కొత్త జిల్లాల ఏర్పాటుపై హైకోర్టులో జగన్ సర్కార్‌కు స్వల్ప ఊరట లభించింది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. సగం పాలన పూర్తయిన నేపథ్యంలో ఎన్నికల హామీని నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలను పునర్వ్యస్థీకరిస్తూ జీవోలు జారీ చేశారు.
జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయించడం పరిపాటైన నేపథ్యంలో … కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జిల్లాల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, ఆర్టికల్ 317(డి)కి వ్యతిరేకంగా జారీ చేసిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ గుంటూరు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఏ వ్యాజ్యం వెనుక ఎవరున్నారో ఏపీ ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జగన్ పాలనను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు న్యాయస్థానాలను వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా వుండగా ఉగాది నాడు కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని సదాశయంతో ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో పిల్‌లు టెన్షన్ కలిగించాయి. ఇవాళ ఆ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
కొత్త జిల్లాలపై తుది ప్రకటన రానందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు నిరాకరించడంతో జగన్ సర్కార్ ఊపిరి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. కొత్త జిల్లాల ఏర్పాటుపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
విచారణను 8 వారాల పాటు హైకోర్టు వాయిదా వేయడం గమనార్హం. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అడ్డంకులు తొలగినట్టేనని భావిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం మరింత సులభమవుతుందనేది ప్రభుత్వ ఆలోచన.