వానపాము కూడా లేచి ఆడుతోందే..!

అన్ని పాములూ లేచి ఆడితే.. వానపాము కూడా లేచి ఆడిందిట.. ఆ సామెత చందంగా ఉంది తెలుగుదేశంలోని బుద్ధా వెంకన్న పరిస్థితి. సొంత పార్టీలోని నాయకులు కూడా చాలా లేకి మాటలతో హేళన చేస్తూ…

అన్ని పాములూ లేచి ఆడితే.. వానపాము కూడా లేచి ఆడిందిట.. ఆ సామెత చందంగా ఉంది తెలుగుదేశంలోని బుద్ధా వెంకన్న పరిస్థితి. సొంత పార్టీలోని నాయకులు కూడా చాలా లేకి మాటలతో హేళన చేస్తూ ఉండే ఈ బుద్ధా వెంకన్న.. ఎప్పటిలాగే అర్థం పర్థం లేని, లాజిక్ లేని మాటలు మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టు.. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని.. అందరు తెలుగుదేశం నాయకుల్లాగానే బుద్దా వెంకన్న కూడా జీర్ణించుకోలేకపోయారు.

తెలుగుదేశం నాయకులు అందరూ ఈ బెయిల్ తీర్పును వీలైన ప్రతిచోటా విమర్శిస్తున్నారు. తాను ఇంకాస్త ఎక్కువ చేసి చంద్రబాబు దృష్టిలో మార్కులు కొట్టేయాలని అనుకున్నారో ఏమో గానీ.. బుద్దా వెంకన్న, తెలంగాణ హైకోర్టు తీర్పుపై తాను సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తానని అన్నారు. అసలు ఆ కేసుతో ఏ సంబంధమూ లేని బుద్దా వెంకన్న బెయిల్ రద్దు కోసం సుప్రీం తలుపుతడతానని అనడం పెద్ద కామెడీగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే.. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం వలన అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని ఉబలాటపడుతున్న సీబీఐకు భంగపాటు ఎదురైంది. అవినాష్ ను అరెస్టు చేస్తే చూడాలని నిరీక్షిస్తున్న వివేకా కూతురు సునీతకు భంగపాటు ఎదురైంది. ఆ రెండు పక్షాలూ ఈ కేసులో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నవారు. ఈ బెయిల్ రద్దును కోరుతూ వారిద్దరిలో ఎవరైనా సుప్రీంను ఆశ్రయించడం సబబుగా ఉంటుంది. అంతే తప్ప.. ఏ సంబంధమూ లేని బుద్దా వెంకన్న సుప్రీంలో కేసు వేస్తానని అనడం కామెడీగా ఉంది.

అలా వేయడానికి ఆయన చెప్పిన లాజిక్ ఇంకా చిల్లరగా ఉంది. 2019 ఎన్నికల్లో వివేకా హత్య కు సంబంధించి తెదేపాపై ఆరోపణలు చేసి వైసీపీ గెలిచిందిట. ఆ రకంగా తమ పార్టీకి నష్టం జరిగింది గనుక.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళతారట. ఇలాంటి తలాతోకా లేని లాజిక్ లను బుద్దా వెంకన్న మాత్రమే చెప్పగలరని జనం నవ్వుకుంటున్నారు.

అవినాష్ ను అరెస్టు చేయాలని సీబీఐ భావిస్తోంటే.. ఆయనకు కస్టోడియల్ విచారణ చేయాల్సినంత తప్పనిసరి పరిస్థితులు లేవని భావించిన తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింద. విచారణకు రావడం లేదనే సీబీఐ ఆరోపణలకు విరుగుడుగా ప్రతి శనివారం జూన్ నెల పొడవునా విచారణకు వెళ్లాలని కూడా అవినాష్ ను ఆదేశించింది. 

ఇక ఇందులో తప్పుపట్టడానికి ఏముందో, తప్పనిసరిగా అరెస్టు చేయాల్సిందే అని వీరు ఎలా కోరగలరో అర్థంకాని సంగతి. బుద్దా వెంకన్నకు ఈ లీగల్ ఎలిమెంట్స్ అక్కర్లేదు. ప్రెస్ మీట్ లో నాటకీయంగా నాలుగు మాటలు చెప్పగలిగితే చాలు అన్నట్టుగా ఉంది.