడా పాతబడ్డాయి. ఇప్పుడు అరచేతి మొబైల్‌లోకి వచ్చిన సాంకేతిక విప్లవమే జీవితాలను నడిపిస్తోంది! సాంకేతికత- కొత్త పుంతలు తొక్కుతూ క్రమానుగతంగా పరిణామం చెందుతూ, ఇంకా ఎన్నెన్ని కొత్త రూపాలు సంతరించుకుని మన జీవితాల్లోకి అనివార్యంగా చొరబడుతుందో ఇప్పుడే చెప్పలేం. ఇలాంటి తరంలో.. ‘విద్యార్థిత్వం’ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఒక మౌలిక లక్షణంగా ఇమిడిపోవాలి.
ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదని అనుకునే వారు అనేకమంది తారసిల్లుతారు. తమ వృత్తి వాతావరణంలో వచ్చే కొత్తదనాన్ని కూడా వారు ఆహ్వానించరు! అలాంటివారు ఖచ్చితంగా వెనుకబడే ఉంటారు. నిత్యవిద్యార్థులుగా ప్రతిదీ నేర్చుకుంటూ దూసుకువెళ్లే వారిని చూసి ఓర్వలేని మాటలు అంటూ.. తమ తమ జీవితాలను అసహనంతో, అసంతృప్తితో నింపేసుకుంటూ ఉంటారు. ఏ వృత్తిని ఎన్నుకున్న వారైనా సరే.. వారి వృత్తిగత అంశానికి సంబంధించి, దానికి అనుబంధంగా ఉండే మరో అంశాన్ని/ విద్యను నేర్చుకోవడం అనేది వారిని పరిణతిగల వారిగా తయారుచేస్తుంది. ఉద్యోగ, కుటుంబ వాతావరణంలో ఉండగల అన్ని పనులను కొంత మేరకైనా నేర్చుకోవడం అనేది వ్యక్తుల్ని సంపూర్ణంగా తీర్చిదిద్దుతుంది.
నిజం చెప్పాలంటే.. ఇలా నేర్చుకోవడం వలన ఇతరుల మీద ఆధారపడాల్సిన అగత్యం తగ్గుతుంది. దీని ప్రభావంతో అంతిమంగా వారి ఆత్మవిశ్వాసమే పెరుగుతుంది!
నేర్చుకుంటూ ఉండే లక్షణం- మన జీవితాలను ప్రతిసారీ మనకే కొత్తగా పరిచయం చేస్తూ ఉంటుంది. రొటీన్‌లో పడిపోయామనే నిస్పృహను దరిజేరనివ్వకుండా ఉంటుంది. మన జీవితం మనకే పాచివాసన కొట్టకుండా ఉండాలంటే.. నిత్యఉషోదయంగా కెంజాయ వెలుగులు.. నిత్య రమణీయమైన సుగంధ పరిమళాలతో చివరి వరకు సాగుతూ ఉండాలంటే.. ‘విద్యార్థిత్వమే’ ఆధరవు.
కాక దృష్టి బక ధ్యానం – శ్వాన నిద్ర తథైవ చ|
అల్పాహారం జీర్ణవస్త్రం – ఏతత్ విద్యార్థి లక్షణమ్||
.. అంటూ చాణక్యనీతిలో ఒక శ్లోకం ఉంటుంది.
విద్యార్థి అయిన వాడికి.. కాకిలాగా సూక్ష్మ దృష్టి, కొంగలాగా ఎంత సేపైనా తాను ఆశించినది లభించేంత వరకు నిరీక్షించగల ఏకాగ్రత, కుక్కలాగా ఎంత నిద్రలో ఉన్నా ఏ చిన్న అలికిడికైనా వెంటనే మేల్కొనగలిగే మెలకువ, మితాహారం, వస్త్రధారణపై అనాసక్తి ఉండాలంటాడు చాణక్యుడు. నిజానికి ఈ లక్షణాలన్నీ విద్యాసంస్థల్లో చదువుకునే వయసులో ప్రతి ఒక్కరికీ అవసరమే అనిపిస్తుంది. కానీ వయస్సు మళ్లిన తర్వాత కూడా.. వయస్సు అనేది ఒక ప్రాతిపదికగా ఎప్పటికీ గుర్తించకుండా.. ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని అనుకునే వారికి ఇలాంటి ‘పంచ లక్షణాల’ అవసరం లేదు.
చదువు వల్ల.. ఎలాంటి లబ్ధి, ప్రయోజనం ఉంటుందనే ఆశ లేకపోయినా.. తొంభైఆరేళ్ల వయసులో ప్రారంభించిన కార్త్యాయని అమ్మ స్ఫూర్తి మనలో ఉండాలి. ఏది నేర్చుకోడానికైనా better late than never అనే సిద్ధాంతం మనకు చోదకశక్తి కావాలి. ఇలాంటి ప్రయత్నంలో నిత్యవిద్యార్థులుగా, అసలైన జీవలక్షణంతో తమ తమ జీవితాలను పరిపుష్టం చేసుకోవాలని అనుకునేవారికి మౌలికంగా కొన్ని లక్షణాలు అవసరం.
నేర్చుకోదలచుకున్న అంశం మీద ఇష్టం!
నేర్చుకోవాలనే తృష్ణ, జిజ్ఞాస!
నేర్చుకోవడం పూర్తయ్యే వరకు తారసిల్లే అన్ని రకాల ప్రతిబంధకాలకు ఎదురొడ్డి నిలవగల సాహసం!
మడమ తిప్పకుండా.. పరిపూర్ణమైన తృప్తిని ఆస్వాదించే వరకు ఆగే ఓరిమి!
.. కె.ఎ. మునిసురేష్ పిళ్లె