ప్లీజ్ సార్‌…త‌మ్మినేనికి గంటా వేడుకోలు!

రాజ‌కీయాలు కూడా వ్యాపార‌మే అని నిరూపించ‌డంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు విజ‌య‌వంతం అయ్యారు. అధికారం ఎక్క‌డుంటే అక్క‌డ వాలే గంటా రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించాల్సిన ప‌నిలేదు. ప్ర‌జారాజ్యం,…

రాజ‌కీయాలు కూడా వ్యాపార‌మే అని నిరూపించ‌డంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు విజ‌య‌వంతం అయ్యారు. అధికారం ఎక్క‌డుంటే అక్క‌డ వాలే గంటా రాజ‌కీయ ప్ర‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చించాల్సిన ప‌నిలేదు. ప్ర‌జారాజ్యం, కాంగ్రెస్‌, టీడీపీ… ప్ర‌స్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్న గంటా రాజ‌కీయ‌మే వేరు. ఐదేళ్ల‌కోసారి నియోజ‌క‌వ‌ర్గాన్ని మారుస్తూ, అసెంబ్లీలో అడుగు పెట్ట‌డం గంటా శ్రీ‌నివాస‌రావు ప్ర‌త్యేక‌త‌. 

గంటాపై ఎన్ని విమ‌ర్శ‌లొచ్చినా, ప్ర‌జ‌ల ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్ట‌డం ఆశ్చ‌ర్య‌మే. ఇదిలా ఉండ‌గా టీడీపీ అధికారానికి దూర‌మైన వెంట‌నే, ఆయ‌న ఆ పార్టీకి దూర‌మ‌య్యారు. అలాగ‌ని గంటా శ్రీ‌నివాస‌రావుపై వేటు వేసేందుకు టీడీపీ ఇష్ట‌ప‌డ‌లేదు. 

ఈ నేప‌థ్యంలో విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రైవేటీక‌రించ‌డాన్ని విశాఖ ఉత్త‌ర నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గంటా శ్రీ‌నివాస‌రావు వ్యూహాత్మ‌కంగా త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం వాడుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఏడాది క్రితం ఆయ‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి, ఉక్కు పోరాటంలో పైచేయి సాధించారు.

అయితే గంటా రాజీనామాను స్పీక‌ర్ త‌మ్మినేని ఆమోదించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌రోసారి త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కోరుతూ స్పీక‌ర్‌కు గంటా లేఖ రాయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని స్పీక‌ర్‌పై గంటా ఒత్తిడి తేవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో స్పీక‌ర్ ఫార్మాట్‌లో రాజీనామా చేశాన‌ని స్పీక‌ర్‌కు గంటా గుర్తు చేశారు. ఏడాదికి పైగా ఉక్కు కార్మికులు ఆందోళ‌న చేస్తున్నా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. ఈ నేప‌థ్యంలో త‌న రాజీనామాను ఆమోదించాల‌ని ఆయ‌న  కోరారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీ సెంటిమెంట్‌గా మారిన నేప‌థ్యంలో రాజీనామాను ఆమోదించ‌డం ద్వారా అన‌వ‌స‌రంగా కొత్త స‌మ‌స్య‌ను తెచ్చుకున్న‌ట్టు అవుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందుకే ఆయ‌న రాజీనామాపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకుండా స్పీక‌ర్ నాన్చివేత ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నారు.